breaking news
tamma kotireddy
-
ప్రణాళికలు.. ప్రగతికి సోపానాలు..
భారత్‌లో ఇప్పటి వరకు అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం ఆర్థికాభివృద్ధి సాధన. ప్రణాళికా డాక్యుమెంట్ల ఆధారంగా ఆర్థిక ప్రణాళికల ఇతర లక్ష్యాలు.. స్వయం సమృద్ధి; నిరుద్యోగ నిర్మూలన; ఆదాయ అసమానతల తగ్గింపు; పేదరిక నిర్మూలన; ఆధునికీకరణ; సమ్మిళిత, సుస్థిర వృద్ధి. ఉత్పత్తి కార్యకలాపాలను ఒక కేంద్ర ఆర్థిక సంస్థ నడపటాన్ని ప్రణాళిక అని హెయక్(Hayek) అభిప్రాయపడ్డారు. 1929లో సంభవించిన ఆర్థికమాంద్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. అప్పటికే పంచవర్ష ప్రణాళికలు అమల్లో ఉన్న రష్యా మాత్రమే ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురికాలేదు. ఈ క్రమంలో ప్రణాళికల అమలు ఆవశ్యకతను ప్రపంచ దేశాలు గుర్తించాయి. రష్యా సాధించిన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక ప్రగతిని భారత్ అర్థం చేసుకుంది. దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం ప్రణాళికల కోసం కొంత కృషి జరిగింది. ప్రణాళికా సంఘం: స్వాతంత్య్రానంతరం 1950, మార్చి 15న కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా ప్రణాళికా రచనకు ప్రణాళికా సంఘం ఏర్పడింది. ప్రణాళికా సంఘాన్ని రాజ్యాంగేతర, శాసనేతర సంస్థగా భావించవచ్చు. ఆదేశికసూత్రాల్లోని 39వ నిబంధనకు అనుగుణంగా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1952, ఆగస్టు 6న కేంద్ర కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా జాతీయాభివృద్ధి మండలి ఏర్పాటైంది. ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను జాతీయాభివృద్ధి మండలి పరిశీలించి, ఆమోదం తెలిపిన తర్వాతే ప్రణాళిక అమలవుతుంది. జాతీయాభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 1967లో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సు మేరకు జాతీయాభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించారు. ఈ మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘ సభ్యులు, ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రులు, కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. సంస్కరణల యుగంలోని తొలి ప్రణాళిక ఎనిమిదో ప్రణాళిక. ఇందులో ప్రణాళికా స్వభావాన్ని సూచనాత్మక ప్రణాళికగా పేర్కొన్నారు. ప్రభుత్వం స్థూల అంశాలను నిర్ణయించి, వాటిని సాధించేందుకు ప్రైవేటు రంగానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం సూచనాత్మక ప్రణాళికలోని ముఖ్యాంశం. ప్రజల భాగస్వామ్యం ఆధారంగా ప్రణాళికలను కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళికలుగా వర్గీకరించవచ్చు. వనరుల కేటాయింపు ఆధారంగా భౌతిక, విత్త ప్రణాళికలుగాను, కాలం ఆధారంగా దీర్ఘదర్శి, స్వల్ప, మధ్యకాలిక ప్రణాళికలుగా వర్గీకరించవచ్చు. ఇప్పటి వరకు భారత్‌లో 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తికాగా, ప్రస్తుతం 12వ ప్రణాళిక అమల్లో ఉంది. ఆర్థిక ప్రణాళికల లక్ష్యాలు: భారత్‌లో ఇప్పటి వరకు అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం ఆర్థికాభివృద్ధి సాధన. ప్రణాళికా డాక్యుమెంట్ల ఆధారంగా ఆర్థిక ప్రణాళికల ఇతర లక్ష్యాలు.. స్వయం సమృద్ధి; నిరుద్యోగ నిర్మూలన; ఆదాయ అసమానతల తగ్గింపు; పేదరిక నిర్మూలన; ఆధునికీకరణ; సమ్మిళిత, సుస్థిర వృద్ధి. నూతన అభివృద్ధి వ్యూహం: 1980వ దశకంలో భారత్‌లో జాతీయాభివృద్ధి సగటు 5.5 శాతంగా నమోదైంది. ఈ దశకంలో ఆర్థికవృద్ధి రేటు పెరుగుదలకు అవలంబించిన వ్యూహం భారత్‌ను సంక్షోభంలోకి నెట్టేసింది. 1990-91లో ప్రారంభమైన సంక్షోభం 91-92లో తీవ్రమైంది. ఈ కాలంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం తలెత్తింది. 