తెలంగాణ అభివృద్ధి ఘనత మాదే.. | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధి ఘనత మాదే..

Published Fri, Nov 17 2023 4:28 AM

- - Sakshi

కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు గెలుపు ఖాయం

ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్‌

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో మరోసారి మాధవరం కృష్ణారావు గెలుపొందడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వచ్చాక తొమ్మిదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎనలేని అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు. తాము చేసిన అభివృద్ధి, గత 65 సంవత్సరాలుగా పరిపాలించిన వారు కూడా చేయలేదన్నారు. ఇది ప్రజలకు తెలుసన్నారు. హైదరాబాద్‌ మహానగరం ప్రశాంతంగా ఉందన్నారు. ఇక్కడ స్థిరపడ్డ ఏ బిడ్డ అయినా ఏ ప్రాంతం వ్యక్తి అయినా, ఆంధ్రా, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన ఎవరైనా వారు మా బిడ్డలే, వారు తెలంగాణ బిడ్డలే..వారిని కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్‌ 10 సంవత్సరాల క్రితమే చెప్పటం జరిగిందన్నారు.

రజనీకాంత్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు..

దేశంలోని అందరూ మన తెలంగాణ వైపు చూసే విధంగా అభివృద్ధి చేశామన్నారు. చైన్నె నుంచి రజనీకాంత్‌ వచ్చి ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. అక్కడి నుంచి వచ్చిన రజనీకి కనిపించింది కానీ, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న గజనీలకు అభివృద్ధి అర్థం కావటం లేదన్నారు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి ఎక్కడికై నా వెళ్తే మీకు మెట్రో, ఫ్లై ఓవర్లు కనిపిస్తాయన్నారు. మోదీ ప్రభుత్వం గ్యాస్‌ ధరను రూ.1200కు పెంచిందన్నారు. ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు కేసీఆర్‌ రూ.400కే సిలిండర్‌ ఇవ్వటానికి హామీ ఇచ్చారన్నారు. రేషన్‌ బియ్యంగా దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తామని, అన్నపూర్ణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామన్నారు. తొమ్మిదేళ్ల మా అభివృద్ధి, గతంలో ప్రతిపక్షాలు పరిపాలించినప్పుడు ఉన్న అభివృద్ధి..కరెంటు కష్టాల్ని పోల్చుకుని ప్రజలు ఓటేయాలన్నారు. హైదరాబాద్‌ బాగుండాలంటే కేసీఆర్‌ ప్రభుత్వమే ఉండాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆరు నెలలకు ఒక సీఎం వస్తాడన్నారు. పలు సంక్షేమ పథకాలు అందించి ప్రజల బాగు కోరిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేయాలని కోరారు. కూకట్‌పల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మాధవరం కృష్ణారావుకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌కు కేపీహెచ్‌బీ డివిజన్‌ కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు, బాలాజీనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ శిరీష, పార్టీలోకి విచ్చేస్తున్న గొట్టిముక్కల పద్మారావులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు. అలాగే ప్రచారానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చానని, ప్రజలు మన్నించాలని కోరారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement