విశ్రాంత జడ్జిని బెదిరించిన వ్యక్తిపై కేసు
లక్ష్మీపురం: విశ్రాంత జడ్జి స్థలాన్ని ఆక్రమించుకుని బెదిరింపులకు దిగుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంపాలెం స్టార్ గరల్స్ హైస్కూల్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత జడ్జి జోసఫ్ స్థలాన్ని నగరంపాలెం ప్రాంతానికి చెందిన అంబేడ్కర్ ఆక్రమించుకుని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో జోసఫ్ నగరంపాలెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా వర్షం
●ప్రత్తిపాడులో 27.4 మి.మీ. వర్షం
●సగటున 17.9 మి.మీ. వర్షపాతం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 27.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో 9.6 మి.మీ . కురిసింది. సగటున 17.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. మే నెల 25వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 48.2 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 184.7 మి.మీ. నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. గుంటూరు తూర్పు 26.4 మి.మీ., ఫిరంగిపురం 25.2, గుంటూరు పశ్చిమ 24.2, దుగ్గిరాల 22.6, తెనాలి 22.4, పెదకాకాని 21.4, పొన్నూరు 20.6, కొల్లిపర 17.4, పెదనందిపాడు 15.6, చేబ్రోలు 15.4, వట్టిచెరుకూరు 14, కాకుమాను 13.8, తాడికొండ 12.6, మేడికొండూరు 11.4, తాడేపల్లి 11.4, తుళ్లూరు మండలంలో 10.8 మి.మీ. చొప్పున కురిసింది.
సందడిగా మీరక్ వసంతం
నగరంపాలెం: స్థానిక రింగ్‌రోడ్డు శుభం కల్యాణ మండపంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ ఆధ్వర్యంలో మీరాక్ వసంతం వైభవంగా నిర్వహించారు. తంబోలా, టేబుల్‌గేమ్స్, ఫ్యాషన్ షో, పాటలు పోటీలు, కుర్చీలాట, అభరణాల ప్రదర్శన చేపట్టారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆయా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆదర్శ అధ్యక్షురాలు పోలిశెట్టి రత్నప్రియ, కార్యదర్శి వల్లూరి హిమబిందు, కన్వీనర్ మట్ట ప్రియ, మట్టుపల్లి సునీత పాల్గొన్నారు. మీరక్ వసంతం ద్వారా సేకరించిన నిధులు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.


