ప్రకృతి పిలిచింది! | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి పిలిచింది!

Aug 15 2025 11:32 AM | Updated on Aug 15 2025 11:32 AM

ప్రకృతి పిలిచింది!

ప్రకృతి పిలిచింది!

సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం. ఆపై వరుస సెలవులు. ఇంకేముంది ‘చలో టూర్‌’ అంటూ చెక్కేస్తున్నారు సిటీ టూరిస్టులు. వర్షాకాలం దృష్ట్యా పర్యాటకుల అభిరుచికి తగిన ప్యాకేజీలతో ముందుకొస్తున్నాయి పర్యాటక సంస్థలు, మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లోపు తిరిగి నగరానికి చేరుకొనేలా ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి. దీంతో తక్కువ బడ్జెట్‌లో వర్షాకాలాన్ని ఆహ్లాదంగా గడిపేందుకు నగర పర్యాటకులు ఫ్లైట్‌ ఎక్కేస్తున్నారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, జలపాతాలను సందర్శించేందుకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో కూడా భారీ రద్దీ కనిపిస్తోంది. వీకెండ్స్‌లో ముందస్తు బుకింగ్‌లతో పాటు తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌లకు కూడా అనూహ్యమైన డిమాండ్‌ ఉంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అన్ని సదుపాయాలతో రోడ్డు మార్గంలో, విమానయానంలో ప్రత్యేక ప్యాకేజీలను అందజేస్తున్నట్లు హిమాయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ పర్యాటక సంస్థ ప్రతినిధి చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా చాలా మంది కేరళ, గోవా వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. అంతర్జాతీయ టూర్‌లలో వీసా అవసరం లేని దేశాలకు పర్యాటకులు ‘క్యూ’ కడుతున్నారు.

దీవుల్లో విహారం..

● వీసా అవసరం లేని దేశాలకు, ఆన్‌లైన్‌ అరైవల్‌ వీసా సదుపాయం ఉన్న దేశాలకు టూరిస్టుల నుంచి ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. మలేసియాలోని లంకావి వంటి దీవుల్లో విహరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇండోనేషియాలోని బాలి వంటి దీవులకు కూడా హైదరాబాద్‌ నుంచి ఎక్కువ మంది తరలి వెళ్తున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారి ఒకరు తెలిపారు.ఈ మేరకు ఫిలిప్పీన్స్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌ దేశాలకు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌ నుంచి వియత్నాంకు నేరుగా ఫ్లైట్‌ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగింది.

● హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. మలేసియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, దుబాయ్‌, మాల్దీవులు, ఫిలిప్పీన్స్‌, వియత్నాం దేశాలు ఇప్పుడు టాప్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొంతకాలంగా వియత్నాం పర్యాటకులకు గమ్యస్థానంగా మారింది. తక్కువ బడ్జెట్‌లో ఇంటిల్లిపాదీ సందర్శించేందుకు అనుగుణంగా ఉండడంతో ఆ దేశానికి బుకింగ్‌లు ఎక్కువగా వస్తున్నట్లు కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఒక ట్రావెల్స్‌ సంస్థ ప్రతినిధి తెలిపారు. మరోవైపు దీవుల విహారంలో మాల్దీవులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

కేరళ ఎవర్‌గ్రీన్‌..

మాన్సూన్‌ టూర్‌కు ఎక్కువగా కేరళకు వెళ్తున్నారు. అలెప్పి వంటి పర్యాటక ప్రదేశాల్లో పచ్చదనాన్ని, జలపాతాలను సందర్శించి సేదదీరుతున్నారు. ‘హైదరాబాద్‌ నుంచి చాలా దూరం వెళ్లి ఫామ్‌ హౌస్‌లలో, రిసార్ట్‌లలో కొద్ది రోజులు గడపడం కూడా ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. అలాంటి టూర్‌లకు కూడా ఎక్కువ మంది తరలి వెళ్తున్నారు. కేరళ తర్వాత గోవా టూర్‌లు టాప్‌లో ఉన్నాయి. వేసవిలోనే కాదు, వర్షాకాలంలోనూ గోవాను ఎంపిక చేసుకోవడం గమనార్హం. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు మాన్‌సూన్‌ టూర్లకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది టూర్‌ ఆపరేటర్లు 20 నుంచి 25 శాతం తగ్గింపు ధరలతో ప్యాకేజీలను అందజేస్తున్నారు.

వరుస సెలవులు.. వర్షాలు.. చలో మాన్సూన్‌ టూర్‌

ఆకట్టుకుంటున్న డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ప్యాకేజీలు

జలపాతాలు, దీవులపై పర్యాటకుల ఆసక్తి

కేరళ, గోవా, ఇండోనేషియా, వియత్నాంకు ప్రయాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement