సింగూరు జలాలకు ఢోకా లేదు
● సింగూరు టెక్నికల్ కమిటీ నిర్ణయం
● వేసవిలో దాహార్తికి ఆటంకం ఉండబోదని భరోసా
తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా మరమ్మతులు
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి తాగునీటిని తరలిస్తున్న సింగూరు జలాలకు ఈ వేసవిలో ఢోకా లేదు. సింగూరు ఆనకట్టకు మరమ్మతు పనుల నేపథ్యంలో జలాశయంలోని నీటిని ఒకేసారి ఖాళీ చేయబోమని, వేసవిలో తాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం ఏర్పడదని సింగూరు టెక్నికల్ కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టులోని 16 టీఎంసీల నీటి నిల్వలో 9 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు రిజర్వ్‌గా ఉంచి, మిగిలిన నీటిని విడతల వారీగా విడుదల చేస్తూ మరమ్మతులు చేపట్టవచ్చని కమిటీ ప్రతిపాదించింది. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు జలాశయం నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా అవుతోంది. రోజువారీగా 40 నుంచి 50 ఎంఎల్డీ (మిలియన్ లీటర్లు) నీరు సరఫరా చేస్తున్నారు. కొన్నేళ్లుగా డ్యామ్ ఆనకట్టల్లో రివిట్‌మెంట్ డ్యామేజీ, 800 మీటర్ల పొడవునా ఆనకట్ట పగుళ్లతో బలహీన పడింది. దీంతో ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ. 19 కోట్లు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. సింగూరు జలాశయాన్ని ఒకేసారి పూర్తిగా ఖాళీ చేయకుండా, దెబ్బతిన్న భాగాలను విడతల వారీగా మరమ్మతులు చేపట్టాలని నీటి నిపుణుల కమిటీ నిర్ణయించడం నగరానికి తాగునీటి సరఫరాకు భరోసా లభించినట్లయింది. ఇటీవల ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ జనరల్ అంజద్ హుస్సేన్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ సాంకేతిక నిపుణుల కమిటీ బృందం సింగూరు ప్రాజెక్టును పరిశీలించింది. అనంతరం సమావేశపై తాగునీటికి ఇబ్బందులు లేకుండా నీటిని నిల్వ చేసి మరమ్మతులు చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించింది. ప్రాజెక్టులో దెబ్బతిన్న భాగాలకు డిసెంబర్ ఒకటి నుంచి పనులు చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరానికి తాగునీటికి ఇబ్బంది లేకుండా 9 టీఎంసీల నీటిని రిజర్వ్‌గా ఉంచుతారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీనిలో 6 టీఎంసీల నీటిని దిగువకు వదిలి 10 టీఎంసీలతో మరమ్మతులు చేపట్టేందుకు ఇరిగేషన్ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టులో ఏడు టీఎంసీలు నీరు ఉన్నా.. వేసవిలో పూర్తయ్యేవరకు హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేయవచ్చని జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌కు సింగూరు నుంచి వచ్చే నీరు మిషన్ భగీరథ పథకం ద్వారా నిరంతరం సరఫరా అవుతోంది.
సింగూర్ ప్రాజెక్టు (ఫైల్)


