న్యూయార్క్ యూనివర్సిటీ పట్టభద్రులను ఉద్దేశించి సుప్రసిద్ధ గాయని, గీత రచయిత్రి టేలర్ స్విఫ్ట్ చేసిన స్నాతకోపన్యాస సంక్షిప్త పాఠం:
విశ్వగురు
ఉచిత సలహాలివ్వడం నాకు ఇష్టం ఉండదు. నా ఈ నియమం గురించి తర్వాత మరింత వివరిస్తాను. కానీ, జీవితంలో నాకు ఇంత వరకు సహాయపడిన వివేకవంతమైన విషయాలు ఏమైనా ఉంటే, అవి మీకు వెల్లడించడం కోసమే నన్ను ఇక్కడకు ఆహ్వానించారు. ఏం చేయాలో మీకు చెప్పేంత యోగ్యత ఉన్న దానినని, నేను ఏ కోశానా భావించడం లేదని మొదటే స్పష్టం చేయదలచుకున్నాను.
ప్రయత్నించడానికి సిగ్గు పడకూడదు!
వృత్తి జీవిత కలలను సాకారం చేసుకోవడంలో అనుభవంలోకి వచ్చిన ఒత్తిడి, ప్రేమ, అవకాశాలు, అవమానాలకు సంబంధించి కొన్ని సంగతులు పంచుకుంటాను. ఏ విషయంలోనైనా పట్టు విడుపులు అవసరం. దేనిని మనసులో పెట్టుకోవాలో, వేటిని వదిలే యాలో తెలుసుకోవాలి. ఇతరుల గురించిన అల్పమైన విషయాలను వదిలేయడమే మంచిది. పగలు ప్రతీకారాలు, అసూయలు, మాజీ ప్రేయసీ ప్రియులు ఎలా ఉన్నారోననే తహతహలాంటి నకారాత్మక అంశాలు గుండెలో బరువును పెంచుతాయి. సంతోషం, శాంతి, సకారాత్మక అనుభవాలు మనసును తేలికపరుస్తాయి.
అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదని మథనపడటం ఎవరికైనా సహజం. గతాన్ని తలచుకుని వగవకూడదని ఎంత ప్రయత్నించినా దాన్నుంచి మనం తప్పించుకోలేం. కనుక, దాన్ని జీవితంలో ఒక భాగంగా భావించుకునే గుణాన్ని అలవరచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయిందనే భావన అప్పటికి గానీ ఏర్పడదు. మార్పు అనివార్యం. ఇప్పుడు మనం అక్కున చేర్చుకుంటున్న ఫ్యాషన్ మున్ముందు మనకే హాస్యా స్పదమైనదిగా తోచవచ్చు. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం కుంగుబాటుకు లేదా నవ్వులాట పరిస్థితులకులోనై ఉండవచ్చు. అదేమీ పెద్ద విషయం కాదు. కుతూహలాన్ని దాచుకోకపోవడమే మంచిది. దేన్నైనా ట్రై చేయాలనిపిస్తే, ట్రై చేయడమే. ఫలితం ఎలాగైనా ఉండనీ. ప్రయ త్నించి చూడటానికి మాత్రం ఎన్నడూ సిగ్గు పడకూడదు.
అందరమూ రచయితలమే!
నేను 12వ ఏట నుంచే పాటలు రాయడం ప్రారంభించాను. అప్పటి నుంచి అది నా జీవితానికి దిక్సూచిగా మారింది. నా జీవితం కూడా నా రచనలకు ప్రేరణనిచ్చింది. నేను ఏది చేసినా, అది నా రచనలకు పొడిగింపు మాత్రమే. అది వీడియోలకు లేదా షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించడం కావచ్చు. ఒక టూర్‌కు విజువల్స్ సృష్టించుకోవడం లేదా వేదికపై నిలబడి ప్రదర్శన ఇవ్వడం కావచ్చు. ఆ కళపట్ల నాకున్న ప్రేమతో ప్రతీదీ ముడిపడి ఉంటుంది. మెరుగైనవాటికోసం ఉన్న ఐడియాలు అన్నింటిని జల్లెడపడుతూ ఉండేదాన్ని. వాటికి చివరి క్షణం వరకు సానబెట్టేదాన్ని. ఒక్కోసారి అర్ధరాత్రి లేచి కూర్చుని పాతవాటిని పడేసి, కొత్తవి స్వీకరించేదాన్ని.
ఒక్కోసారి తట్టిన మాటలు హృదయంలో నాటుకుపోయేవి. వాటిని రికార్డు చేయడమో లేదా రాసిపెట్టడమో చేస్తేకానీ, మరి దేనిపైనా దృష్టి సారించగలిగేదాన్ని కాను. నా ఆల్బమ్‌లకు తగ్గట్టుగా విడుదల ప్రదేశాలు మార్చుకున్నాను. కళా ప్రక్రియలు మార్చాను. దేశవాళీ నుంచి పాప్‌కు మారాను. జానపదాలకు ప్రత్యామ్నాయాలు ఎంచుకున్నాను. రచనల గురించి ఎక్కువ చెబుతూ వస్తోందని మీకు అనిపించవచ్చు. కానీ, మనందరం రచయితలమేనని నా స్థిరాభి ప్రాయం. మనలో చాలామంది వివిధ సందర్భాలకు తగ్గట్లుగా వివిధ స్వరాలతో రాస్తాం. ఇన్‌స్టాగ్రామ్‌కు రాసినట్లుగా థీసిస్‌కు రాయం. బాస్‌కు పంపే ఇ–మెయిల్ ఒకలా, చిన్ననాటి స్నేహితునికి రాసే ఉత్తరం ఇంకోలా ఉంటుంది. మనందరం సాహితీ ఊసర వెల్లులం. ఒకే సమయంలో అనేక రకాల పాత్రలు పోషిస్తాం.
