
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మద్దతు.. ఎన్డీయే అభ్యర్థికా? ఇండియా కూటమి అభ్యర్థికా? అనే ఉత్కంఠ కొనసాగుతున్నవేళ.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉపరాషష్ట్రపతి ఎన్నికపై జరిగేదంతా డ్రామా. బీసీలపై ప్రేమ నోటిపైనేనా.. చేతల్లో ఉండవా. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. మేం ఏ కూటమిలో లేం. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తిని కచ్చితంగా వ్యతిరేకిస్తాం..
రాహుల్ గాంధీ మా బాస్ కాదు.. మోదీ మా బాస్ కాదు. ఢిల్లీలో మాకు ఏ బాస్ లేరు. మమ్మల్ని నడిపించేవారెవరూ లేరు. తెలంగాణ ప్రజలే మా బాస్. అందుకే మేం కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణం మా నిర్ణయం ఉంటుంది.
బీజేపీ, కాంగ్రెస్.. రెండూ దౌర్భాగ్యమైన పార్టీలే. కానీ, తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తెస్తారో.. వారికే మా మద్దతు ఉంటుంది. సెప్టెంబర్ 9 లోపు ఎవరు ఎరువులు ఇస్తామంటే వారికి మద్దతిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదు. అయితే.. రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు.