ఇప్పటి వరకు రెండు దశలుగా భూముల విక్రయం
రెండేళ్ల క్రితం ఎకరా అత్యధికంగా రూ.100.75 కోట్లు
వచ్చే నెలలో ఆన్‌లైన్ బిడ్డింగ్
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు ఖజానాకు కాసుల వర్షం కురిపించే కోకాపేట్‌పై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్ధ (హెచ్‌ఎండీఏ) మరోసారి దృష్టి సారించింది. నియోపోలిస్ లేఅవుట్‌లో మూడో దశ భూముల విక్రయానికి సన్నాహాలు చేపట్టింది. ఇటీవల రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో రాయదుర్గం, కోకాపేట్ ప్రాంతాల్లోని డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సుమారు 25 ఎకరాలకు పైగా భూములను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు.
రాయదుర్గంలోని టీజీఐఐసీ భూములకు లభించినట్లుగానే కోకాపేట్ నియోపోలిస్ భూములకు కూడా భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రెండో దశ కింద నియోపోలిస్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ఒక ఎకరా అత్యధికంగా రూ.100.75 కోట్లకు విక్రయించారు. ఈసారి అంతకంటే ఎక్కువే లభించవచ్చని భావిస్తున్నారు. దీంతో 25 ఎకరాలపై రూ.3000 కోట్ల వరకు రావచ్చని అంచనా. నియోపోలిస్ మూడో ఫేజ్‌పై నవంబరు వారంలో నోటిఫికేషన్ ఇచ్చి చివరి వారంలో బిడ్డింగ్ నిర్వహించే అవకాశం ఉంది. కోకాపేట్ నియోపోలిస్ లే అవుట్‌లో 2021 జూన్ నెలలో మొదటి దశ 64 ఎకరాలను విక్రయించారు. అప్పట్లో ఈ భూములపై రూ.2000 కోట్లకు పైగా లభించాయి. 2023 ఆగస్టులో నిర్వహించిన రెండో దశ బిడ్డింగ్‌లో 45.33 ఎకరాలు విక్రయించగా రూ.3,300 కోట్ల వరకు వచ్చాయి. తాజాగా పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎకరా గరిష్టంగా రూ.వంద కోట్లపైనే రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
కొంగు బంగారమే...
నగరానికి పడమటి వైపు ఆకాశహర్మ్యాలతో అలరారే కోకాపేట్.. అంతర్జాతీయ హంగులతో దేశ విదేశాలకు చెందిన వ్యాపార దిగ్గజ సంస్థలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం వరకు కేవలం 5 కిలోమీటర్ల పరిధిలో ఫారŠూచ్యన్ 500 కంపెనీలకు చేరువలో ఉన్న నియోపోలిస్‌లో రెండో దశ భూముల అమ్మకానికి కూడా భారీ స్పందన లభించింది. ఈ లే అవుట్‌ను హెచ్‌ఎండీఏ ‘నియోపోలిస్’ పేరుతో అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసింది. ఎలాంటి ఆంక్షలు లేనివిధంగా ఎన్ని అంతస్తుల వరకైనా హైరైజ్ భవనాలను నిర్మించేందుకు అవకాశం ఉంది. దీంతో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు, బడా రియల్టర్‌లు, డెవలపర్లు మొదటి నుంచీ నియోపోలిస్ కోసం పోటీ పడుతున్నారు. మొదటి దశలో ఒకటి నుంచి 5 వరకు ఉన్న ప్లాట్‌లను విక్రయించగా రెండో దశలో 6 నుంచి 14 వరకు ఉన్న ప్లాట్‌లను విక్రయించారు. ప్రస్తుతం మిగతా ప్లాట్‌ల విక్రయానికి హెచ్‌ఎండీఏ సన్నద్ధమైంది. ఇక్కడ ఒక్కో ప్లాట్ సైజు కనిష్టంగా 3.60 ఎకరాల నుంచి గరిష్టంగా 9.71 ఎకరాల వరకు ఉంటుంది.
ఇవీ ప్రత్యేకతలు
కోకాపేట్ నియోపోలిస్ సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
రూ.300 కోట్లతో హెచ్‌ఎండీఏ ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. సుమారు 40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.
సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు తదితర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు తదితర అన్ని సదుపాయాలు ఉన్నాయి.
కమర్షియల్, రెసిడెన్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అన్ని రకాల భవనాలకు అనుమతులు ఉన్నాయి.
నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తుల వరకైనా హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించవచ్చు.
ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్‌సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రోడ్డు నెట్‌వర్క్ అందుబాటులో ఉంది.


