
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు బుద్ధి చెప్పాలి
శ్రీనగర్‌కాలనీ: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిందని, ప్రజలను అభివృద్ధికి దూరంగా ఉంచిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రజలు తగు బుద్ది చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగడ్డలో బీజేపీ బూత్‌స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాంటే బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని కోరారు. బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉందని, నియోజకవర్గంలో ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తూ, అవినీతిని అధికం చేసే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్‌ఎస్‌లో చేరుతారని, కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి పార్టీ ఫిరాయింపులతో వారి అవినీతిని కాపాడుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి, ప్రజా సమస్యలు అవసరం లేదని, కేవలం మత రాజకీయాలు మాత్రమే చేస్తుందని ఆరోపించారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలికే పార్టీ మజ్లిస్ అని అన్నారు. జూబ్లీహిల్స్‌లో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ గౌతమ్‌రావు, సారంగపాణి, ఎర్రబల్లి ప్రదీప్‌రావు, డాక్టర్ చేకూరు హనుమంతనాయుడు, విజయ్‌కుమార్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం..
కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి