తుపాకీ తాకట్టు? | - | Sakshi
Sakshi News home page

తుపాకీ తాకట్టు?

Nov 27 2025 11:25 AM | Updated on Nov 27 2025 11:25 AM

తుపాకీ తాకట్టు?

తుపాకీ తాకట్టు?

రికవరీ బంగారం స్వాహా చేసి.. ఆపై కుదువ పెట్టి

కనిపించకుండాపోయిన సర్వీస్‌ పిస్టల్‌

కేసు నమోదు.. సస్పెన్షన్‌ వేటు

తుపాకీ ఆచూకీ కోసం టాస్క్‌ఫోర్స్‌ విచారణ

అంబర్‌పేట్‌లో పని చేసిన 2020 బ్యాచ్‌ ఎస్‌ఐ

సాక్షి, సిటీబ్యూరో/అంబర్‌పేట:

గరంలోని అంబర్‌పేట పోలీసుస్టేషన్‌లో క్రైం ఎస్‌ఐగా పని చేసిన భాను ప్రకాష్‌రెడ్డి బరితెగించాడు. ఓ కేసులో నిందితుల నుంచి రికవరీ చేసిన బంగారం స్వాహా చేసి తాకట్టు పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తన సర్వీస్‌ పిస్టల్‌ విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అది మిస్సింగ్‌ అయింది. బంగారం గోల్‌మాల్‌ వ్యవహారంలో ఎస్‌ఐపై కేసు నమోదు చేసిన అంబర్‌పేట పోలీసులు మాయమైన పిస్టల్‌ విషయంపైనా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాష్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారిస్తున్నారు. ఇతగాడికి ఆంధ్రప్రదేశ్‌ లో గ్రూప్‌–2 ఉద్యోగం సైతం రావడం గమనార్హం.

బంగారం తిరిగి ఇవ్వకుండా తాత్సారం..

2020 బ్యాచ్‌కు చెందిన భాను ప్రకాష్‌ రెడ్డి గతంలో వేర్వేరు ఠాణాల్లో పని చేశాడు. ప్రస్తుతం అంబర్‌పేట క్రైం ఎస్‌ఐగా ఉన్న ఈయన ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన ఓ సర్వెంట్‌ థెఫ్ట్‌ కేసును దర్యాప్తు చేశాడు. యజమాని ఇంట్లో 5 తులాల బంగారం కాజేసిన పని వాళ్లను అరెస్టు చేసి, సొత్తు రికవరీ చేశారు. ఈ పసిడిని ఫిర్యాదుదారుడు కోర్టు ద్వారా తీసుకోవడానికి ష్యూరిటీలు సమర్పించాల్సి ఉంటుంది. అది ఇష్టం లేని యజమాని తన వద్ద పని చేశారన్న ఉద్దేశంతో నిందితులతో రాజీ చేసుకున్నారు. ఈ మేరకు లోక్‌ అదాలత్‌లో పిటిషన్‌ దాఖలు చేయడంతో కేసు మూసేశారు. ఆ బంగారం తిరిగి ఇవ్వడంలో ఎస్‌ఐ తాత్సారం చేస్తుండటంతో యజమాని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

కేసు దర్యాప్తులో ఉండగా మరో ఉదంతం..

ఉన్నతాధికారుల ఆదేశం మేరకు దీనిపై అంబర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో భానుప్రకాష్‌ రెడ్డి ఆ బంగారాన్ని స్థానిక యువకుడి ద్వారా తాకట్టు పెట్టించాడని, అలా వచ్చిన రూ.3 లక్షలు బెట్టింగ్‌కు వాడినట్లు తేలింది. ఈ కేసు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు భాను ప్రకాష్‌పై చర్యలకు ఉపక్రమించారు. ఇది దర్యాప్తులో ఉండగానే మరో విషయం వెలుగులోకి వచ్చింది. భానుప్రకాష్‌కు పోలీసు విభాగం కేటాయించిన సర్వీస్‌ పిస్టల్‌ మాయమైందని తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.

లాంగ్‌ లీవ్‌లో ఉండగా పిస్టల్‌ మాయం..

భాను ప్రకాష్‌ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ ఏడాది మే నుంచి రెండు నెలల పాటు సెలవులో ఉన్నాడు. ఆయుధాల ఆడిటింగ్‌ అదే మే నెలలో జరిగినప్పుడు తుపాకీ అతడి వద్ద ఉంది. సెలవులో వెళ్లే సమయంలో తన టేబుల్‌ సొరుగులోనే తూటాలు, తుపాకీ పెట్టానని అతడు చెబుతున్నాడు. ఈ నెల 12న మరోసారి ఆయుధాల ఆడిటింగ్‌ జరిగింది. ఈ సందర్భంలో ఆ తుపాకీ కనిపించట్లేదని, తూటాలు మాత్రమే ఉన్నాయని అతడు ఉన్నతాధికారులకు చెప్పాడు. తాను పోలీసు పరీక్షలు ముగించుకుని జూన్‌ ఆఖరులో తిరిగి వచ్చానని, అప్పటి నుంచి తుపాకీ కనిపించట్లేదని పేర్కొన్నాడు. దీంతో షాక్‌ తిన్న ఉన్నతాధికారులు దీనిపై లోతుగా ఆరా తీశారు. ఓ సందర్భంలో భాను ప్రకాష్‌ ఆ పోలీసుస్టేషన్‌ సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ పరిశీలించాలంటూ కోరి ఆద్యంతం చూశాడు.

దొరికింది.. దొరకలేదు.. తెలియదు..

ఓవైపు తుపాకీ కోసం విచారణ జరుగుతుండగానే భాను ప్రకాష్‌ అది దొరికిందని, భద్రత కోసం ఇంటి వద్దే ఉంచానని అధికారులకు చెప్పాడు. ఎన్నిసార్లు కోరినా తీసుకురాకపోవడంతో అనుమానించిన అధికారులు లోతుగా ప్రశ్నించగా కనిపించట్లేదని పేర్కొన్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాష్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు పొంతన లేని సమాధానాలు చెబుతుండటం.. ఏం జరిగిందో తెలియదని అంటుండటంతో సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. బంగారం మాదిరిగానే తుపాకీని సైతం భాను ప్రకాష్‌ తాకట్టు పెట్టి ఉంటాడని, ఆ డబ్బునూ బెట్టింగ్స్‌కు వాడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇతగాడు త్వరలోనే పోలీసు విభాగం నుంచి రిలీవ్‌ అయి, ఏపీలో గ్రూప్‌–2 ఉద్యోగంలో చేరాల్సి ఉందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement