పోటీపడి పైరసీ చేశాడు! | - | Sakshi
Sakshi News home page

పోటీపడి పైరసీ చేశాడు!

Jul 4 2025 6:57 AM | Updated on Jul 4 2025 6:57 AM

పోటీపడి పైరసీ చేశాడు!

పోటీపడి పైరసీ చేశాడు!

సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిన్నరగా నగరంలోని వివిధ థియేటర్లను అడ్డాగా చేసుకుని దాదాపు 40 సినిమాలను రికార్డు చేసి, పైరసీ సైట్లకు విక్రయించిన ఘరానా నిందితుడు జన కిరణ్‌కుమార్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పైరసీ చిత్రాలను అందుబాటులో ఉంచే 1తమిల్‌ఎంవీ అనే సైట్‌లో వచ్చిన ప్రకటన చూసి పోటీపడిన ఇతగాడు ఒక్కో సినిమాకు 300 నుంచి 400 డాలర్లు క్రిప్టో కరెన్సీ రూపంలో పొందాడని పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గురువారం వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్‌కుమార్‌ వనస్థలిపురంలో ఉంటూ ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. 1తమిళ్‌బ్లాస్టర్స్‌, 5మూవీరూల్స్‌, 1తమిళ్‌ఎంవీ తదితర వెబ్‌సైట్లను తరచూ సందర్శించే ఇతగాడు వాటిలో ఉన్న పైరసీ సినిమాలు చూసేవాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల క్రితం 1తమిళ్‌ఎంవీ సైట్‌లో ‘పైరసీ పోటీ’కి సంబంధించిన ప్రకటన కిరణ్‌ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా విడుదలైన సినిమాలను వీలైనంత త్వరగా రికార్డు చేసి, దాని హెడ్‌డీ ప్రింట్‌తో కూడిన లింక్‌ను తమకు పంపిస్తే ఒక్కో సినిమాకు 300 నుంచి 400 డాలర్లు చెల్లిస్తామన్నది ఆ పోటీ సారాంశం. దీనికి ఆకర్షితుడైన కిరణ్‌ ప్రొటన్‌ మెయిల్‌ ద్వారా వారిని సంప్రదించాడు. తెలుగు చిత్రాలను రికార్డు చేసి పంపిస్తానంటూ సందేశం ఇచ్చాడు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండటానికి టెలిగ్రాం యాప్‌ ద్వారా సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకున్న అతను తన ఖాతా ఐడీని వారికి పంపాడు. అప్పటి నుంచి సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులతో ఈ యాప్‌ ద్వారానే సమాచార మార్పిడి చేసుకున్నాడు. వారితో ఒప్పందం కుదుర్చుకున్న కిరణ్‌ కొత్తగా విడుదలయ్యే చిత్రాలకు సంబంధించి మొదటి షోకే ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునే వాడు. సెల్‌ఫోన్‌లో రికార్డింగ్‌ ఆన్‌ చేసుకుని, షర్టు జేబులో పెట్టుకున్నా పక్కాగా రికార్డు అయ్యే సీటునే ఎంపిక చేసుకునే వాడు. ఈ రకంగా ఆ సినిమా మొత్తాన్ని రికార్డు చేసి, క్లౌడ్‌లో సేవ్‌ చేసే కిరణ్‌ దాని లింక్‌ను టెలిగ్రాం యాప్‌ ద్వారా వెబ్‌సైట్‌ నిర్వాహకులకు పంపేవాడు. దీనికి ప్రతిఫలంగా నిర్ణీత మొత్తాన్ని బిట్‌కాయిన్ల రూపంలో అందుకునే వాడు. ఈ క్రిప్టో కరెన్సీని జెబ్‌ పే, కాయిన్‌ డీసీఎక్స్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుని రూపాయల్లోకి మార్చుకునేవాడు. ఇలా ఏడాదిన్నరలో 40 చిత్రాలు రికార్డు చేసి పైరసీ వెబ్‌సైట్‌కు అందించాడు. మే 9న విడుదలైన హ్యాష్‌ట్యాగ్‌ సింగిల్‌ సినిమానూ ఇలానే చేశాడు. ఈ చిత్రం విడుదలైన రోజే ఆయా పైరసీ వెబ్‌సైట్లలో ఈ చిత్రం హెచ్‌డీ ప్రింట్‌ ప్రత్యక్షం కావడంతో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) స్పందించింది. దాని అంతర్భాగమైన యాంటీ వీడియో పైరసీ సెల్‌ ప్రతినిధి సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నమోదైన కేసును ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.నరేష్‌ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. సాంకేతిక ఆధారాలను బట్టి కిరణ్‌ కుమార్‌ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పైరసీ కారణంగా గత ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ రూ.3700 కోట్లు నష్టపోయినట్లు టీఎఫ్‌సీసీ అంచనా వేసిందని, ఈ నేపథ్యంలో పైరసీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.

వనస్థలిపురానికి చెందినఏసీ టెక్నీషియన్‌ వ్యవహారం

ఏడాదిన్నరలో ఏకంగా 40 సినిమాలు అక్రమంగా లీక్‌

ఒక్కో చిత్రానికి 300 నుంచి 400 డాలర్ల సంపాదన

వ్యవస్థీకృతంగా దందా చేస్తున్న 1తమిళ్‌ఎంవీ సైట్‌

నిందితుడి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement