
సమన్వయంతో పని చేయండి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
మైలార్‌దేవ్‌పల్లి: గ్రేటర్ నగరంలో వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలపై నిరంతరం నిఘా పెట్టాలని జోనల్, సర్కిల్, వార్డు అధికారులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్‌లో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. జల్‌పల్లి చెరువుతో పాటు వరద ముంపు ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. నగర ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ట్రాఫిక్, విపత్తు బృందాలు సమన్వయంతో పని చేయాలన్నారు. వరద నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటిని తొలగించాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ట్రాఫిక్ ఫ్లో సజావుగా జరిగేలా చూడాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రమాదకర స్థలాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.