రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరమేంటి?
ప్రభుత్వ ఆలోచనలు దారి తప్పుతున్నాయి
బాధ్యతల నుంచి తప్పుకోవాలని
చూస్తున్న సర్కార్
జీఓ నెంబర్ 396 వెంటనే ఉపసహరించుకోవాలి
దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్ ప్రారంభం
గుంటూరు వెస్ట్: రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖపై ప్రభుత్వ కన్ను పడింది. ఏడాదికి జిల్లాకు రూ.1000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీఓ నెంబర్ 396ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ప్రైవేటు వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు చేసి చేతులు దులుపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అత్యంత పకడ్బందీ వ్యవస్థల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. ప్రజల ఆస్తులకు చట్టబద్ధత కల్పించుకునేందుకు, లీగల్‌గా కాపాడడం వీటి ప్రధాన బాధ్యత. రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా దస్తావేజలు లేఖరులు, స్టాంపు వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా సుమారు 10 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. జీఓ నెంబర్ 396 అమలైతే వీరంతా ఉపాధి కోల్పోయే అవకాశముంది. దీంతో దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టంది. గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ దస్తావేజు లేఖరులతోపాటు వివిధ సంస్థలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ప్రజలు కూడా తమ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని విమర్శిస్తున్నారు. నల్ల జెండాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.


