యువకుడు దారుణ హత్య
చేబ్రోలు: మండల పరిధిలోని నారాకోడూరు గ్రామం సమీపంలో శనివారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నారాకోడూరు దళితవాడ ప్రాంతానికి చెందిన నత్తల మృత్యుంజయరావు (45) తెనాలి రోడ్డులోని వాటర్ ప్లాంట్ ఎదురుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి అడ్డగించారు. మారణాయుధాలతో పథకం ప్రకారం దాడి చేశారు. తీవ్ర గాయాలపాలై అతడు అక్కడికక్కడే మరణించాడు. నారాకోడూరు ఎంపీటీసీ సభ్యుడైన టీడీపీకి చెందిన నత్తల రమేష్ సోదరుడు మృత్యుంజయరావు గ్రామంలోని గజవెల్లి స్పిన్నింగ్ మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. పొన్నూరు రూరల్ సీఐ, చేబ్రోలు ఎస్‌ఐ పి.వీరనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృత్యుంజయరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


