
నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
యాకుత్‌పురా: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్‌తో కలసి పలు ప్రాంతాల్లోని నాలాలను పరిశీలించారు. యాకుత్‌పురా ముర్గీనాలా, యశ్రఫ్‌నగర్, మౌలాకాల్లా, తలాబ్ కట్టా, గంగానగర్ నాలాలను పరిశీలించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీటి సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి సమస్యలు రాకుండా నాలాల పూడికతీత పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేకంగా హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచి సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. వారితో పాటు తలాబ్‌చంచలం, పత్తర్‌గట్టీ, రెయిన్‌బజార్ డివిజన్ల కార్పొరేటర్లు డాక్టర్ సమీనా బేగం, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మహ్మద్ వసీవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.