
శ్రీధర్ రావుపై కేసు నమోదు
గచ్చిబౌలి: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కో–ఆప్‌రేటివ్ హౌసింగ్ సొసైటీలో రోడ్లపై హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి మార్కింగ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని వీడియో తీస్తుండగా శ్రీధర్ రావు అతడి అనుచరులు తమపై బ్యాట్, కత్తితో దాడి చేశారని నటి రమ్మశ్రీ సోదరుడు ప్రశాంత్‌తో పాటు కుషీ చంద్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు శ్రీధర్ రావు, అతని అనుచరుడు వెంకటేష్‌తో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేశారు.
భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
మణికొండ: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ మహిళ భవనం 4వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ, సాయిరాం కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సాయిరాం కాలనీలోని ఆర్‌కే రెసిడెన్సీలో అన్నపూర్ణ(58) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి లోనైన ఆమె భవనం నాలుగవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి చాక్లెట్ల పట్టివేత
నిందితుడి అరెస్ట్
మేడ్చల్: గంజాయిని చాక్లెట్లు విక్రయిసున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన మేడ్చల్ ఎకై ్సజ్ పోలీసులు అతడి నుంచి 5 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నవనీత కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుండ్లపోచంపల్లి పరిధిలోని అయోధ్య చౌరస్తా వద్ద రూట్ వాచ్ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఉత్తరప్రదేశ్ కు చెందిన జయరామ్ మిశ్రా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడి వద్ద చాక్లెట్ల గంజాయి చాక్లెట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లో వాటిని కోనుగోలు చేసిన అతను నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్ నవనీతతో పాటు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కత్తితో బెదిరించి
డబ్బు లాక్కెళ్లిన రౌడీషీటర్
గౌలిపురా: ఓ వ్యక్తిని రౌడీషీటర్ కత్తితో బెదిరించి డబ్బు లాక్కెళ్లిన ఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..యాకుత్‌పురా బడాబజార్‌కు చెందిన మహ్మద్ ఫుర్కాన్ అన్సారీ (18) చార్మినార్ బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అన్సారీకి స్నేహితుడు ఇమ్రాన్ ఫోన్ చేసి ఉదయం ఊరు వెళుతున్నానని కలవాలని తెలిపాడు. దీంతో అన్సారీ గురువారం తెల్లవారుజామున 12.30 గంటలకు స్నేహితుడు ఇమ్రాన్‌ను కలిసేందుకు సమద్ హోటల్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో రౌడీషీటర్ మహ్మద్ వాజిద్ అలియాస్ షా (30) అన్సారీని కత్తితో బెదిరించి తన వద్ద ఉన్న రూ.3 వేలను బలవంతంగా లాక్కొని దాడి చేసి పారిపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
గర్భిణి మృతి
అత్తాపూర్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై గర్భిణి మృతి చెందిన సంఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ కేతనారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ పట్టణానికి చెందిన జమీల్ అసరా ఫాతిమా(29) దంపతులు గురువారం క్రిస్టల్ గార్డెన్ సమీపంలోని బటర్‌ఫ్లై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు నగరానికి వచ్చారు. బంధువులను చూసి యాక్టివాపై తమ కుమారుడితో కలిసి తిరిగి వెళుతుండగా పీవీఎన్.ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెంబర్ 198 వద్ద ముందుగా వెళ్తున్న వాహనం కారు డోర్ తెరిచి ఉండటాన్ని గుర్తించిన జమీల్ బైక్‌ను ఒక్కసారిగా ఆపి వేశాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొనడంతో అస్రా ఫాతిమా కింద పడింది. బస్సు చక్రాలు ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీధర్ రావుపై కేసు నమోదు

శ్రీధర్ రావుపై కేసు నమోదు