ఆ 24 సీట్లతోనే అధికార పగ్గాలు? | Sakshi
Sakshi News home page

ఆ 24 సీట్లతోనే అధికార పగ్గాలు?

Published Mon, Nov 27 2023 7:14 AM

- - Sakshi

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పోలింగ్‌ శాతం పెరిగితే గెలుపోటములపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త యువ ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రధాన రాజకీయ పక్షాలకు కంచుకోటలుగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు తిరుగులేని శక్తిగా తయారయ్యాయి. ప్రతిసారి పోలింగ్‌ శాతం సగానికి మించనప్పటికి.. పోలైన ఓటింగ్‌లో సైతం సగం శాతం దక్కించుకున్న అభ్యర్థులు విజయకేతనంఎగరవేయడం సర్వసాధారణంగా మారింది.

కేవలం పార్టీ సంప్రదాయ, సెంటిమెంట్‌, లబ్ధి పొందిన, ప్రలోభాలకు గురైన, రాజకీయ పార్టీ కార్యకర్తలు, సానుభూతి తదితరులు మాత్రమే పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన తటస్థ ఓటర్లు అభ్యర్థుల జయాపజయాలపై పెద్ద ఆసక్తి లేక తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఫలితం వన్‌ సైడ్‌గా డిసైడ్‌ అవుతోంది. వాస్తవంగా ప్రతి ఓటు ప్రాధాన్యం కలిగిందే. ఓటు హక్కు వినియోగించడంలో నిర్లక్ష్యమే ప్రభావం చూపుతోంది.

40 శాతం సీట్లు ఇక్కడే..
రాష్ట్రం మొత్తంమీద 119 అసెంబ్లీ స్థానాలుండగా అధికార పగ్గాలు చేపట్టేందుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 60 అందులో 40 శాతం సీట్లు మహా నగరంలోనే ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో ఉన్న 24 సీట్లు అత్యంత కీలకమే. పాతబస్తీ మినహా ఏకపక్షంగా ఏ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం లేదు. మజ్లిస్‌ పార్టీకి మాత్రం గ్యారంటీగా ఆరేడు సీట్లు వస్తాయి. మిగతా స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ఉన్నా.. అధికార, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులకే ఫలితం మొగ్గు చూపుతోంది.

పాతబస్తీలో సంప్రదాయ ఓట్లే
రాష్ట్రంలోనే అతి తక్కువగా పోలయ్యే ఓట్లు హైదరాబాద్‌ పాతబస్తీలోనే. ఇక్కడ కేవలం సంప్రదాయ ఓటర్లు మాత్రమే తమఓటు హక్కును వినియోగిస్తారు. అది కూడా ముస్లిం– హిందు ఓట్లు మాత్రమే. అందులో సైతం ముస్లిం ఓటర్లలో 35 శాతం వరకు, హిందూ ఓటర్లలో 20 శాతం వరకు శాతం వరకు మాత్రమే తమ హక్కు వినియోగించుకుంటారు. పాతబస్తీల పెద్దగా పోటీ ఉండని కారణంగా రెండు సామజిక వర్గాలు సైతం ఓటింగ్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చరు. గత ఎన్నికల్లో మజ్లిస్‌ 7 స్థానాల్లో గెలుపొందింది. నాంపల్లి, కార్వాన్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా సిట్టింగ్‌ స్థానాలను పదిల పర్చుకుంది. మజ్లిస్‌కు నాంపల్లి మినహ ఎక్కడ గట్టి పోటీ ఎదురుకాలేదు. అయినా ఏడు శాతం ఆధిక్యతతో గట్టెక్కింది.

కొత్త ఓటర్లే కీలకం..
గ్రేటర్‌ పరిధిలో ఈసారి యువ ఓటర్లు అధికంగా పెరిగారు. మొత్తం మీద 2.71,084 కొత్త ఓటర్లు నమోదయ్యారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే హైదరాబాద్‌ 77,5 22, రంగారెడ్డి జిల్లాలో 92,540, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 1,01,022 ఓట్లు పెరిగాయి. పాతబస్తీతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే ఓటర్లు పెరిగినట్లయింది. ఇందులో తొలి ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. పాతబస్తీతో పాటు మిగతా సెగ్మెంట్లలో సైతం సిట్టింగులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు, జెండాలు మారుతున్న వారి సంప్రదాయ ఓటర్లు సైతం వారి వెంట నడుస్తన్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఉప్పల్‌ మినహా సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, ఎల్‌బీనగర్‌, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌, మహేశ్వరంలో పాతకాపులకే పట్టం లభిస్తూ వస్తోంది.

గత పర్యాయం ఇలా..
గ్రేటర్‌ పరిధిలో గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ 14 సీట్లను దక్కించుకుంది. అంతకు ముందు 2014లో 3 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌ పార్టీ 2018లో మహాకూటమి పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసి ఎల్బీనగర్‌, మహేశ్వరంలోనే మాత్రమే నెగ్గింది. అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అంతకు రెండు పర్యాయాలు ముందు 2009లో గ్రేటర్‌లోని 24 చోట్ల పోటీ చేసి 14 స్థానాలు గెలుచుకుంది. అప్పటి నుంచి 2018 వరకు పెద్దగా సీట్లు గెలుచుకోలేదు. బీజేపీ గత ఎన్నికల్లో గోషామహల్‌లో మాత్రమే గెలుపొందింది. 2014లో గోషామహల్‌తోపాటు ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, ఖైరతాబాద్‌, ఉప్పల్‌లో విజయం సాధించింది.

Advertisement
 
Advertisement