సందర్భం
జూన్ 8న విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఇప్పటికి 10 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసు కోవడం అవసరం. ‘ఇది విధి నిర్వహణ తగినంతగా లేకపోవడం వల్లనే జరిగింది’ అని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాజీ సీఎమ్‌డీ మధు సూదన్ చెప్పారు. ‘నివారించదగ్గ ప్రమాదమే ఇది’ అని కూడా ఆయన అన్నారు. అంటే ‘ప్రమాదాలు జరుగుతాయి అని ముందే తెలుసు’ అని దీనర్థం. ఈయనే కాకుండా సీఎంఎస్–2 (స్టీల్ మెల్టింగ్ షాప్–2)లో, గతంలో పనిచేసిన కేఎస్‌ఎన్ రావు కూడా ‘కరిగిన ఉక్కుతో సంబంధం ఉన్న పనుల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ భద్రత ఇప్పుడు లోపించింద’న్నారు.
ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా బైటకు రాకపోయినప్పటికీ, ఫ్యాక్టరీల ప్రధాన ఇన్‌స్పెక్టర్ నిర్వహించిన ప్రాథమిక విచారణ ప్రకారం ‘ద్రవ ఉక్కులో’ చిక్కుకు పోయిన వాయువులు ఒక్కసారిగా విడుదల కావడంతో పేలుడు సంభవించి, లాడిల్ ఒరిగిపోయి ‘ద్రవ ఉక్కు’... కింద పనిచేస్తున్న కార్మికులపై పడినట్లు గుర్తించారు. ‘స్టీల్ మెల్టింగ్ షాప్’లో అత్యంత వేడిగా ఉన్న ‘ద్రవ ఉక్కు’ను మోస్తున్న లాడిల్ (ఉక్కుతో తయారైన భారీ పాత్ర)లో అకస్మాత్తుగా పేలుడు ఏర్పడింది. దాంతో లాడిల్ ఒరిగిపోవడం లేదా పగిలిపోవడం వల్ల సుమారు 1500 –1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ద్రవ ఉక్కు కార్మి కులపై చిందింది. భారతదేశంలో ఇతర ఉక్కు కర్మాగారాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు అప్పుడప్పుడు జరిగాయి. ఉదాహరణకు, 2025లో హిమాచల్ ప్రదేశ్‌లో ఒక స్టీల్ ఫ్యాక్టరీలో గేర్ లోపం వల్ల ద్రవ ఇనుము కార్మికులపై చిందడంతో ఒకరు మరణించారు.
మన దేశంలోనే కాకుండా ఇంకా ఇతర చోట్ల కూడా ఇలాంటివి కొన్ని జరిగాయి. మెక్సికో, అపిజాకో (2024)– ఉక్కు కర్మాగారంలో ద్రవ ఉక్కు చిందడంతో పెద్ద పేలుడు సంభవించి కనీసం 12 మంది మరణించారు. జర్మనీ, సార్‌స్టాల్ ప్లాంట్ (2022) లాడిల్ గేట్ వాల్వ్ సాంకేతిక లోపం వల్ల ‘ద్రవ ఉక్కు’ నియంత్రణ తప్పి, పెద్ద మొత్తంలో బయటకు వచ్చింది. చైనాలో 2007లో జరిగిన ‘చింగ్‌హె ఉక్కు కర్మాగార ప్రమాదం’లో 32 మంది మరణించారు. అలాగే యూరప్, జపాన్, అమెరికాలో కూడా లాడిల్ ప్రమాదాల జరిగాయి.
‘ప్రపంచ స్టీల్ పరిశ్రమ సంఘం’ ప్రతి సంవత్సరం ప్రమాదాల గణాంకాలు విడుదల చేస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్లలో జరిగిన లాడిల్ ప్రమాదాలపై చాలా కాలంగా పరిశోధనలు, విచారణలు, భద్రతా చర్చలు జరిగాయి. వాటిల్లో ప్రధానమైనవిగా కొన్ని గుర్తించారు:
1. లాడిల్ రిఫ్రాక్టరీ లైనింగ్ దెబ్బతినడం. అంటే లాడిల్ లోపల వేడి నిరోధక ఇటుకలు ఉంటాయి. అవి పలుచబడి పోతుంటాయి. దీన్ని సమయానికి గుర్తిస్తూ, తనిఖీలు చేసుకుంటూ ఉండాలి. లేకుంటే లాడిల్ పగిలిపోయి, మెటల్ బయటకు వచ్చేస్తుంది. 2. క్రేన్ లేదా లిఫ్టింగ్ వ్యవస్థ వైఫల్యం. 3. మెయింటెనెన్స్ లోపాలు. 4. నీరు లేదా తేమ... కరిగిన ఉక్కును తాకితే క్షణాల్లో అక్కడ ఆవిరితో కూడిన పేలుడు సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది అత్యంత ప్రమాదకర కారణాల్లో ఒకటి. 5. హజార్డ్ సెన్సర్లు, ఆటోమేటిక్ హెచ్చరిక సిస్టమ్ లేకపోవడం. అంటే ఉష్ణోగ్రత, పగుళ్లు, లీకేజీలు ముందే గుర్తించే సెన్సర్లు లేకపోవడమన్నమాట. 6. మానవ తప్పిదాలు: భద్రతా విధానాలు పాటించకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం. తక్కువ సిబ్బందితో పని చేయించడం.
సూచనలు పాటించనందువల్లే...
‘ప్రపంచ స్టీల్ పరిశ్రమ సంఘం’ ఉక్కు పరిశ్రమల్లో లోపాల్ని గుర్తించడమే కాకుండా, కొన్ని పరిష్కారాల్ని కూడా సూచించింది. అవి ఏమిటంటే: లాడిళ్లకు ‘నిర్దిష్ట జీవిత కాలాన్ని’ నిర్ణయించి, సమయానికి మార్చడం, ప్రతి షిఫ్టుకు ముందు తప్పనిసరిగా కొన్ని తనిఖీలను చేయడం, క్రేన్లపై అదనపు భద్రతా వ్యవస్థలను నిర్మించడం, ఏఐతోనూ, థర్మల్ కెమెరాలతోనూ, సెన్సర్లతోనూ నిరంతర పర్యవేక్షణ చేయడం, కరిగిన లోహం ప్రయాణించే మార్గాల్లో కార్మికుల ఉనికిని తగ్గించడం, అత్యవసర పరిస్థితులపై తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించడం, నీరు/తేమ పూర్తిగా తొలగించిన తర్వాతే కాస్టింగ్ పనులు ప్రారంభించడం.
‘స్టీల్ సంఘం సూచనలు’ అంటూ ఇప్పుడు మనం వేటినైతే చెప్పుకున్నామో వాటిని ‘విశాఖ ఉక్కు’ పాటించడం లేదు. పాటించడం లేదు కాబట్టే, ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ఆ తప్పును గుర్తించాలి. ‘విశాఖ ఉక్కు కర్మాగారం’ అనే దానికి సంబంధించినంతవరకూ యాజమాన్యం, నిర్వహణ, భద్రతా విధానాలు, సాంకేతిక కార్యకలాపాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. కానీ, చట్టపరమైన పర్యవేక్షణ, తనిఖీలు, అత్యవసర స్పందన లాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదానికి రెండు ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి!
నన్నూరి వేణుగోపాల్
వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త