1990-91లో ప్రారంభమైన ద్రవ్యోల్బణం తీవ్రమై 1991 ఆగస్టు నాటికి 16.7 శాతానికి చేరింది. సంక్షోభ సమయంలో వాస్తవిక స్థూలదేశీయోత్పత్తి వృద్ధి రేటు తగ్గింది. ఈ ఆటుపోట్లను అధిగమించేందుకు 1991 జులైలో 18 శాతం మేర రూపాయి మూల్యన్యూనీకరణతో పాటు 600 మిలియన్ డాలర్ల రుణం కోసం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో బంగారం తాకట్టు పెట్టడం వంటి విధానాలను భారత్ అవలంబించింది. ఈ క్రమంలో భారత్.. సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా నూతన అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఇందులోని ముఖ్య విధానాలు.. విత్త స్థితిని చక్కదిద్దడం ద్వారా స్థూల ఆర్థిక స్థిరీకరణ. ఎగుమతుల వృద్ధి పెంపునకు వాణిజ్య విధానంలో సంస్కరణలు. పరిశ్రమల పోటీతత్వాన్ని పెంపొందించేందుకు పారిశ్రామిక విధాన సంస్కరణలు. ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు. 11వ ప్రణాళిక అభివృద్ది వ్యూహం: పదకొండో ప్రణాళిక.. సమ్మిళిత, సత్వర వృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. పటిష్ట స్థూల ఆర్థిక విధానాల ఆధారంగా అభివృద్ధి వ్యూహానికి రూపకల్పన చేశారు. ఇందులోని లక్ష్యాలు.. సాంవత్సరిక వృద్ధి 9 శాతం సాధించడం ద్వారా పేదరికం తగ్గింపుతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడం. పేదలకు ఆరోగ్యం, విద్య వంటి ముఖ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. విద్య, శిక్షణా నైపుణ్యం పెంపు ద్వారా సాధికారత. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు. పర్యావరణ సుస్థిరత. మహిళా ఏజెన్సీల గుర్తింపు. సుపరిపాలన. 11వ ప్రణాళికలో వివిధ రంగాల్లో వృద్ధి: ఈ ప్రణాళిక మొత్తం ప్రభుత్వ రంగ కేటాయింపు 2006-07 ధరల్లో రూ. 36,44,718 కోట్లు. దీంట్లో కేంద్రం వాటా రూ. 21,56,571 కోట్లు కాగా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా రూ. 12,13,608 కోట్లు. వనరుల కేటాయింపులో సాంఘిక రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. తర్వాతి స్థానాల్లో శక్తి, రవాణా, సమాచార రంగాలు నిలిచాయి. విద్యపై ఎక్కువ మొత్తం వెచ్చించడం వల్ల ఈ ప్రణాళికను విద్యాప్రణాళికగా వర్ణించారు. ఈ ప్రణాళికలో జీడీపీ వృద్ధి రేటు 7.9 శాతంగా నమోదైంది. రంగాల వారీగా వృద్ధిరేటును పరిశీలిస్తే రవాణా, నిల్వ, సమాచార రంగాల్లో అధిక వృద్ధి నమోదైంది. వ్యవసాయం, అడవులు, మత్స్య రంగాలు 3.6 శాతం వృద్ధిని సాధించాయి. నీటిపారుదల రంగానికి వనరుల పంపిణీ సరిగా లేకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో అనుకున్న లక్ష్యం (4 శాతం) సాధించలేదు. ప్రణాళికలో పెట్టుబడి రేటు స్థూల దేశీయోత్పత్తిలో 37.6 శాతం కాగా, ఈ మొత్తంలో స్థిర పెట్టుబడి రేటు 32.9 శాతం. 12వ ప్రణాళిక 2012, ఏప్రిల్ 1 నుంచి 2017, మార్చి 31 కాలానికి ప్రణాళికా సంఘం 12వ పంచవర్ష ప్రణాళికను రూపొందించింది. వేగవంతమైన, సుస్థిరమైన, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి ఈ ప్రణాళిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని ఎనిమిది శాతంగా నిర్దేశించారు. మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడి రూ.80,50,123 కోట్లు కాగా ఇందులో కేంద్రం వాటా రూ.43,33,739 కోట్లు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వాటా రూ.37,16,385 కోట్లు. ప్రజల ఆర్థిక, సాంఘిక పరిస్థితులు మెరుగుపడాలంటే ఆర్థిక జీడీపీ వృద్ధిరేటు సాధించాల్సిన అవసరముందన్నది ప్రణాళికా సంఘ సభ్యుల అభిప్రాయం. ‘‘అధిక వృద్ధి ద్వారా అధిక రాబడి వస్తుంది. దీనివల్ల సమ్మిళిత వృద్ధి సాధనకు ఉపాధి హామీ పథకం, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, సమీకృత శిశు అభివృద్ధి సేవలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయొచ్చు’’ అని ప్రణాళికా రచయితలు భావించారు. 12వ ప్రణాళికలో వివిధ రంగాల వృద్ధిరేటు లక్ష్యాలను పరిశీలిస్తే.. వ్యవసాయ రంగం- 4 శాతం, పారిశ్రామిక రంగం-8.1 శాతం, సేవా రంగంలో 9.1 శాతం. 2004-05 ధరల వద్ద పెట్టుబడి రేటు లక్ష్యాన్ని జీడీపీలో 39.3 శాతంగా నిర్ణయించగా, ఇందులో స్థిర పెట్టుబడి రేటు 34 శాతం. ప్రస్తుత ధరల వద్ద పొదుపు రేటు లక్ష్యాన్ని జీడీపీలో 34.2 శాతంగా నిర్ణయించారు. ప్రణాళికా కాలంలో శ్రామిక శక్తికి అదనంగా 2.40 కోట్లు మంది తోడుకాగలరని అంచనా. ప్రభుత్వ రంగ పెట్టుబడిలో సాంఘిక సేవలు అధిక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తం పెట్టుబడిలో వీటి వాటా 34.7 శాతం. శక్తి రంగం 18.8 శాతం, రవాణా 15.7 శాతం, గ్రామీణాభివృద్ధి ఆరు శాతం, నీటిపారుదల-వరదల నివారణ 5.5 శాతం, పరిశ్రమలు, ఖనిజాలు 4.9 శాతం పొందాయి. 12వ ప్రణాళికలో రూ.36 లక్షల కోట్ల మేర రుణం సేకరించడం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని ప్రణాళిక రచయితలు భావించారు. లక్ష్యాలు: 12వ పంచవర్ష ప్రణాళికలో 25 లక్ష్యాలను పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, అవస్థాపనా సదుపాయాలు, పర్యావరణం-సుస్థిరత, పేదరికం-ఉద్యోగిత అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్ణయించారు. అవి.. వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 8 శాతం. వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం. తయారీ రంగ వృద్ధి రేటు 10 శాతం. తలల లెక్కింపు నిష్పత్తి ఆధారంగా పేదరిక శాతాన్ని 10 శాతం పాయింట్లు తగ్గించాలి. వ్యవసాయేతర రంగంలో అయిదు కోట్ల కొత్త ఉపాధి అవకాశాలు. శిశు మరణాల రేటును 25కు (ప్రతి వెయ్యి జననాలకు), ప్రసూతి మరణాలను 1కి (ప్రతి వెయ్యి జననాలకు) తగ్గించాలి. ప్రణాళిక చివరి నాటికి అవస్థాపనా సౌకర్యాలపై పెట్టుబడిని జీడీపీలో తొమ్మిది శాతానికి పెంచాలి. ప్రణాళిక చివరి నాటికి స్థూల నీటిపారుదల గల భూమిని 90 మిలియన్ హెక్టార్ల నుంచి 103 మిలియన్ హెక్టార్లకు పెంచాలి. ప్రణాళికా కాలంలో ఏడాదిలో ఒక మిలియన్ హెక్టార్లలో చెట్లు నాటాలి. ప్రణాళిక చివరి నాటికి 90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందించాలి. 11వ ప్రణాళికలో సాధించిన వృద్ధి కంటే 12వ ప్రణాళికలో రాష్ట్రాలు అధిక వృద్ధిని సాధించాలి. ఉన్నత విద్యలో అదనంగా 20 లక్షల సీట్లు పెంచాలి. పాఠశాలలో లింగ వ్యత్యాసాన్ని, సాంఘిక వ్యత్యాసాన్ని నిర్మూలించాలి. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 0-3 ఏళ్లు మధ్యగల పిల్లల సంఖ్యను ప్రస్తుత స్థాయి నుంచి సగానికి తగ్గించాలి. అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి. ప్రణాళిక పూర్తయ్యేనాటికి అన్ని గ్రామాలను ఏ సీజన్లోనైనా బాగుండే (All Weather Roads) రహదారులతో అనుసంధానించాలి. టెలీ సాంద్రతను 70 శాతానికి పెంచాలి. 50 శాతం గ్రామపంచాయతీలు నిర్మల్ గ్రామ హోదాను పొందేలా చేయాలి. ప్రణాళిక ముగిసేనాటికి సబ్సిడీలు, ఇతర సంక్షేమ చెల్లింపులు ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల ద్వారా జరిగేలా చూడాలి. పునరావృత విద్యుత్ సామర్థ్యాన్ని అదనంగా 30 వేల మెగావాట్లు పెంచాలి. 2020 నాటికి వాతావరణ కలుషితాలను 20 శాతం-25 శాతం మేర తగ్గించాలి (2005 స్థాయితో పోల్చితే). ప్రణాళికాంతానికి జాతీయ, రాష్ట్ర రహదారులను కనీసం రెండు రోడ్ల రహదారులుగా మార్చాలి. ప్రణాళిక చివరి నాటికి తూర్పు, పశ్చిమ సరకు రవాణా కారిడార్లను పూర్తిచేయాలి. డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. -
వినోదం పన్ను దేనికి ఉదాహరణ?
కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడిని మూడు కేటగిరీలుగా విభజించవచ్చు. 1. Currency, Coinage and Mint: కరెన్సీ నోట్ ప్రెస్, సెక్యూరిటీ పేపర్ మి ల్లు, బ్యాంక్ నోట్ ప్రెస్, మింట్ (Mints), చిన్న నాణేల పంపిణీ ద్వారా వచ్చే లాభం ఈ కేటగిరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడిగా ఉంటుంది. 2. వడ్డీ రాబడులు, డివిడెండ్లు, లాభాలు: ప్రభుత్వం ఇతరులకిచ్చిన రుణాలపై వడ్డీతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్లు, లాభాలు ఈ కేటగిరీలో ఉంటాయి. ఉదా: రైల్వేలు, పోస్టల్, కమ్యూనికేషన్ల నుంచి వచ్చే ఆదాయం తోపాటు రిజర్వ బ్యాంక్ మిగులు లాభాలు. ప్రభుత్వం సృష్టించిన ద్రవ్యం నుంచి లభించే ఆదాయం, లాభం కూడా ఇందులోనే వస్తాయి. 3. పన్నేతర రాబడులు: ప్రభుత్వ పరిపాలనా సంబంధమైన సర్వీసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్, జైళ్లు, వ్యవసాయం, దాని అనుబంధ సేవలు, పరిశ్రమలు, ఖనిజాలు, నీరు, విద్యుత్ అభివృద్ధి సర్వీసులు, రవాణా, పబ్లిక్ వర్క్స, విద్య, గృహ నిర్మాణం, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ, బ్రాడ్‌కాస్టింగ్, గ్రాంట్-ఇన్ - ఎయిడ్ కంట్రిబ్యుషన్స ఈ కేటగిరీలోకి వస్తాయి. పన్నేతర రాబడిలో ఆరు ముఖ్య గ్రూపుల రాబడి కలిసి ఉంటుంది. 1. Fiscal Services (విత్త సర్వీసులు) 2. వడ్డీ రాబడులు 3. డివిడెండ్లు, లాభాలు 4. సాధారణ సేవలు 5. సాంఘిక సేవలు 6. ఆర్థిక సేవలు కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడి 1950- 51లో రూ. 48.86 కోట్లు. కాగా 2014-15 బడ్జెట్లో రూ. 2,12,504.61 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ మొత్తంలో డివిడెండ్లు, లాభాల వాటా అధికం. తర్వాత ఆర్థిక సేవల ద్వారా వచ్చే రాబడి ఎక్కువ అని తేల్చారు. రెవెన్యూ వ్యయం ప్రస్తుత పన్ను రాబడి ద్వారా వ్యయం చేయగలిగే రెవెన్యూ వ్యయంలో పెరుగుదల 1950-51 తర్వాత ఎక్కువగా ఉంది. 1987-88కి ముందు కాలంలో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయాన్ని... ఎ. సివిల్ వ్యయం (సాధారణ సర్వీసులు, సాంఘిక, కమ్యూనిటీ సర్వీసులు, ఆర్థిక సర్వీసులపై వ్యయం) బి. రక్షణ వ్యయం సి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ - ఇన్- ఎయిడ్ అని మూడు రకాలుగా విభజించారు. కేంద్ర ప్రభుత్వం తన వ్యయాన్ని అభివృద్ధి వ్యయం, రక్షణ వ్యయం, ఇతర వ్యయం అని కూడా వర్గీకరించింది. 1987-88 బడ్జెట్ నుంచి కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ వ్యయాన్ని ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం అని రెండు రకాలుగా విభజించింది. 1950-51లో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం రూ. 530 కోట్లు కాగా ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం రూ. 350 కోట్లు. రెవెన్యూ వ్యయం 2013-14 బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం రూ. 13,99,540 కోట్లకు పెరిగింది. 2014-15 బడ్జెట్లో ఈ వ్యయాన్ని రూ. 15,68,112 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ మొత్తంలో ప్రణాళికేతర రెవెన్యూ వ్యయం రూ. 11,14,609 కోట్లు కాగా ప్రణాళికా రెవెన్యూ వ్య యం రూ.4,53,503 కోట్లు. ఇటీవల రెవెన్యూ వ్యయంలో పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇందుకు ప్రధాన కారణాలు 1. గత ఏడాదిలో తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపు. 2. సబ్సిడీలపై వ్యయం పెరుగుదల. 3. ఎగుమతులపై వ్యయంతోపాటు విదేశీ వ్యవహారాలపై వ్యయం పెరగడం. 4. రక్షణ రంగంపై, పౌర పాలనపై ఖర్చు పెరగడం. 5. వస్తు, సేవల వినియోగంపై ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల. 6. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్ - ఇన్ - ఎయిడ్ పెరగడం. 7. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఇతర సాంఘిక సేవలు, శాస్త్ర పరిశోధనలపై వ్యయం పెంచడం. 