శిశువును తనకివ్వాలంటూ వన్‌స్టాప్ సెంటర్ సిబ్బందిని అడుగుతున్న ట్రాన్స్‌జెండర్ శ్రీకన్య
కాకినాడ జీజీహెచ్‌లో అలజడి
హిజ్రాలు, బాలింత మధ్య ఘర్షణ
పుట్టిన శిశువును తమకివ్వాలని వాగ్వాదం
పోలీస్ భద్రత మధ్య బాలింతకు వైద్య సేవలు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో అలజడి రేగింది. ఓ తల్లి కన్న శిశువును తమకివ్వాలని కొందరు హిజ్రాలు ఘర్షణకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. పదుల సంఖ్యలో హిజ్రాలు మాతాశిశు విభాగానికి చేరుకోవడంతో ఆస్పత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన 30 ఏళ్ల ఆకుమర్తి మేరీ కుమారి.. తన భర్త ఉండుర్తి శ్రీనుతో విడిపోయింది. 9 ఏళ్ల కుమార్తె ఉండగా కుమార్తె తండ్రితోనే ఉంటోంది. ఆ తర్వాత మేరీకి నరేష్ అనే వ్యక్తితో పరిచయమైంది.
ఏడాదిన్నర క్రితం అమలాపురం నుంచి ఆమెను తీసుకొచ్చిన నరేష్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నివాసం ఉంటూ సహజీవనం చేశాడు. ఈ క్రమంలో మహిళ గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసి నరేష్ మేరీని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయాడు. పోషణ బరువవ్వడంతో నిండు చూలాలిగా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో భిక్షాటన చేస్తూ మేరీ బతుకీడుస్తోంది. సుమారు 10 రోజుల క్రితం సామర్లకోటకు చెందిన శ్రీకన్య అనే హిజ్రా రైలులో భిక్షాటన నిమిత్తం రాజమహేంద్రవరానికి వెళ్లింది. అక్కడ స్టేషన్‌లో మేరీని చూసి.. ఆమె డబ్బులు అడగడంతో రూ.50 ఇచ్చింది. నిండు గర్భంతో ఈ దుస్థితి ఏంటని శ్రీకన్య ఆరా తీయగా, తాను ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఈ స్థితికి చేరానని మేరీ చెప్పింది.
ఆమె దీనగాథ విన్న శ్రీకన్య ఆమెను చేరదీసింది. ఆమెను సామర్లకోటకు తీసుకొచ్చి ఇంట్లో ఉంచింది. ఇంటికి చేరాక, నీ బిడ్డను నాకిస్తావా.. నిన్ను. బిడ్డను బాగా చూసుకుంటానని కోరింది. అందుకు మేరీ అంగీకరించింది. అప్పటి నుంచి మంచి ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు అందించింది. ప్రసవ నొప్పులు రావడంతో ఈ నెల 24 అర్ధరాత్రి మేరీని శ్రీకన్య కాకినాడ జీజీహెచ్‌లో చేర్చింది. 25వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకి మేరీ 2.5 కిలోల బరువుతో మగ బిడ్డను ప్రసవించింది. దీంతో మేరీ కన్న బిడ్డ తమదని, ఆ మాటిస్తేనే వారం రోజుల పాటు సాకానని, కంటికి రెప్పలా కాచి, ఆసుపత్రిలో చేర్చి సపర్యలు చేశానని శ్రీకన్య చెబుతోంది.
ఆమె ఆరోగ్యం కోసం రూ.20 వేలు ఖర్చు చేశానని, బిడ్డ తనకే దక్కాలని పట్టుబడుతోంది. తల్లి అందుకు ససేమిరా అంటోంది. తన బిడ్డను తానే పెంచుకుంటానని, వారికి ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆసుపత్రి వర్గాల ద్వారా విషయం వన్‌స్టాప్ సెంటర్‌కు చేరింది. పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు, సిబ్బంది మేరికి రక్షణగా నిలిచారు. వార్డులో వైద్య సిబ్బంది సాయంతో ఆమెను సంరక్షిస్తున్నారు. తన బిడ్డను ఇవ్వనని, తమ ఇద్దరికీ రక్షణ కల్పించాలని బాలింత వారిని కోరింది.
ఈ నేపథ్యంలో ఆగ్రహోదగ్రురాలైన శ్రీకన్య సోమవారం సాయంత్రం మరికొందరు హిజ్రాలతో కలిసి ఆసుపత్రిలో ఘర్షణకు దిగింది. వారంతా వార్డును చుట్టుముట్టడంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘర్షణ తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ బిడ్డ తనదేనంటూ శ్రీకన్య బృందం వాదిస్తుండడంతో మేరీకి, ఆమె బిడ్డకు వార్డులో పోలీస్ భద్రత మధ్య వైద్య సేవలు కొనసాగుతున్నాయి.


