గ్రామాల విలీనంపై సుదీర్ఘ చర్చ
గ్రామాల విలీనంపై సుదీర్ఘ చర్చ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థలో 11 గ్రామాల విలీనంపై సుదీర్ఘ చర్చ సాగింది. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన శనివారం ఉదయం 10.40 గంటలకు నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. సభ్యుల 46 ప్రశ్నలపై సాయంత్రం వరకు చర్చ కొనసాగింది. 104 కార్పొరేషన్ ప్రియాంబుల్స్, టేబుల్ ఎజెండాను నగర మేయర్ ఆమోదిస్తూ తీర్మానం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న 10 గ్రామాలతోపాటు అదనంగా మరో 11 గ్రామాలను విలీనం చేయాలని కొద్ది రోజుల క్రితం అధికారులు ప్రత్యేక కౌన్సిల్ నిర్వహించారు. అందులో మెజార్టీ సభ్యులు వ్యతిరేకించారు. తీరా శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో లేని అంశాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తీసుకువచ్చి చర్చకు దారి తీశారు.
గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయడం ద్వారా పరిపాలన సమస్యలు వస్తాయని తూర్పు ఎమ్మెల్యే నసీర్ పేర్కొన్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. నగర పరిధిలోని తాగునీటి సమస్య ఇప్పుడు గ్రామాలు విలీనం చేస్తే మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఎక్కడో దూరంగా ఉన్న గ్రామాలను కలుపడం కన్నా దగ్గరలో ఉన్న తక్కెళ్లపాడు, వెనిగండ్ల, ఆగతవరప్పాడు గ్రామాలను విలీనం చేయాలని కోరారు.
డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ గ్రామాల విలీనానికి వైఎస్సార్‌సీపీ అడ్డుకాదన్నారు. కానీ శాసీ్త్రయంగా, సాంకేతికంగా సమస్యలు లేకుండా స్థానికుల అభిప్రాయాలను తీసుకుని విలీనం చేస్తే బాగుంటుందని చెప్పారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ నగరపాలక సంస్థలో గ్రామాలను విలీనం చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్నారు.
చివరకు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ ప్రతిపాదిత 11 తోపాటు మరో 7 చేర్చి మొత్తం 18 గ్రామాలను విలీనం చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. లాల్‌పురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చినపలకలూరు, దాసుపాలెం, తురకపాలెం, తొక్కవర పాలెం, గొల్లవారిపాలెం, ఓబులు నాయుడు పాలెం, జొన్నలగడ్డ, ఆగతవరప్పాడు, వెనిగండ్ల, కొర్నెపాడు, పుల్లడిగుంట, తక్కెళ్లపాడు, లాం, పెదకాకాని గ్రామాల విలీనానికి తీర్మానించారు. ఈ క్రమంలో సభలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది.
‘మానస సరోవరానికి’ రూ.25 కోట్లా?
మానస సరోవరం పార్కు వ్యవహారం కోర్టు కేసులో ఉంటే దాని అభివృద్ధికి రూ.25 కోట్లు ఏ విధంగా ఖర్చు పెడతారంటూ టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాంప్రసాద్ ప్రస్తావించారు. దీనిపై కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ రూపంలో రూ.25 కోట్ల వరకు ఇవ్వనుందని, కార్పొరేషన్ నుంచి రూపాయి కూడా ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు.
బ్రిడ్జి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయండి
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ, స్థల సేకరణ జరగకుండానే కోర్టులో వివాదాలు నడుస్తున్నప్పటికీ అధికారులు శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చడం వల్ల నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతున్నారని చెప్పారు. బ్రిడ్జి డీపీఆర్ ఏంటి? రైల్వే అనుమతి ఇచ్చారా? వంటి అంశాలపై డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడారు. డీపీఆర్, రోడ్లు ఎన్ని అడుగుల మేర వేయబోతున్నారు? ఎప్పటికి పూర్తవుతుంది? వంటి అంశాలను ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తెలిసేలా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వజ్రబాబు కోరారు.
● ప్రక్రియను వ్యతిరేకించిన టీడీపీ
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
● ప్రత్తిపాడు ఎమ్మెల్యే
ప్రతిపాదనకు మేయర్ అంగీకారం
● మొత్తం 18 గ్రామాలు విలీనం
చేయాలని తీర్మానానికి ఆమోదం
● శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలపై కౌన్సిల్‌లో ప్రస్తావన
అంగీకరించని తూర్పు ఎమ్మెల్యే
స్థానికుల అభిప్రాయం తీసుకోవాలి
విలీనానికి కౌన్సిల్ ఆమోదం