
ఔటర్ సర్వీసు రోడ్డుపైకి దొర్లిపడిన బండరాళ్లు
వాహనాలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం
మణికొండ: నార్సింగి నుంచి పోలీస్ అకాడమీ ఔటర్ సర్వీసు రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో భారీ బండరాయితో పాటు మరో చిన్నరాయి గురువారం సాయంత్రం సర్వీసు రోడ్డుపైకి దొర్లుకుంటూ వచ్చాయి. సర్వీసు రోడ్డు ఓ వైపు నుంచి పడి మధ్యలో డివైడర్‌పై నుంచి దాటి అవతలి రోడ్డు వరకు వెళ్లాయి. ఆ సమయంలో రెండు వైపుల నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. మంచిరేవుల 60 గజాల ఇందిరమ్మ కాలనీ పక్కనే ఔటర్ సర్వీసు రోడ్డు నిర్మాణ సమయంలో కొంత మేర గుట్టను తొలగించారు. పక్కనున్న గుట్టలను అలాగే వదిలివేయటంతో అవి వర్షాకాలం సమయంలో కూలుతున్నాయని స్థానికులు తెలిపారు. గురువారం రెండు రాళ్లు కూలగా మరో మూడు ప్రమాదకరంగానే రోడ్డును ఆనుకునే ఉన్నాయన్నారు. రోడ్డుపైకి వచ్చిన రాళ్లను ఔటర్ రింగ్ రోడ్డు నిర్వాహకులు వెంటనే తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మరోసారి ప్రమాదం జరగకముందే వాటిని తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.