1950-51లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయం రూ.350 కోట్లు మాత్రమే. భారత్‌లో పన్ను - జీడీపీ నిష్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ప్రత్యక్ష పన్ను రేట్లు పెంచడం, కొత్త పన్నులు విధించడం ద్వారా రెవెన్యూ రాబడిని పెంచుకోవాలి. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వానికి రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. పెరుగుతున్న రెవెన్యూ వ్యయాన్ని క్రమబద్ధీకరించాలంటే ... ఎ. అనుత్పాదక రంగాలపై వ్యయాన్ని తగ్గించాలి. బి. రక్షణ రంగంపై వ్యయాన్ని rationalise చేయాలి. సి. {పభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో విద్య, ఆరోగ్య రంగ ప్రాజెక్టులను అనుమతించాలి. డి. {పభుత్వ కార్యకలాపాల పరిధి తగ్గించాలి. ఇ. {పభుత్వం సబ్సిడీ వ్యయాన్ని Rationalise చేయాలి. మాదిరి ప్రశ్నలు 1. {పభుత్వం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టినప్పుడు దానివల్ల ప్రయోజనం పొందేవారి నుంచి దశలవారీగా వసూలు చేసేది? ఎ) టోల్ ట్యాక్స్ బి) సంపద పన్ను సి) ఎస్టేట్స్ డి) ఎస్టేట్ డ్యూటీ 2. మొత్తం ప్రభుత్వ వ్యయం నుంచి రుణేతర వసూళ్లను తీసివేస్తే వచ్చేది? ఎ) రెవెన్యూ లోటు బి) రెవెన్యూ మిగులు సి) విత్త లోటు డి) ప్రాథమిక లోటు 3. విత్తలోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసి వేస్తే వచ్చేది? ఎ) కోశ లోటు బి) ఆర్థిక లోటు సి) రెవెన్యూ లోటు డి) ప్రాథమిక లోటు 4. దేశీయ కంపెనీలకు, విదేశీ కంపెనీలకు పన్నురేట్లలో తేడా పదిశాతం మించకూడ దని సిఫార్సు చేసింది? ఎ) విజయ్‌కేల్కర్ బి) రాజా చెల్లయ్య సి) నరసింహం డి) కె.ఎల్.రేఖీ 5. పరోక్ష పన్నులపై సిఫార్సు చేయడానికి ఆర్థిక శాఖ కె.ఎల్.రేఖీ అధ్యక్షతన కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఎ) 1992 మే బి) 1992 జూలై సి) 1993 మే డి) 1994 జూలై 6. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఎ) 1994 జూలై 1 బి) 1995 జూలై 1 సి) 1996 జూలై 1 డి) 1997 జూలై 1 7. కేంద్ర ప్రభుత్వం ‘కర్ వివాద సమాధాన్’ పథకాన్ని ఎప్పుడు ప్రకటించింది? ఎ) 1998 ఆగస్టు 31 బి) 1999 ఆగస్టు 31 సి) 2000 ఆగస్టు 31 డి) 2001 ఆగస్టు 31 8. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నెలసరి ఆదాయ ఖాతా, పోస్టాఫీస్ పొదుపు ఖాతా లాంటి డిపాజిట్ స్కీములపై సేవింగ్ పరిమితిని పెంచమని సిఫార్సు చేసిన కమిటీ? ఎ) రంగరాజన్ కమిటీ బి) గుప్తా కమిటీ సి) వై.వి. రెడ్డి కమిటీ డి) కేల్కర్ కమిటీ 9. 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులు? ఎ) విజయ్ కేల్కర్ బి) నరసింహం సి) వై.వి. రెడ్డి డి) కె.ఎల్. రేఖీ 10. ఉత్పత్తి దశలో, పంపిణీలో వస్తువులకు జతచేరే విలువపై పన్నును ఏవిధంగా వ్యవహరిస్తారు? ఎ) విలువ ఆధారిత పన్ను బి) సేవలపై పన్ను సి) సంపద పన్ను డి) కేంద్ర అమ్మకం పన్ను 11. తనకు లభించిన ప్రయోజనంతో సం బంధం లేకుండా ప్రజలందరి ఉపయోగం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు, సంస్థలు చేసే నిర్బంధ చెల్లింపులే పన్ను అని పేర్కొన్నది? ఎ) మార్షల్ బి) సెలిగ్మన్ సి) పిగు డి) రాబర్‌టసన్ 12. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి అందించే ద్రవ్య సహాయాన్ని ఏమంటారు? ఎ) రుణం బి) అభివృద్ధి పన్ను సి) గ్రాంట్లు డి) ప్రత్యేక విధింపు 13. చెల్లింపు సామర్థ్యం ఆధారంగా విధించే పన్ను విధానం? ఎ) పురోగామి బి) తిరోగామి సి) అనుపాత డి) పైవేవీకాదు 14. వినోదం పన్ను దేనికి ఉదాహరణ? ఎ) శాశ్వత పన్ను బి) తాత్కాలిక పన్ను సి) నిర్దిష్ట పన్ను డి) బహుమతి పన్ను 15. లాఫర్ వక్రరేఖ వేటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది? ఎ) రెవెన్యూ లోటు, రెవెన్యూ మిగులు బి) పన్ను రేటు, పన్ను రాబడి సి) నిరుద్యోగం, పేదరికం డి) పేదరికం, ద్రవ్యోల్బణం 16. వ్యయంపై పన్నును ఏ కమిటీ సిఫార్సులపై ప్రవేశపెట్టారు? ఎ) విజయ్ కేల్కర్ బి) రాజా చెల్లయ్య సి) కాల్డర్ డి) పిగు 17. అంతర్జాతీయ లావాదేవీలన్నింటిపైనా ప న్ను విధిస్తే ఆ దేశానికి పన్ను పెరుగుతుంది అనే భావనకు సంబంధించింది? ఎ) టోబిన్ ట్యాక్స్ బి) సంభావనా పన్ను సి) నగదు బదిలీ పన్ను డి) సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను 18. విలువ ఆధారిత పన్నును సూచించిన వారు? ఎ) శామ్యూల్సన్ బి) లియాంటిఫ్ సి) పాల్క్రూగ్మన్ డి) వాన్సెమన్స 19. రాష్ట్ర ప్రభుత్వాల పన్ను రాబడిలో అధిక వాటా కలిగింది? ఎ) రాష్ట్ర సొంత పన్నుల రాబడి బి) రాష్ట్ర సొంత పన్నేతర రాబడి సి) కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు డి) వృత్తి పన్ను 20. {పణాళికలో ప్రస్తావించని అంశాలపై చేసే వ్యయం ఎ) ప్రణాళికా వ్యయం బి) ప్రణాళికేతర వ్యయం సి) రెవెన్యూ వ్యయం డి) మూలధన వ్యయం 21. {పణాళికేతర మూలధన వ్యయానికి ఉదా హరణ? ఎ) ప్రభుత్వరంగ సంస్థలకు రుణాలు బి) పింఛన్లు సి) సబ్సిడీలు డి) విదేశాలకు ఇచ్చే గ్రాంట్లు 22. నూతన ఆస్తుల సృష్టి కోసం జరిగే వ్యయం? ఎ) రెవెన్యూ వ్యయం బి) మూలధన వ్యయం సి) సాధారణ పరిపాలనా వ్యయం డి) పైవేవీ కావు సమాధానాలు 1) ఎ; 2) సి; 3) డి; 4) బి; 5) ఎ; 6) డి; 7) ఎ; 8) బి; 9) సి; 10) ఎ; 11) బి; 12) సి; 13) ఎ; 14) సి; 15) బి; 16) సి; 17) ఎ; 18) డి; 19) ఎ; 20) బి; 21) ఎ; 22) బి. -
రైతుల కోసం ప్రారంభించనున్న టీవీ చానల్?
ప్రభుత్వ వ్యయ నియమాలు - వర్గీకరణ అవస్థాపనా సౌకర్యాలైన రవాణా, సమాచారం, నౌకాశ్రయాలు, ఇంజనీరింగ్ పరిశ్రమలు, విద్యుత్, రోడ్ల అభివృద్ధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత పెంపునకు ఈ రంగాల అభివృద్ధి తప్పనిసరి. ఆయా రంగాలపై పెట్టుబడులు మార్కెట్ పరిధిని విస్తృత పర్చడానికి, శ్రామిక ఉత్పాదకత పెంపునకు, ఉత్పత్తి వ్యయాల తగ్గుదలకు దోహదపడతాయి. కోశ విధాన సాధనమైన ప్రభుత్వ వ్యయం అనే అంశం ఆర్థికాభివృద్ధి లక్ష్యసాధనకు అవసరమైన ఓవర్‌హెడ్ క్యాపిటల్ అందిస్తుంది. ప్రభుత్వ వ్యయం రెండు రకాలు: * నీటిపారుదల, రోడ్లు లాంటి ప్రాజెక్టులపై ప్రత్యక్ష పెట్టుబడి * కొన్ని వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గ్రాంట్లు, సబ్సిడీలను అందించడం. ఈ రెండు విధాలైన ప్రభుత్వ వ్యయం గ్రామీణ రంగంలో ఆర్థికవృద్ధిని పెంపొందించడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని మిసెస్ హిక్స్ ప్రభుత్వ వ్యయాన్ని కింది విధంగా వర్గీకరించారు. * రక్షణ వ్యయం: డిఫెన్స (రక్షణ) పరికరాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స సిబ్బంది వేతనాలు ఈ వ్యయంలో భాగం. విదేశీ దురాక్రమణల నుంచి దేశంలోని పౌరులకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ఈ వ్యయం చేస్తుంది. సివిల్ వ్యయం: దేశంలో శాంతిభద్రతలు కాపాడటం, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్‌కు సంబంధించి ప్రభుత్వ వ్యయం. అభివృద్ధి వ్యయం: వ్యవసాయం, పారిశ్రామిక రంగం, వాణిజ్యం, రవాణా, సమాచార రంగాలపై వ్యయం. అన్ని రకాల ప్రభుత్వ వ్యయం ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనమా? ప్రభుత్వ వ్యయాన్ని సక్రమంగా వినియోగిస్తే ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ వ్యయానికి కింది లక్షణాలు ఉండాలి. * ఉత్పాదకతను కలిగి అభివృద్ధి నిమిత్తం వినియోగించాలి. * ప్రభుత్వ వ్యయానికి సంబంధిత అథారిటీ అనుమతి తప్పనిసరి. * నిర్దేశిత ద్రవ్యాన్ని సక్రమంగా వినియోగించారో లేదో తెలుసుకోవడానికి ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలి. * అందరికీ ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు ప్రభుత్వం వ్యయం చేయాలి. * ఆర్థిక వ్యవస్థలో సరళత్వాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ వ్యయ విధానంలో మార్పులను సూచించే విధంగా ఉండాలి. ఆధునిక ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ వ్యయం పాత్ర ప్రధానమైంది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి స్థిరత్వం సాధించడానికి ఇది ఉపకరిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధనకు కింది విధంగా దోహదపడుతుంది. * వేగవంతమైన ఆర్థికాభివృద్ధి * వాణిజ్యం, వ్యాపారాన్ని ప్రోత్సహించడం * గ్రామీణాభివృద్ధి * ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి * వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి * రోడ్లు, రైల్వే, శక్తిలాంటి అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి * బొగ్గు, చమురు ఖనిజ వనరుల వెలికితీత, అభివృద్ధి. * పూర్తి స్థాయి ఉద్యోగిత ద్వారా ధరల స్థిరత్వం సాధించటం * ఆదాయ పంపిణీలో సమానత * ప్రజాశ్రేయస్సుకు ప్రాధాన్యమివ్వడం. ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కారణాలు * ప్రణాళికా యుగంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వ్యయం గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యయం సుమారు పదిరెట్లైంది. 1990-91లో ఇది రూ. 98,272 కోట్లు కాగా, 2012-13లో రూ. 14,10,372 కోట్లకు చేరింది. 2014-15 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని రూ. 17,94,892 కోట్లుగా ప్రతిపాదించారు. * జనాభావృద్ధి అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు తమ విధులను విస్తృత పర్చాలి. దాంతో విద్య, ఆరోగ్యం, సబ్సిడీలు, సాంఘిక భద్రత, అవస్థాపనా సౌకర్యాలపై ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. * స్వాతంత్య్రానంతరం రక్షణ రంగ వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. దీని కారణంగా విదేశాల నుంచి ఎదురయ్యే సమస్యలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో సాంఘిక, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి అనువైన వాతావరణం ఏర్పడింది. 1990-91లో రక్షణ వ్యయం రూ. 10,874 కోట్ల నుంచి 2012-13లో రూ. 1,81,776 కోట్లకు పెరిగింది. 2014-15 బడ్జెట్లో రక్షణ రంగ వ్యయాన్ని రూ. 2,29,000 కోట్లుగా ప్రతిపాదించారు. * స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ రాబడికంటే వ్యయం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి రుణభారం పెరిగింది. తద్వారా వడ్డీ చెల్లింపులు అధికమయ్యాయి. అనేక ప్రభుత్వ కార్యకలాపాలకయ్యే వ్యయంలో పెరుగుదల కారణంగా ప్రభుత్వం స్వదేశీ మార్కెట్ నుంచి, బహిర్గత ఆధారాల ద్వారా రుణాన్ని సమీకరించింది. ఈ క్రమంలో 1990-91లో కేంద్ర ప్రభుత్వ వడ్డీ చెల్లింపుల వ్యయం రూ.21,498 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం క్రమంగా పెరుగుతూ 2012-13లో రూ.3,13,170 కోట్లకు చేరుకుంది. 2014-15 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లింపులపై వ్యయాన్ని రూ. 4,27,011 కోట్లుగా ప్రతిపాదించింది. * కేంద్ర ప్రభుత్వం ఆహారం, ఎరువులు, ఇంధనం, విద్యా రంగాలకు సంబంధించి అనేక విధాలైన సబ్సిడీలనందిస్తోంది. అధిక సబ్సిడీ వ్యయం కారణంగా ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. 1990-91లో సబ్సిడీలపై వ్యయం రూ. 9581 కోట్లు కాగా 2012-13లో రూ. 2,57,079 కోట్లకు చేరింది. 2014-15 బడ్జెట్లో సబ్సిడీలపై వ్యయాన్ని రూ. 2,60,658 కోట్లుగా ప్రతిపాదించారు. * పెరుగుతున్న జనాభా, ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో సాధారణ పరిపాలనపై కేంద్ర ప్రభుత్వ వ్యయం అధికమైంది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్‌పై ఎక్కువగా వ్యయం చేయాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వం వేతన స్కేళ్లను సవరించడం, ప్రభుత్వ వస్తు, సేవల ఉత్పత్తికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడం కారణంగా ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడుతోంది. * ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే క్రమంలో ఆధునిక ప్రభుత్వాలు ప్రణాళికా రచన ప్రారంభించాయి. భారత్‌లో 1951 నుంచి ప్రణాళికా యుగం ప్రారంభమైంది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్ర కీలకమైనందు వల్ల వివిధ రంగాలపై ప్రభుత్వ వ్యయం పెరిగింది. * పట్టణీకరణ కారణంగా సివిల్ అడ్మినిస్ట్రేషన్‌పై వ్యయం పెరిగింది. కోర్టులు, పోలీస్, రవాణా, రైల్వేలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రజారోగ్యం, నీరు, విద్యుత్ సరఫరా, పబ్లిక్ పార్కులు, లైబ్రరీలపై ఖర్చు ఎక్కువైంది. * స్వాతంత్య్రానంతరం ప్రభుత్వానికి పన్ను, పన్నేతర రాబడి అధికమైన కారణంగా ప్రభుత్వ రాబడి పెరిగింది. దాంతో జాతీయాదాయం పెరిగింది. దీనికి అనుగుణంగా వ్యయాన్ని పెంచారు. 