
వికలాంగుల హక్కుల సాధనకు పోరాటం
నాగోలు: వికలాంగ సమాజాన్ని ఏకం చేసి పాలకుల మెడలు వంచి అనేక హక్కులు సాధించుకున్న చరిత్ర ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ లకు ఉందని, భవిష్యత్తులోనూ వికలాంగులకు పెన్షన్లు, అన్ని రకాల హక్కులతో పాటు రాజకీయ భాగస్వామ్యం సాధించేంతవరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ఎమ్మర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం నాగోలు శుభం కన్వెన్షన్ హాల్ పద్మశ్రీ పురస్కార గ్రహీత మంద కృష్ణ మాదిగను వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వీహెచ్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షన ఏర్పాటు చేసిన సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ పురస్కారం అణచివేతకు గురైన వర్గాల ప్రయోజనాలు కాపాడే విషయంలో మరింత బాధ్యతను పెంచిందన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం చేసిన పోరాటాలకు గుర్తింపుగానే పద్మశ్రీ దక్కిందన్నారు. 17 ఏళ్లుగా వికలాంగులు తనపై ఎంతో నమ్మ కం పెట్టుకున్నారని, వారికి న్యాయంగా దక్కాల్సిన హక్కులతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించేంతవరకు పోరాడతానన్నారు. దేశంలో, రాష్ట్రంలో వికలాంగులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ బాధ్యత ఎమ్మార్పీఎస్ తీసుకొని వీహెచ్‌పిఎస్ ఏర్పాటు చేసి వికలాంగులకు పెన్షన్లు పెంచాలని పెద్ద ఎత్తున పోరాటం చేసిందని గుర్తు చేశారు. వికలాంగులకు ఏపీలో రూ. 6000, తెలంగాణలో రూ.4016 పెన్షన్ రావడానికి ఎమ్మార్పీఎస్, విహెచ్‌పీఎస్ చేసిన పోరాటమే ప్రధాన కారణం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల రూ.6 వేలు పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చి తప్పాడని ఆరోపించారు. తమ సోదరుడిగా భావించి సన్మాన సభను ఏర్పాటు చేసినందుకు వికలాంగులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విహెచ్‌పీఎస్ జాతీ య కోర్ కమిటీ చైర్మన్ గోపాలరావు, ఉపేందర్ మాదిగ, రావుగళ్ళ బాబు తదితరులు పాల్గొన్నారు.