ఇక ఇంటింటి క్యాన్ సర్వే
సాక్షి, సిటీబ్యూరో: మహా నగర దాహార్తి తీర్చేందుకు సుదూర ప్రాంతాల నుంచి జలాలను తరలించి.. ఆపై శుద్ధి చేసి సరఫరా చేస్తున్న నీటి వినియోగంపై జలమండలి దృష్టి సారించింది. నీటి వాడకంలో పారదర్శకత, అక్రమ కనెక్షన్ల నియంత్రణ, సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టింది. క్షేత్ర స్థాయిలో నల్లా కనెక్షన్ల పూర్తి వివరాల సేకరణ కోసం ‘ఇంటింటి క్యాన్ సర్వే’ పేరిట వంద రోజుల ప్రణాళికతో స్పెషల్‌డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి నల్లా కనెక్షన్ అక్రమమా? సక్రమమా? కేటగిరీ డొమెస్టికా? కమర్షియలా? తేల్చనున్నారు. పైపులైన్ సైజు, కనెక్షన్ల సంఖ్యను పరిశీలించి అక్కడికక్కడే ప్రత్యేక యాప్ అప్లికేషన్‌లో పూర్తి వివరాలు నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టారు. నివాస యోగ్యానికి నల్లా కనెక్షన్ ఉండి ఆ భవనంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే వాణిజ్య కేటగిరీలోకి మార్పు చేస్తారు. అక్రమ కనెక్షన్ అయితే నోటీసు జారీ చేస్తారు. ఆ తర్వాత జరిమానా చార్జీలతో క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే నల్లా కనెక్షన్ల కేటగిరీ, పైపులైన్ సైజు, నెలవారీ నీటి వినియోం, బిల్లింగ్ తదితర వివరాలతో కూడిన జాబితాను రూపొందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది
సెక్షన్ల వారీగా..
జలమండలి పరిధిలోని ప్రతి సెక్షన్‌లో వంద శాతం కనెక్షన్లపై 100 రోజుల్లో సర్వే పూర్తి చేసేలా మేనేజర్లకు బాధ్యతలు అప్పగించింది. ప్రతి సెక్షన్‌లో మేనేజర్ సారథ్యంలోని బృందం ఇంటింటికీ వెళ్లి కస్టమర్ నంబర్, మీటర్ వివరాలు, ఇంటి వైశాల్యం, ఎన్ని గదులు, ఎన్ని అంతస్తులు, కనెక్షన్ కేటగిరీ వంటి వాటిపై వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా కనెక్షన్ ఉందా లేదా, నల్లా అక్రమ కనెక్షన్ గుర్తింపు, వాటిని క్రమబద్ధీకరణ చేయడం, మీటర్ బిగింపు తదితర చర్యలు చేపడతారు. నల్లా కనెక్షన్ పైపులైన్ సైజు కూడా పరిశీలిస్తారు. సైజులో వ్యత్యాసం ఉంటే బిల్లింగ్‌లో మార్పులు చేస్తారు. ఒకటి కంటే ఎక్కువగా ఉన్న కనెక్షన్లను గుర్తించనున్నారు. వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే మాత్రం ఆ కేటగిరీలోకి మార్పు కోసం నోటీసులు జారీ చేస్తారు. సర్వే సిబ్బంది తుది నివేదిక వివరాలపై మరోసారి విజిలెన్స్ శాంపిల్స్ రీ సర్వే కూడా ఉంటుందని జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి.
14.36 లక్షల కనెక్షన్లు
జలమండలి పరిధిలో దాదాపు 14.36 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 85 శాతం వరకు డొమెస్టిక్ కేటగిరీ కనెక్షన్లు ఉండగా మిగిలిన 15 శాతం వాణిజ్య, ఇండస్ట్రీ, ఇతరత్రా కేటగిరీ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా సగటున 10 వేల నుంచి 15 వేల వరకు కొత్త కనెక్షన్లు మంజూరవుతున్నాయి. వాణిజ్య కనెక్షన్లు మాత్రం 54 వేలకు మించలేదు. పలు ప్రాంతాల్లో కొందరు గృహావసరాలకు కనెక్షన్ తీసుకుని వాణిజ్య అవసరాలకు వినియోగించడం , మరికొందరు మీటర్లను పని చేయకుండా చేసి బిల్లులు మొక్కుబడిగా చెల్లి్‌ంచడం సర్వసాధారణమైంది. దీంతో వాటిపై దృష్టి సారించి క్యాన్ సర్వేతో నిగ్గుతేల్చేందుకు జలమండలి చర్యలు చేపట్టింది.
నల్లా అక్రమ కనెక్షన్‌దారులకు నోటీసులు
కనీసం మూడేళ్ల జరిమానాతో క్రమబద్ధీకరణ
జలమండలి వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ
జలమండలి పరిధిలో ఇలా..
కేటగిరీ కనెక్షన్ల సంఖ్య
డొమెస్టిక్ 9,28,631
డొమెస్టిక్–స్లమ్స్ 2,46,857
డొమెస్టిక్–ఎంయూన్ 1,36,638
డొమెస్టిక్ విత్ ఫ్లాట్స్ 14.835
ఎంఎస్‌ఏసీ–డొమెస్టిక్ 38,493
కమర్షియల్ 54,301
బల్క్ కమర్షియల్ 82