1950 -51లో ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద ఎన్‌ఎన్‌పీ 1999-2000ధరల వద్ద రూ. 2,04,924 కోట్ల నుంచి 2013-14లో 2004-05 ధరల వద్ద రూ. 49,20,183 కోట్లకు పెరిగింది. ఝ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన కార్యక్రమాలపై అధిక వ్యయం చేస్తున్నాయి. వీటితోపాటు ప్రజా సంక్షేమం దృష్ట్యా అనేక సాంఘిక భద్రతా చర్యలను చేపట్టాయి. భారత్‌లోనూ వీటిపై ఎక్కువ వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యయ వర్గీకరణ మూలధన, రెవెన్యూ వ్యయం: మూలధన వ్యయం స్థిర ఆస్తుల కల్పనకు దారితీస్తుంది. ఈ వ్యయం పెట్టుబడుల రూపంలో ఉంటుంది. నికర ఉత్పాదక ఆస్తుల పెరుగుదలకు పెట్టుబడులు దోహదపడతాయి. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి మూలధన వ్యయం ఉపయోగపడుతున్నందువల్ల ఈ వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా పరిగణించవచ్చు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు చేసేదే మూ లధన వ్యయం. రెవెన్యూ వ్యయాన్ని ప్రస్తుత లేదా వినియోగ వ్యయంగా భావించవచ్చు. ఈ వ్యయాన్ని సివిల్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స బలగా లు, ప్రజారోగ్యం, విద్య, ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణకు వినియోగిస్తారు. స్వాతంత్య్రానంతరం రెవెన్యూ వ్యయంలో పెరుగుదల ఏర్పడింది. అభివృద్ధి లేదా అభివృద్ధేతర వ్యయం: అవస్థాపనా సౌకర్యాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలో వివిధ రంగాలపై జరిగిన వ్యయాన్ని అభివృద్ధి (ఉత్పాదక) వ్యయంగా వర్గీకరించవచ్చు. అభివృద్ధేతర (అనుత్పాదక) వ్యయం ద్వారా ప్రభుత్వానికి ఏవిధమైన ఆదాయం లభించదు. వడ్డీ చెల్లింపులు, శాంతి భద్రతలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లపై జరిగే వ్యయం ద్వారా ఏవిధమైన ఉత్పాదక ఆస్తుల కల్పన ఉండదు. బదిలీ, బదిలీ చేయడానికి వీలులేని వ్యయం: జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, నిరుద్యోగ భృతి, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం అమలుపర్చే సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాన్ని బదిలీ వ్యయంగా భావించవచ్చు. దీనివల్ల సమాజంలో ఆదాయ పునఃపంపిణీ జరుగుతుంది. మరోవైపు బదిలీ చేయడానికి వీలులేని వ్యయం వల్ల ఆదాయం లేదా ఉత్పత్తి సృష్టి జరుగుతుంది. ఈ వ్యయంలో అభివృద్ధి, అభివృద్ధేతర వ్యయం కలిసి ఉంటుంది. ఆర్థిక అవస్థాపనలు (శక్తి, రవాణా, నీటిపారుదల), సాంఘిక అవస్థాపనలు (విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం), అంతర్గత శాంతి భద్రతలు, రక్షణ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌పై ఈ వ్యయం జరుగుతుంది. దీని వల్ల ఆర్థిక కార్యకలాపాల పెంపునకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం: పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన వివిధ అంశాలపై జరిగే వ్యయం ప్రణాళికా వ్యయం. బడ్జెట్ ద్వారా వివిధ రంగాలపై కేంద్ర ప్రభుత్వం ఈ వ్యయాన్ని చేస్తుంది. ప్రణాళిక అమల్లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే ఆర్థిక సహాయం దీనిలో భాగంగా ఉంటుంది. ప్రణాళికా వ్యయాన్ని రెవెన్యూ వ్యయం, మూలధన వ్య యంగా విభజించవచ్చు. బడ్జెట్లో ప్రభుత్వం సాధారణ కార్యకలాపాలను నిర్వహించడానికి పొందుపర్చేది. ప్రణాళికేతర వ్యయం. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు, వేతనాలు, పెన్షన్లపై ఈ వ్యయం ఉంటుంది. దీనికి పంచవర్ష ప్రణాళికలో తావులేదు. ప్రణాళికేతర వ్యయాన్ని కూడా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంగా విభజించవచ్చు.