రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ తగ్గుతోందా? | Sakshi Guest Column: Is the economic freedom of states decreasing | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ తగ్గుతోందా?

May 25 2026 12:48 AM | Updated on May 25 2026 12:48 AM

Sakshi Guest Column: Is the economic freedom of states decreasing

అభిప్రాయం

భారతదేశంలో రాష్ట్రాలు తమ ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోతున్నాయని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఫెడరల్‌ వ్యవస్థలో అనువైన ఆర్థిక వాతావరణానికి కేంద్రం – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ సంబంధాలు అవసరం. రాజకీయ పునర్వ్యవస్థీ కరణ, ఆర్థిక సంస్కరణలు, న్యాయవ్యవస్థ జోక్యం కారణంగా స్వాతంత్య్రానంతరం  కేంద్రం–రాష్ట్రాల సంబంధాలలో నిరంతరం పరివర్తన జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 268 నుంచి 293 వరకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను వివరిస్తాయి. 

ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో పెట్టుబడులపై నియంత్రణలు తొలగాయి. రాష్ట్రాలకు విస్తృత కార్య నిర్వహణ అవకాశాలు దఖలుపడ్డాయి. కానీ రాష్ట్రాలు రెవెన్యూ బదిలీకి కేంద్రంపై అధికంగా ఆధారపడటం వలన రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి పరిమితంగా ఉంది. పన్ను విధించే అధికారాల విభజన, గ్రాంట్‌– ఇన్‌–ఎయిడ్, రుణసమీకరణ అధికారాలు లాంటివి కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సంబంధాల ముఖ్య లక్షణాలుగా పేర్కొనవచ్చు. మొత్తం మీద ఆదాయంలో సింహభాగం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. జాతీయ సమగ్రతను పెంపొందించడం, అత్యవసర పరిస్థితులను ఎదు ర్కోవడం, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటివాటికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తుంది. అయితే కేంద్రానికి ఉన్న అత్యధిక ఆర్థిక అధికారాల కారణంగా రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి ఇబ్బందులకు లోనవుతోంది. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం రాష్ట్రాలు ఎదురు చూడవలసి వస్తోంది.  

ఈ దుఃస్థితికి కారణాలేంటి?
భారత్‌లో వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు క్షీణించడానికి... ఉద్యోగస్థుల వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు అధికంగా ఉండటం; రాష్ట్రాలకు పన్ను విధించే అధికారాలు పరిమితంగా ఉండటం, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల అమలు కారణాలుగా చెప్పవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రాలు అధిక రెవెన్యూ లోటు, అధిక రుణ–జీఎస్‌డీపీ లాంటి సమస్యలను ఎదుర్కొంటు న్నాయి. అధిక ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి రాష్ట్రాలు సమీకరించిన మొత్తం రుణంలో మార్కెట్‌ రుణాల వాటా 2025–26లో సుమారు 76 శాతంగా ఉండటాన్ని బట్టి రాష్ట్రాల ఆర్థిక స్థితి పటిష్టంగా లేదని తేటతెల్లమవుతున్నది. మార్చి 2026 నాటికి రాష్ట్రాల మొత్తం రుణం, జీఎస్‌డీపీలో 30 శాతం పైగా నమోదయింది. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ రుణాల కారణంగా రాష్ట్రాల వడ్డీ చెల్లింపుల మొత్తం జీడీపీలో 1.5 నుండి 1.9 శాతం మధ్య ఉంది. 

ఆర్‌బీఐ నివేదిక ‘ఏ స్టడీ ఆఫ్‌ బడ్జెట్స్‌ 2025–26’ ప్రకారం అధిక రుణం కల్గిన జాబితాలో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, తదుపరి స్థానాలలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిలిచాయి. అధిక వ్యయం,సంక్షేమ కార్యక్రమాల అమలు కారణంగా రాష్ట్రాల మొత్తం రుణంలో దక్షిణాది రాష్ట్రాల వాటా అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. రుణ – జీఎస్‌డీపీ నిష్పత్తి అధికంగా పంజాబ్‌లో నమోదు కాగా, తర్వాతి స్థానాలలో పశ్చిమ బెంగాల్, కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌ నిలిచాయి. ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాలు తక్కువ రుణ ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నాయి.

