సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారు
తాడేపల్లి రూరల్: రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రకాలుగా వేధించినా.. చావనైనా చస్తాంగానీ తమ భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. బలవంతపు భూ సేకరణ, చట్టపరమైన అంశాలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చావేదిక ఆధ్వర్యంలో సోమవారం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్, ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ యెరసూరి మహాదేవ్, రిటైర్డ్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, సోషల్ యాక్టివిస్ట్ కన్వీనర్ డాక్టర్ వసుంధర సోమవారం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పర్యటించారు. రాజధానిలో చెరువులు, రోడ్ల పేరుతో, ఇతర అంశాలను చూపిస్తూ ఏ విధంగా వేధిస్తున్నారనే విషయాన్ని పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పొలాల్లో పండే పంటలు, భూగర్భ జలాల పరిస్థితి గురించి వివరాలడిగారు. ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపులతో నిద్రలేని రాత్రులు గడుపుతూ, మనోవేదనతో అనారోగ్యం పాలవుతున్నామని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటికీ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించలేదని తెలిపారు. ‘పూలింగ్‌కు పొలం ఇవ్వకపోతే పొలం చుట్టూ గోతులు తీయడం, విద్యుత్ వైర్లు కట్ చేయడం, విద్యుత్ మోటార్లు దొంగతనం చేయడం, సహజసిద్ధమైన డ్రైనేజీలను, పంట కాలువలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. రాజధాని ఎక్కడ నిర్మించాలనే దానిపై అప్పట్లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ప్రభుత్వం తుంగలో తొక్కి, జరీ భూముల్లో, నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టింది.
రైతులకు ఎంతో ఆదాయం వచ్చే ఈ భూములు తీసుకోవాలంటే అదే తరహా భూములను ఇవ్వాల్సి ఉంది. అలాంటివి పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది’ అని చెప్పారు. సీఆర్డీఏ సిబ్బందితో పాటు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వారి స్వలాభం కోసం రైతులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ మంగళవారం తాడేపల్లి పరిధిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, రైతుల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకునేది ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉండవల్లి, పెనుమాక అధ్యక్షులు మేక వీరశ్రీధర్‌రెడ్డి, మేక శివారెడ్డి, రైతుసంఘం నాయకులు పూర్ణచంద్రరావు, శివారెడ్డి, శివశంకర్, శివరామ్, చిన్న నాగేశ్వరరావు, మేకా దామేష్‌రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
న్యాయపోరాటం చేస్తాం
ప్రభుత్వ, అధికారుల వేధింపుల వల్ల ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థంగాక నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. రైతులతో విడివిడిగా మాట్లాడి మీ పొలానికి అవార్డు ప్రకటిస్తున్నాం అంటూ భయపెడుతున్నారు. నా భూమి ఇవ్వాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. పూలింగ్‌కు ఇస్తే రూ.6.5 కోట్లు వస్తాయి, ఇవ్వకపోతే రూ.70 లక్షలు వస్తాయి.. అని చెబుతున్నారు. మాకు సలహాలు ఇవ్వండి. న్యాయపోరాటం చేస్తాం.
– చిన్న నాగేశ్వరరావు
3 ఎకరాలకు 3 రకాల నోటీసులిచ్చారు
యర్రబాలెంలో బైపాస్ పక్కనే నాకు మూడెకరాల పంట భూమి ఉంది. అందులో కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నా. నాకు నోటీసులు ఇవ్వకుండానే నా పొలంలో కాలువలు తీశారు. ఇదేంటని ప్రశ్నించి కోర్టుకు వెళతానంటే అధికారులు తూతూ మంత్రంగా కాలువను పూడ్చారు. మూడెకరాలకు సంబంధించి మూడు రకాల భూసేకరణ నోటీసులు ఇచ్చారు. ఒక నోటీసులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని, మరో నోటీసులో కొండవీటి వాగు అభివృద్ధి అని బెదిరిస్తున్నారు. పూలింగ్‌కు ఇవ్వకపోతే ఇబ్బందులు పడతారంటూ అధికారులే బెదిరిస్తున్నారు. నేను నా భూమిని కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయిద్దామనుకుంటున్నా. గతంలో ప్రభుత్వం ప్రకటించిన భూ సేకరణ మీద కోర్టుకు వెళితే ఆ కేసును ప్రభుత్వం విత్‌డ్రా చేసుకుంది. మళ్లీ ఇప్పుడు బెదిరిస్తున్నారు.
– శివశంకర్
మమ్మల్ని చంపి మా భూములు లాక్కోండి
పంట పొలాల చుట్టూ చెరువులు తవ్వి, గుంతలు తీసి, మోటార్లు దొంగతనాలు చేసి వేధించినా భూ సేకరణకు మా భూములు ఇవ్వం. ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలంటే.. మీ పోలీసుల చేత మా ప్రాణాలు తీయించి లాక్కోండి. మా తాతలు, తండ్రులు మాకు బతకడానికి ఇచ్చిన ఈ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీరెవరు? మా భూములు మాకు ఉండేలా అందరూ మాకు సహకరించాలి.
– శివారెడ్డి


