వ్యవసాయ రుణాలు రైతులకు కాదా? | Malcolm Darling comment on agricultural loans | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రుణాలు రైతులకు కాదా?

Jun 25 2026 3:35 AM | Updated on Jun 25 2026 3:35 AM

Malcolm Darling comment on agricultural loans

‘భారత రైతులు అప్పుల్లోనే పుడతారు, అప్పుతోనే జీవిస్తారు, అప్పుతోనే చని పోతారు, అప్పునే వారసత్వంగా వదిలి పెడతారు’ అని బ్రిటిష్‌ అధికారి సర్‌ మాల్కం డార్లింగ్‌ 1925లో రాశారు. అది వలస పాలన మీద నిందగా ఉద్దేశించింది. వంద సంవత్సరాల తర్వాత, జాతీయీకృత బ్యాంకులు, ప్రాధాన్య రంగ రుణాలు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, స్వయం సహాయక బృందాలు, రూ.2.5 లక్షల కోట్లకు పైగా రుణమాఫీలు జరిగిన తర్వాత కూడా– 2013 పార్లమెంట్‌ రికార్డులు చూస్తే, 52 శాతం వ్యవసాయ కుటుంబాలు ఇంకా అప్పుల్లో ఉన్నాయి. మాల్కం డార్లింగ్‌ మాటలు ఇప్పుడు స్వతంత్ర భారతదేశం మీద నిందగా మారాయి.

ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 2018 ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 92.9 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. తెలంగాణలో 89.1 శాతం. ఇవి బ్యాంక్‌ శాఖలు, స్వయం సహాయక సంఘాలు అత్యధి కంగా ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం ఏపీ రైతు సగటు అప్పు రూ.1,23,400 కాగా, సంవత్సర ఆదాయం రూ. 1,25,760. ఇదే తెలంగాణలో ఆదాయం రూ. 1,12,836, అప్పు రూ. 1,52,000. ఈ అప్పు–ఆదాయ నిష్పత్తులు చూస్తే ఎక్కువ రుణాలు ఎప్పటికీ పరిష్కారం కావని అర్థమవుతుంది.

వ్యవస్థలో ఆరు లోపాలు
1. ఏపీ, తెలంగాణలో సాగు భూమిలో 30–40 శాతం కౌలు రైతులు సాగు చేస్తున్నారు. వారికి భూమి పట్టా లేదు కాబట్టి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రాదు. ప్రభుత్వం రూ.20,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న వడ్డీ రాయితీ పథకం పట్టా ఉన్నవారికే వర్తిస్తుంది. దున్నే రైతుకు రుణం రాదు; దున్నని భూయజమానికి వస్తుంది.

2. 1975లో చిన్న రైతుల కోసం ప్రత్యేకంగా స్థాపించిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1991 తర్వాత వ్యాపార బ్యాంకుల్లా మారిపోయాయి. 

3. వ్యవసాయ రుణాలు 2000ల దశకంలో గణాంకాల్లో పెరిగాయి– కానీ రైతుకు అనుభవంలోకి రాలేదు. కారణం ఏమిటంటే, ‘వ్యవసాయ రుణం’ అనే నిర్వచనాన్ని విస్తరించారు. అగ్రి–ప్రాసెసింగ్‌ కంపెనీలకు, గ్రామీణ మౌలిక సదుపాయాలసంస్థలకు ఇచ్చిన రుణాలు కూడా వ్యవసాయ రుణాల లెక్కలోకి వచ్చాయి. 

4. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణానికి ఎలాంటి హామీ అడగకూడదని ఆర్బీఐ నిబంధన చెప్తోంది. కానీ బ్యాంకులు సర్వే నంబర్‌ లేకుండా వడ్డీ రాయితీ క్లెయిమ్‌ చేయలేవు కాబట్టి ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. 

5. హిందూ రుణచట్టంలో ‘దమ్దుపత్‌’ అనే పురాతన సూత్రం ఉంది– ఒకే సమయంలో వసూలు చేయగలిగే వడ్డీ అసలు మొత్తాన్ని మించకూడదు. ఇది కర్ణాటక మనీలెండర్స్‌ యాక్ట్‌ సహా అనేక రాష్ట్రాల రుణ చట్టాల్లో పొందుపరచబడింది. ఆర్బీఐ కూడా ఈ విషయమై స్పష్టమైన ఆదేశం జారీచేసింది. అయినా ఉల్లంఘించబడుతోంది. పంట రుణం బాకీ పడినప్పుడు – కరవు తర్వాత, ధర పతనమైన తర్వాత, వర్షాలు విఫలమైన తర్వాత ఇది సాధా రణంగా జరుగుతుంది. ఖాతాపై సాధారణ వడ్డీతో పాటు పెనాల్టీ వడ్డీ కూడా పడుతుంది. ప్రతి మూడు నెలలకు కాంపౌండ్‌ అవుతుంది. 

