బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఆర్–ఇన్ హోటల్‌లో ఓ గదిలో గత కొంతకాలంగా యువతులతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడులు చేసి ముగ్గురు యువతులతో సహా ఏడుగురు కస్టమర్లు, వ్యభిచార గృహ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఎండీ షరీఫ్ గతంలో స్టైల్ మేకర్ సెలూన్ నిర్వహించేవాడు. ఉద్యోగాల పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి సెలూన్‌లో చేర్చుకుని వారిని అధిక డబ్బు సంపాదించవచ్చనే ఆశపెట్టి వ్యభిచారానికి తరలిస్తున్నాడు. కజకిస్థాన్, రష్యా, ఉగాండా, థాయ్‌ల్యాండ్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి తన సెలూన్‌లో ఉద్యోగాల పేరుతో రప్పించి వారిని ఖరీదైన హోటళ్లకు పంపిస్తూ వ్యభిచారం చేయిస్తున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆర్–ఇన్ హోటల్‌లోని గదులపై దాడులు చేసి ముగ్గురు మహిళా సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించారు. కజకిస్థాన్‌కు చెందిన యువతితో పాటు మరో ఇద్దరు యువతులు పట్టుబడిన వారిలో ఉన్నారు. మరో ఏడుగురు విటులకు నోటీసులు జారీ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఎండీ షరీఫ్‌పై కేసు నమోదు చేశారు. నగదును సీజ్ చేసి బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


