
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి కసరత్తు చేస్తున్న పోలీసు విభాగం ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ప్రతినిధుల పైనా దృష్టి పెట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఉండేందుకు ఇది కూడా కీలకమని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే నేరచరిత్ర కలిగి ఉన్న వారిని పోలింగ్ ఏజెంట్లు, కౌంటిగ్ ప్రతినిధులుగా ఉండకూడదనే నిబంధనను పక్కాగా అమలు చేయాలి భావిస్తోంది. రాజకీయ పార్టీల నుంచి వీరి జాబితా అందిన తర్వాత వ్యక్తిగత పూర్వాపరాలు పూర్తిస్థాయిలో ఆరా తీయాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ పరిశీలనతో సదరు వ్యక్తిని నేర చరిత్ర, స్వభావం ఉన్నట్లు తేలితే తక్షణం ఆ అంశాన్ని ఎన్నికల అధికారులకు తెలిపి పాస్‌లు జారీ కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
– సాక్షి, సిటీబ్యూరో