డెక్కన్ టుబాకో ఎక్స్‌పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ షఫిక్ ఖాన్ విరాళం జీజీహెచ్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హామీ
గుంటూరు మెడికల్: డెక్కన్ టుబాకో ఎక్స్‌పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ షఫిక్ ఖాన్ రూ. 10 కోట్లు విరాళంతో తన తండ్రి పేరు మీద నిర్మిస్తున్న అజీజ్‌ఖాన్ ఆర్ధో అండ్ ట్రామా బ్లాక్‌కు శనివారం గుంటూరు జీజీహెచ్‌లో శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా శంకుస్థాపన చేశారు.
● ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్త తులసి రామచంద్ర ప్రభు రూ.10 కోట్ల విరాళంతో సర్వీసు బ్లాక్‌ను సిద్ధం చేస్తున్నామని, నాట్కో ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న క్యాన్సర్ అడిషనల్ బ్లాక్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు.
● డెక్కన్ టుబాకో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ షఫిక్ ఖాన్ తన తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న ఆర్ధో అండ్ ట్రామా సెంటర్‌లో వంద పడకలు అందుబాటులో ఉంటాయని, ఐదు అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు.
● ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ షఫీక్ ఖాన్ జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు భవన నిర్మాణం చేయడం ఎంతో అభినందనీయమన్నారు.
● ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విరాళం అందజేసిన షఫిక్ ఖాన్‌ను అభినందించారు.
● భవన నిర్మాణ దాత షఫిక్ ఖాన్ మాట్లాడుతూ రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసి, ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామన్నారు. తమకు వచ్చే లాభాల్లో రైతులకు పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆసుపత్రిలో భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకుని విదేశాల్లో స్థిరపడిన వారంతా మాతృదేశానికి, స్వస్థలాలకు విచ్చేసి అభివృద్ధి చేయాలన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఏపీఐఐసీ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్, డెప్యూటీ కలెక్టర్ చిన్నం సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ పూసల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ బుజ్జా వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


