రాజధాని రైతుల ఆవేదనకు నిదర్శనమే రామారావు మరణం
తాడికొండ: రాజధాని రైతుల ఆవేదనకు నిదర్శనమే రైతు రామారావు మరణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు అన్నారు. రాజధానిపై కేంద్ర సర్కార్, చంద్రబాబు ప్రభుత్వాల నిర్లక్ష్యమే దీనికి కారణమన్నారు. శనివారం రామారావు భౌతిక కాయాన్ని మందడంలోని ఆయన నివాసానికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బాబురావు, పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, రాజధాని ప్రాంత కార్యదర్శి ఎం. రవి తదితరులు మందడంలో రామారావు నివాసానికి వెళ్లి భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
– సీహెచ్ బాబురావు మాట్లాడుతూ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లిన దొండపాటి రామారావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ చర్యలపై ఆవేదనతో అక్కడికక్కడే మరణించడం ఇక్కడి అన్నదాతల పరిస్థితికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని, వారి సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
మందడం చుట్టూ 60 మీటర్ల వెడల్పుతో రోడ్లు ఉన్నా, ఊరి మధ్యలో నుంచి రోడ్డు వేయాలనే పేరుతో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే భూములు ఇచ్చి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు ఇళ్లు కూడా తీసుకుంటామనడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. గ్రామం మధ్యలో నుంచి వెళ్లే ఎన్– 8 రహదారి ఏర్పాటు నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించారు.
ఆయన వెంట పలువురు సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


