
● ఆటిజం చిన్నారులతో అసభ్య ప్రవర్తన
● వైద్యుడిపై కేసు నమోదు
లాలాపేట : చికిత్స పేరుతో ఆటిజంతో బాధ పడుతున్న చిన్నారులతో అమానుషంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆటిజం, స్పీచ్ థెరఫిస్టుగా చెలామణి అవుతున్న రంజిత్ అనే వ్యక్తి గత కొంత కాలంగా హబ్సిగూడలో వైబ్రాంట్ వింగ్స్ పేరుతో చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చే చిన్నారులకు స్పీచ్ థెరఫీ ద్వారా మాటలు నేర్పించాల్సిన అతను వారి శరీరంపై, కాళ్లపై రక్తం వచ్చేలా గాట్లు పెట్టడం, స్కేల్ తో కొట్టడం చేస్తున్నాడు.
చెంగిచర్ల ప్రాంతానికి చెందిన బాలిక (04) మైల్డ్ ఆటిజం, స్పీచ్ డిలేతో బాధపడుతోంది. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్నారు. సదరు చిన్నారి చెంగిచర్లలోని అమ్మమ్మ తాతల వద్ద ఉంటూ గత మూడు నెలలుగా వైబ్రాంట్ వింగ్స్ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. ఇందుకు గాను నెలకు రూ. 60 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజు చెల్లిస్తున్నట్లు బాలిక తల్లి ఉమాశ్రీ తెలిపారు. కాగా రంజిత్ ట్రీట్‌మెంట్ పేరుతో చిన్నారి ఒంటిపై రక్తం కారేలా గోళ్లతో రక్కడం, స్కేల్‌తో వాతలు వచ్చేలా కొడుతున్నాడు. దీంతో బాలిక రంజిత్‌ను చూడగానే భయంతో వణికిపోతోంది.
ఈ విషయమై బాలిక తల్లి రంజిత్‌ను నిలదీయగా చికిత్సలో భాగంగానే అలా చేస్తున్నట్లు బుకాయించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ పాపను కిడ్నాప్ చేస్తామంటూ బాలిక అమ్మమ్మను బెదిరించాడు. బాధితురాలి తల్లి బుధవారం ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అతడికి నోటీసు ఇచ్చి పంపించినట్లు బాలిక తల్లి ఆరోపిస్తోంది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.