కొరవడిన ఆర్థిక స్వేచ్ఛ
వివిధ రాష్ట్రాలలో రెవెన్యూ రాబడి తక్కువగా ఉండటానికి అల్ప పారిశ్రామిక లేదా ఆర్థిక కార్యకలాపాలు, పన్ను వసూళ్ళు బలహీనంగా ఉండటం, కేంద్ర ప్రభుత్వ నిధుల బదిలీలు, గ్రాంట్లపై రాష్ట్రాలు అధికంగా ఆధారపడటం కారణాలుగా నిలిచాయి. వస్తు, సేవల పన్ను వసూళ్ళు పటిష్టంగా ఉండటం, పారిశ్రామిక, సేవా రంగ కార్యకలాపాలు అధికంగా ఉండటం కారణంగా సొంత పన్ను రాబడిలో పెరుగుదల మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, తెలంగాణల్లో అధికంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధుల బదిలీలపై బిహార్‌ అధికంగా ఆధారపడింది.

రాష్ట్రాలు పన్నేతర రాబడి పెంచుకోవడంలోనూ పరిమితులను ఎదుర్కొంటున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఉత్తర ప్రదేశ్, మహరాష్ట్ర, గుజరాత్‌లలో కేంద్ర ప్రభుత్వ వ్యయం అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. అంటే ఆ యా రాష్ట్రాలకు కేంద్ర నిధులను అధికంగా ఇస్తోందన్నమాట. కేంద్ర ప్రభుత్వ వ్యయ అసమతౌల్యం వలన అనేక రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి తగ్గి, రాష్ట్రాల మధ్య సంక్షేమ కార్యక్రమాల అమలులో అసమానతలు ఏర్పడుతున్నాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థిక సమాఖ్య వ్యవస్థ (ఫిస్కల్‌ ఫెడరలిజం) పాత్ర ప్రధానమైనది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పన్ను వసూళ్ళు, ఆదాయ వ్యయం వంటి విషయాల్లో అధికారాల విభజనకు సంబంధించిన చట్రమే (ఫ్రేమ్‌వర్క్‌) ఫిస్కల్‌ ఫెడరలిజం. అభివృద్ధి, పాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. జీఎస్‌టీ పరిహార చెల్లింపులో ఆలస్యం, సెస్‌లు, సర్‌ఛార్జీల ద్వారా లభ్యమయ్యే ఆదా యాన్ని కేంద్రం, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేకపోవటం లాంటి అంశాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రాలు సమీకరించే రుణానికి సంబంధించిన పరిమితులు కూడా ఆర్థికా భివృద్ధి సాధనకు అవరోధంగా ఉందని అనేక రాష్ట్రాలు వాదిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజాస్వామ్య జవాబుదారీ తనానికి రాష్టాలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం.

మరేం చెయ్యాలి?
పరిస్థితుల్లో మార్పు రావాలంటే  కొన్ని చర్యలు తీసుకోవాలి. కేంద్రం దేశ పాలన, అభివృద్ధి వంటి అంశాలలో రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా పరిగణించాలి. మారుతున్న ఆర్థిక వాతావరణానికి అనుగుణంగా భారత సమాఖ్య వ్యవస్థలో మార్పు అవసరం. ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యమవ్వాలంటే పోటీతత్వ సమాఖ్య వ్యవస్థకు సహకార సమాఖ్య వ్యవస్థ కూడా తోడుగా ఉండాలి. సహకార సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించడం, స్థానిక సంస్థలలో సాధికారత, అంతర్‌ రాష్ట్ర కౌన్సిల్స్‌ ఏర్పాటు, ఆర్థిక యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, జీఎస్టీ మండలి పనితీరులో అవసరమైన సంస్కరణలను చేపట్టడం లాంటి చర్యలు కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలను పటిష్టపరచడానికి ఉపకరిస్తాయి. 

వివిధ రాష్ట్రాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను డిజైన్‌ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపర చాలంటే స్థానిక సంస్థలకు అధిక నిధుల కేటాయింపు అవసరం. ఆర్టికల్స్‌ 256, 257లను పునఃసమీక్ష చేయడం ద్వారా రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం పెత్తనాన్ని తగ్గిస్తూ, జాతీయ భద్ర తకు సంబంధించి మాత్రమే ఆ యా ఆర్టికల్స్‌ను కేంద్రం ఉప యోగించుకొనే విధంగా చూడాలి. రాష్ట్రాలకు షరతులు లేని నిధుల కేటాయింపు పెంచడం, జీఎస్టీ పరిహారాన్ని సకాలంలో అందించడం, సెస్‌లు, సర్‌చార్జీలలో రాష్ట్రాలకు వాటా, ఆర్థిక సంఘం సిఫార్సులను సమర్థవంతంగా అమలు చేయడం లాంటి చర్యలు సమాఖ్య వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి.

డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త వైస్‌ ఛాన్స్‌లర్‌ (ఇంచార్జి), ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, హైదరాబాద్‌ 

Advertisement
 
Advertisement
Advertisement