కొత్త రేషన్ కార్డులు.. నత్తనడకనే!
● క్షేత్ర స్థాయి విచారణలో నిర్లక్ష్యం
● మళ్లీ అందని ద్రాక్షగా మారిన కొత్త రేషన్ కార్డుల మంజూరు
నిరంతర ప్రక్రియ అయినా పెండింగ్‌లో దరఖాస్తులు
ఎల్‌బీ నగర్‌కు చెందిన ఓ నిరుపేద మహిళ మీ–సేవ కేంద్రం ఆన్‌లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. రాజేంద్రనగర్‌లోని పౌరసరఫరాల శాఖలో, సరూర్‌నగర్ సర్కిల్ ఆఫీస్‌లో దరఖాస్తు పత్రాలను సమర్పించింది. 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు కనీసం క్షేత్ర స్థాయి విచారణ ముందుకు సాగలేదు. స్వయంగా మూడు, నాలుగు పర్యాయాలు సర్కిల్ ఆఫీస్‌కు వెళ్లినా..సంబంధిత సహాయ పౌరసరఫరాల అధికారి మాత్రం అందుబాటులో లేకుండా పోయారు. అక్కడి సిబ్బందితో కొత్త రేషన్‌కార్డు దరఖాస్తు పెండెన్సీపై అడిగితే..సరైన సమాధానం లభించలేదు. కొత్త రేషన్ కార్డు పేద కుటుంబానికి అందని ద్రాక్షగా తయారైంది..ఇలాంటి ఉదంతాలు నగరవ్యాప్తంగా అనేకం ఉన్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: ‘దేవుడు వరం ఇచ్చినా.. పూజారి కరుణించని’ చందంగా తయారైంది కొత్త రేషన్ కార్డుల పరిస్థితి. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆచరణలో మంజూరు మాత్రం నత్తలకు నడక నేర్పిస్తోంది. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో కొత్త దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నా.. వాటిపై క్షేత్ర స్థాయి విచారణ ముందుకు సాగడం లేదు. ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కేవలం కేవలం 3.16 లక్షల కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. మరో మూడు లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి. సరిగ్గా గత నాలుగు నెలల నుంచి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ, ఆమోదం ప్రక్రియ మొక్కుబడిగా తయారైంది. కేవలం మధ్యవర్తుల ప్రమేయం, ఇతరత్రా సిఫార్సు దరఖాస్తులకే మోక్షం లభిస్తోంది. గత నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
సర్కిల్ ఆఫీసుల చుట్టూ...
పేదలు కొత్త రేషన్ కార్డుల కోసం పౌరసరఫరాల శాఖ సర్కిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో దాదాపు సగం పెండింగ్‌లో మగ్గుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే ఎఫ్‌ఎస్‌సీ ఆన్‌లైన్ లాగిన్‌కు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించినా.. మంజూరు మాత్రం కొందరికే పరిమితమవుతోంది.
అర్హత కుటుంబాలు 27 లక్షలపైనే..
మహానగరంలో సుమారు 40 లక్షల కుటుంబాలు ఉండగా అందులో దారిద్య్రరేఖకు దిగువ నున్న కుటుంబాలు 27 లక్షల పైవరకు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం 20.38 లక్షల కుటుంబాలు మాత్రమే రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. మిగతా ఏడు లక్షల కుటుంబాలకు లేవు. అందులో మూడు లక్షల కుటుంబాల దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి. మరో నాలుగు లక్షల కుటుంబాలు దర ఖాస్తుకు చేసుకోలేదు. ఫలితంగా పేద కుటుంబాలు రేషన్ కార్డులు లేక వివిధ సంక్షేమ పథకాల వర్తింపు కోసం తల్లడిల్లుతున్నాయి.
ప్రస్తుతం రేషన్ కార్డుల పరిస్ధితి ఇలా..
జిల్లా కార్డులు యూనిట్లు
హైదరాబాద్ 7,98,269 30,42,056
మేడ్చల్–మల్కాజిగిరి 6,10,880 20,94,319
రంగారెడ్డి 6,28,890 21,24,903


