ఏపీఈఆర్‌సీ ఫ్యూజులు పీకేశారు | APERC has recently completely shut down the Commission website | Sakshi
Sakshi News home page

ఏపీఈఆర్‌సీ ఫ్యూజులు పీకేశారు

Jul 28 2026 5:26 AM | Updated on Jul 28 2026 5:26 AM

APERC has recently completely shut down the Commission website

చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థ నిర్వీర్యం

గతంలో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండేవారు

2024 అక్టోబర్‌ నుంచి పూర్తి స్థాయి చైర్మన్‌ లేరు

2025 ఫిబ్రవరిలో మరో సభ్యుడూ పదవీ విరమణ

అప్పటి నుంచి ఒకే ఒక్క సభ్యుడితోనే కార్యకలాపాలు

తాజాగా కమిషన్‌ వెబ్‌సైట్‌ పూర్తిగా నిలిపివేత

సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చరిత్రలో ఎన్నడూ ఇలా ఒకే ఒక సభ్యుడు వేదికపై ఉండి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం చూడలేదు. ప్రతిసారీ చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండి బహిరంగ విచారణ చేపట్టేవారు. ఈసారి ముగ్గురు బదులు ఒక్కరే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే’’...అంటూ ప్రజలు, నాయకులు ఈ ఏడాది జనవరిలో జరిగిన 2026–27 ఆదాయ, అవసరాల నివేదికలు, టారిఫ్‌ ప్రతిపాదనలపై బహిరంగ విచారణలో మండిపడ్డారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పురాకపోగా, తాజాగా ఏపీఈఆర్‌సీ కార్యకలాపాలపైనే సందేహాలు కలిగించేలా, కమిషన్‌ వెబ్‌సైట్‌ను కొన్ని రోజులుగా నిలిపివేసింది. దీంతో ఏపీఈఆర్‌సీ ఫ్యూజులు పీకేసినట్టయింది. ఫలితంగా ప్రజలకు ఏపీఈఆర్‌సీతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. 

నాడు అలా.. నేడు ఇలా
1999 మార్చిలో హైదరాబాద్‌ కేంద్రంగా ఏపీఈఆర్‌సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పుడు అధికారంలో ఉన్నది ఇదే చంద్రబాబు. కానీ మండలి హైదరాబాద్‌ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ చొరవతో ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని 2023 ఆగస్టు 25న నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.  కమిషన్‌కు సొంత భవనంతో పాటు ఓ అతిథి గృహాన్ని నిర్మించడానికి గత ప్రభుత్వం రెండు ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు దాదాపు  నిధులు అందించింది.

విశాఖలో ఏపీఈఆర్‌సీ క్యాంపు కార్యాలయం గత ప్రభుత్వ హయాంలోనే 2023 ఆగస్టు 18న ప్రారంభించారు. దీంతో ఐదేళ్ల కాలంలో దాదాపు 250 ఆర్డర్లు, 27 నిబంధనలను జారీ చేసింది. విద్యుత్‌ చార్జీలు, భారీ ప్రాజెక్టులు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి బహిరంగ విచారణలు నిర్వహిస్తూ, అనుమతులు మంజూరు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలు ఇష్టానుసారం వ్యవహరించకుండా నియంత్రిస్తుంటుంది ఏపీఈఆర్‌సీ. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఏపీఈఆర్‌సీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వీర్యమైపోతోంది. ఒక చట్టబద్ధమైన సంస్థకు చైర్మన్‌ను నియమించడానికి కూటమి ప్రభుత్వం తాత్సారం చేయడంతో పాటు కమిషన్‌ ఉనికినే లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

వెబ్‌సైట్‌ నిలిపివేత వెనుక అనుమానాలు
ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండే ఏపీఈఆర్‌సీకి 2024 అక్టోబర్‌ నుంచి పూర్తి స్థాయి చైర్మన్‌ లేరు. 2025 ఫిబ్రవరిలో మరో సభ్యుడు కూడా పదవీ విరమణ చేశారు. ఇక అప్పటి నుంచీ ఒకే ఒక్కరు ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా, సభ్యుడిగానూ విధులు నిర్వర్తిస్తున్నారు. 2025 జూలైలో ప్రభుత్వం ఒక సభ్యుడి నియామక ప్రక్రియ చేపట్టింది. అది కూడా ఇంత వరకూ పూర్తి చేయలేదు. చైర్మన్, సభ్యుడు లేకుండా ఏపీఈఆర్‌సీని ఏకాకిగా మార్చి తమకు అనుకూలంగా నిర్ణయాలు వెలువడేలా చేసుకుంటోందనే విమర్శలు వస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. 

ఈ విషయంపై సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు కలుగజేసుకుని ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా కమిషన్‌ వెబ్‌సైట్‌ను సైతం నిలిపివేసింది. దీంతో ఏపీఈఆర్‌సీ రోజువారీ కార్యకలాపాల గురించి ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. వెబ్‌సైట్‌ను ఆపేసి, కమిషన్‌తో ప్రభుత్వం తనకు కావాల్సిన పనులు జరిపించుకుంటుందనే అనుమానాలు ఇంధన రంగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement