కళామతల్లి కంఠ ఆభరణం
ఎన్టీ రామారావుతో కలిసి నాటకాలు...
ఒంగోలు నుంచి ఎంపీగా విజయం
తెనాలి: తెనాలి ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత సినీతారలు సావిత్రి, జమున. ఇద్దరూ నాటక రంగంలో నిరూపించుకుని వెండితెరకు ఎదిగారు. అద్భుతమైన నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో తమ తమ అధ్యాయాలను లిఖించుకున్నారు. ఆ ఇద్దరు నటీమణులను నాటక రంగానికి పరిచయం చేసింది కొంగర జగ్గయ్య. నటుడు శ్రీధర్‌ను, సంగీత దర్శకుడు కోదండపాణిని సినిమాకు తీసుకొచ్చిందీ ఆయనే. ప్రఖ్యాత తమిళ నటుడు శివాజీగణేశన్‌కు గాత్రం అందించిన డబ్బింగ్ ఆ ర్టిస్టు, తొలి రాజకీయ చిత్ర నిర్మాత కూడా జగ్గయ్యే.
మన మోరంపూడి అబ్బాయే...
ఇన్ని ప్రత్యేకతలున్న జగ్గయ్య స్వస్థలం తెనాలి సమీపంలోని దుగ్గిరాల మండల గ్రామం మోరంపూడి. సంపన్న కుటుంబంలో ఏడుగురి సంతానంలో మధ్యముడిగా 1926 డిసెంబర్ 31న జన్మించారు. తండ్రి సీతారామయ్య తెలుగు, సంస్కృత భాషల్లో దిట్ట. నాటక రంగ వికాసానికి ఎంతో కృషిచేశారు. దుగ్గిరాలలో
టెంట్ సినిమాహాలు నడుపుతూ గాలివానకు కూలిపోవటంతో తెనాలిలో రత్నా టాకీస్ నడిచిన స్థలంలో ‘శ్రీకృష్ణ సౌందర్య భవనం’ పేరుతో నాటకశాలను నిర్మించారు. దీంతో జగ్గయ్యకు చిన్నతనంలోనే సాహిత్య, నాటక కళల్లో ఆసక్తి, ప్రవేశం కలిగాయి. మోరంపూడికి దగ్గర్లోని దుగ్గిరాల బోర్డు హైస్కూలులో చదివారు. గాంధీ ప్రభావంతో తోటి మిత్రులతో కలిసి దళితవాడకు వెళ్లి, పత్రికల్లోని అంశాలను చదివేవారు. నాటి గ్రంథాలయోద్యమం స్ఫూర్తితో ఊళ్లో చిన్న గ్రంథాలయాన్నీ ప్రారంభించారు.
టీచర్ ఉద్యోగానికి రాజీనామా..
టీచర్ ఉద్యోగం తర్వాత ఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రంలో మూడేళ్లు అనౌన్సర్/న్యూస్ రీడర్‌గా చేశారు. అప్పుడే తెనాలికి చెందిన ప్రసిద్ధ రచయిత, దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ ‘పేరంటాలు’ సినిమాకని పిలిపించారు. మళ్లీ అదే దర్శకుడు ‘ప్రియురాలు’ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. తర్వాత మూడు చిత్రాల్లో నటించే అవకాశం రావటంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కట్ చేస్తే...మొత్తం 500 సినిమాలు...అందులో 125 సినిమాల్లో హీరోగా, మిగిలినవాటిలో సైడ్‌హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ యాక్టర్‌గా నటించారు.
తొలి రాజకీయ చిత్రం ...
గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమం ప్రేరణగా ‘పదండి ముందుకు’ సినిమా తీశారు. తెలుగులో తొలి రాజకీయ చిత్రం అదే. రాష్ట్రప్రభుత్వం రూ.50 వేల పారితోషికాన్ని ఇచ్చింది. ప్రభుత్వ సబ్సిడీ రావటం ఆ చిత్రంతోనే ప్రారంభమైంది. తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శితమైంది. కోదండపాణిని సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. హీరో కృష్ణ ఆ సినిమాలో చిన్న పాత్రలో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తమిళ నటుడు శివాజీగణేశన్‌కు ‘మనోరమ’ తెలుగు వెర్షనులో డబ్బింగ్ చెప్పారు.
గుంటూరులోని ఏసీ కాలేజీలో చేరాక, నాటకాలు, విద్యార్థి ఉద్యమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు. ప్రజా నాట్యమండలి సభ్యులతో నాటకాలు వేశారు. సాహితీ సంస్థల్లో సభ్యుడయ్యారు. అప్పట్లో గుంటూరులో ఉంటున్న అడవి బాపిరాజు వద్ద మూడేళ్లు చిత్రలేఖనంలో శిక్షణ పొందారు. ఏసీ కాలేజీలో సహ విద్యార్థి ఎన్టీ రామారావుతో కలిసి నాటకాలు ఆడారు. ఆ రోజుల్లోనే మిత్రులతో కలిసి ‘శోభ’ లిఖిత పత్రిక నడిపారు. 1947లో బీఏ పూర్తి చేసి దుగ్గిరాలలోని జిల్లా బోర్డు హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరారు. అక్కడి నుంచే రోజూ సాయంత్రం రైలులో విజయవాడ వెళ్లి ఎన్టీ రామారావు నిర్వహిస్తున్న ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’లో నాటకాలు వేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాక్రిఫైస్’ నాటికను జగ్గయ్య బలిదానం పేరుతో అనువదించారు.
రాజకీయాలతో తొలి నుంచి అనుబంధం కలిగిన జగ్గయ్య 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు. భారతదేశంలో ప్రజలచేత ఎన్నికై లోక్ సభకు వెళ్లిన తొలి నటుడుగా గుర్తింపు పొందారు. 1967లో ఢిల్లీ అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం జగ్గయ్యను ‘కళావాచస్పతి’ బిరుదుతో సత్కరించింది. 1991లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1992లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’తో గౌరవించింది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2004 మార్చి 5న మృతి చెందారు.
నాటకం, న్యూస్ రీడింగ్, సినిమా, డబ్బింగ్, సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళల్లో అభినివేశం. అపార ప్రతిభ కలిగిన కళామతల్లి ‘కంఠ’హారం కొంగర జగ్గయ్య. చక్కని రూపం, గళంలోని గాంభీర్యం, చక్కని నటనతో ‘కళావాచస్పతి’ కీర్తి కిరీటాన్ని అందుకున్నారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న జగ్గయ్య శతజయంతి సంవత్సరం ఈ నెల 31న ఆరంభం కానుంది. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలిని స్మరించుకోవటం సందర్భోచితం...
కళామతల్లి కంఠ ఆభరణం
కళామతల్లి కంఠ ఆభరణం
కళామతల్లి కంఠ ఆభరణం


