టిమ్స్.. ఎప్పుడో?
సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న సనత్‌నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ఆస్పత్రి ప్రారంభం మరింత ఆలస్యమవుతుందనే విషయం స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 9న ఆస్పత్రిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కాగా.. ఆస్పత్రి ప్రారంభానికి సంబంధించి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ఉన్నతాధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. పనులు ఆలస్యం కావడంతో ఆస్పత్రి ప్రారంభం వాయిదా పడుతోంది.
రూ.2,600 కోట్ల అంచనాతో..
నగరంలోని ఎల్‌బీనగర్, సనత్‌నగర్, అల్వాల్‌లో రూ.2,600 కోట్ల అంచనా వ్యయంతో టిమ్స్ ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం భావించింది. 2025 ఏప్రిల్ మొదటి వారంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. కాగా.. ఇందులో ఏ ఒక్క ఆస్పత్రి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయలేదు. మరోవైపు నిర్మాణ ఖర్చులు పెరిగాయని అంచనాలను రివిజన్ చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి, అంచనా వ్యయాన్ని తగ్గించినట్లు ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా.. నగరంలోని సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి పనులు చివరి దశకు రావడంతో ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు.
అంతా గోప్పంగానే..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోవడం, సోనియా గాంధీ పుట్టిన రోజైన డిసెంబరు 9న ఆస్పత్రిని ప్రారంభించాలని నిర్ణయించా రు. గత రెండు నెలల నుంచి నిర్మాణ సంస్థ పను ల్లో వేగం పెంచింది. వైద్య పరికరాలు, వైద్యు లకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రోగులకు అవసరమైన వార్డులు, ఓపీ, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు అయ్యాయా? లేదా? అనేది అంతు చిక్కని ప్రశ్నగానే కనిపిస్తోంది. ఆస్పత్రి ప్రాంగణంలోకి ఇతరులను అనుమతించడంలేదు. టిమ్స్ ఆస్పత్రుల పనులు, నిధులు, వ్యయం అంచనాల రివిజన్ ఇతర అంశాలన్నీ గోప్యంగా ఉంచుతున్నా రు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నేరుగా వీటిని పర్యవేక్షిస్తున్నారని, తమకు ఎలాంటి సమాచారం లేదని కింది స్థాయి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎల్‌బీనగర్, అల్వాల్‌లో మా త్రం మరికొంత సమయం ఎదురుచూడాల్సిందే.
నిర్మాణంలో సనత్‌నగర్ టిమ్స్ భవనం
సనత్‌నగర్ హాస్పిటల్ డిసెంబర్ 9న ప్రారంభిస్తామన్న సీఎం
తుది మెరుగులు దిద్దుకుంటున్న భవన నిర్మాణ పనులు
ఏర్పాట్ల ఊసెత్తని డీఎంఈ కార్యాలయ అధికారులు