తప్పుల నుంచే నేర్చుకోగలం!
అడగందే సలహాలు ఇవ్వనని ముందే చెప్పాను కదా. ఎందుకో చెబుతాను. నా వృత్తి జీవితం 15వ యేట నుంచే మొదలవడం వల్ల నేను కొంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏళ్ళ తరబడి ఉచిత సలహాలు వినవలసిరావడమే ఆ మూల్యం. నేనే పిన్న వయస్కురాలిని కావడం వల్ల సంగీత పరిశ్రమ, మీడియాకు చెందినవాళ్ళు, ఎగ్జిక్యూటివ్‌లు నిరంతరం సలహాలిచ్చేవాళ్ళు. అవి ఒత్తిడికి లోను చేసేవి. నేను ఏ తప్పులూ చేయకపోతే, పిల్లలందరికీ ఆదర్శప్రాయురాలినవుతాననీ, పొరపాట్లకు పాల్పడితే మిన్ను విరిగి మీదపడుతుందనీ అన్నట్లుగా ఉండేది సలహాలు ఇచ్చేవారి ధోరణి.
కానీ, నా స్వానుభవం వేరేగా ఉంది. నేను చేసిన తప్పిదాలు నన్ను నేను మరింత మెరుగుపరచుకునేందుకు దారితీశాయి. పొర పాట్లతో పరిస్థితి కంగాళీగా మారి, మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడితే, అది కూడా మానవ అనుభవంలో భాగం కిందనే లెక్క. మనం ఒకసారి విఫలమైనా, మన పక్కనే ఉంటూ మన వెన్ను తట్టేవారు ఎవరో తెలుసుకోవడం, జరిగినదానికి నవ్వు కోవడం కూడా ఒక వరం. తిరస్కరణకు గురవడం,బృందంలో చోటు దక్కకపోవడం, గెలవలేకపోవడం, అవకాశాన్ని తగినంతగా వినియోగించుకోలేకపోవడం వంటివి తలచుకుంటే, ‘సవ్యంగా సాగిన’ సందర్భాలకన్నా అవే ముఖ్యమైనవనిపిస్తుంది. ఒంటరితనం అంటే ఏమిటో అలా భంగపడిన సందర్భాల్లో మనకు తెలిసివస్తుంది.
పరిపూర్ణత వాస్తవికమేనా?
నా దృక్పథం నిరంతరం మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అన్నీ పూర్తి అర్థరహితమైనవిగా తోస్తాయి. పరిపూర్ణతతో జీవితం గడపడం కష్టం. ఎందుకంటే, జీవితంలో అనుచితంగా మాట్లాడటం అనివార్యం. నమ్మదగని వ్యక్తిని నమ్ముతాం. చేయవలసినంత పని చేయం. మితిమీరి స్పందిస్తాం. ఎవరి హృదయాలను గాయపరచ కూడదో వారిని మన మాటలతో గాయపరుస్తాం. అతిగా ఆలో చిస్తాం లేదా అసలు ఆలోచించం. మనకు మనమే ద్రోహం చేసుకుంటాం. మనకు అనుభవమైనదానినే వాస్తవికతగా చిత్రిస్తాం. ఆనందకరంగా గడపవలసిన క్షణాలని చేజేతులా పాడుచేసుకుంటాం. ఇతరుల ఆనందాన్ని కాలదన్నుతాం. తీవ్ర అపరాధ భావనకు లోనవుతాం. అది మనల్ని ఆసాంతం దహించి వేస్తుంది. చివరికి చేసిన తప్పు తెలుసుకుంటాం. అలాంటిది మళ్లీ పునరావృతం కాకుండా నివారించేందుకు ప్రయత్నిస్తాం. ఈ తప్పులు మనం కొన్నింటిని కోల్పోయేట్లుగా చేస్తాయి.
జీవితంలో మన వ్యక్తిత్వాన్ని మనం చాటుకోవలసిన అవస రాలు తలెత్తుతాయి. ఒకసారి వెనక్కి తగ్గి, క్షమాపణ కోరవలసి రావచ్చు. మీరు సవ్యమైనది అనుకున్నదానికోసం పోరాడవలసి రావచ్చు. మంచి మలుపునకు ఎదురు చూడవలసి రావచ్చు. కొన్నింటిని గౌరవప్రదంగా చేజార్చుకునేందుకు సిద్ధపడవలసి ఉంటుంది. ప్రగతి, సంస్కరణ పేరుతో కొన్ని పాత భావజాలాలను వదులు కోవలసిరావచ్చు. ఒక్కోసారి, మన పూర్వీకుల వివేచనకు, వివేకా నికి తలొగ్గవలసిరావచ్చు. కీలకమైన సందర్భాలలో ఏది సరైన మార్గమో ఎంచుకోవడం ఎలా? ఇక్కడున్న ఇంతమందికి ఎన్ని జీవితమార్గాలని చూపగలను? అయ్యే పని కాదు. మీకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇపుడు మీ కాళ్ళపై మీరు నిలబడ్డారు కనుక దానిని మీకే వదిలివేస్తాను. మన ఆత్మ శక్తి, సహజాత ప్రవృత్తులు, అంతః ప్రేరణలు, కోరికలు, భయాలు, మనకు తగిలిన గాయాలు, మనం కనే కలలే మనల్ని ముందుకు నడిపిస్తాయి.