ఖాతా నాన్‌–పర్ఫార్మింగ్‌ అసెట్‌గా వర్గీకరించబడిన తర్వాత కూడా వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. రెండు మూడు సంవత్సరాల బాకీ తర్వాత, రూ.50,000 స్వల్పకాలిక పంట రుణంపై పేరుకు పోయిన వడ్డీ అసలును దాటిపోతుంది. ఆ సమయంలో బ్యాంకు ఆర్బీఐ ఆదేశాన్ని నేరుగా ఉల్లంఘిస్తోంది. రైతుకు ఈ నిబంధన తెలియదు. బ్యాంకు అసలు, పేరుకుపోయిన మొత్తం వడ్డీ రెండూ చెల్లించమని సెటిల్‌మెంట్‌ చర్చలు జరుపుతుంది. అనధికారికరంగంలో ఉల్లంఘన మరింత ప్రత్యక్షంగా ఉంటుంది. 36–60 శాతం వడ్డీకి అప్పిచ్చే మనీలెండర్‌ రెండు మూడేళ్లలో అప్పునురెట్టింపు చేస్తాడు– ఎలాంటి నియంత్రణ లేకుండా.

6. బ్యాంకుల రుణంలో 18 శాతం వ్యవసాయానికి ఇవ్వాలని చట్టం. కానీ – (అ) ‘వ్యవసాయ రుణం’ నిర్వచనంలో కార్పొరేట్‌ ఫుడ్‌ కంపెనీలను చేర్చారు; (ఆ) పీఎస్‌ఎల్‌సీ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడం ద్వారా బ్యాంకులు ఒక్క రైతుకూ రుణం ఇవ్వకుండా లక్ష్యాలు చేరుకుంటున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ సర్టిఫికెట్ల మార్కెట్‌ రూ.9 లక్షల కోట్లు (మొత్తం వ్యవసాయ రుణ వితరణ కంటే ఎక్కువ); (ఇ) లక్ష్యం తప్పిన బ్యాంకులు నాబార్డ్‌ ఆర్‌ఐడీఎఫ్‌ ఫండ్‌లో డబ్బు వేస్తాయి. ఆ డబ్బు రాష్ట్ర మౌలిక సదుపా యాలకు వెళ్తుంది, రైతులకు కాదు.

మూడు సంస్కరణలు
1. వడ్డీ రాయితీ సాగు చేసేవారికి చేరాలి, పట్టా ఉన్నవారికి కాదు:  సాగు చేయనివాళ్లకు సాగుకోసం ఇచ్చే వడ్డీ రాయితీ చట్ట పర మైన నేరంగా పరిగణించాలి. పంట బీమా (పీఎంఎఫ్‌బీవై) నమోదు, పీఎం–కిసాన్‌ రిజిస్ట్రేషన్, జాయింట్‌ లయబిలిటీ గ్రూపులు (జేఎల్‌జీ) లేదా రైతు ఉత్పత్తిదారు సంఘాలు (ఎఫ్‌పీఓ) సభ్యత్వం – ఇవన్నీ సాగు ఆధారాలు. జేఎల్‌జీలు, ఎఫ్‌పీఓలు ధ్రువీకరణ, రుణ వితరణ వేదికలుగా పని చేయాలి.

2. రుణమాఫీ బదులు రుణ మార్పిడి: రుణమాఫీలు సంస్థాగత రుణాలనే రద్దు చేయగలవు– అదే అత్యంత నష్టపడిన రైతులు తీసుకున్న మనీలెండర్లు, ఇన్ పుట్‌ డీలర్‌ రుణాలను తాకలేవు. రుణ మార్పిడి నిర్మాణం ఇందుకు మెరుగైన పరిష్కారం. గ్రామసభ ద్వారా రూ.25,000 కంటే ఎక్కువ అన్ని అనధికారిక రుణాలను సర్వే చేయాలి. ప్రభుత్వ హామీతో ఒక డెట్‌ కన్వర్షన్‌ ఫండ్‌... మనీలెండర్‌ నుండి రుణాన్ని అదే మొత్తానికి కొనుగోలు చేయాలి. రైతు అప్పు 7 శాతం వడ్డీతో అధికారిక రుణంగా మారుతుంది,పంట కాలానికి అనుగుణంగా వాయిదాలు ఉంటాయి. పంట నష్టం జరిగితే వాయిదా పడుతుంది, డిఫాల్ట్‌ అవ్వదు. కేరళ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం ఇప్పటికే చేసింది.

3. చిన్న–సన్నకారు రైతుల 10 శాతం ఉప–లక్ష్యాన్ని పీఎస్‌ఎల్‌సీ సర్టిఫికెట్‌ కొనుగోలు ద్వారా చేరుకోకుండా నిరోధించాలి. ప్రత్యక్ష రుణ వితరణే ఆమోదయోగ్యం కావాలి. ‘వ్యవసాయ రుణం’ నిర్వచనం నుండి అగ్రి–బిజినెస్‌ కంపెనీలను తొలగించాలి. 

మాల్కం డార్లింగ్‌ వ్యాఖ్యకు ప్రాసంగికత పోయిదా? ప్రాధాన్య రంగ రుణం కార్పొరేట్‌కు వెళ్ళింది. రూ.2.5 లక్షల కోట్ల రుణ మాఫీలు కౌలు రైతును తాకలేదు. హామీ లేని రుణం హక్కు కాగితంపైనే ఉంది. వడ్డీ పరిమితి చట్టం ఉంది, అమలు లేదు. ఈ ప్రతి లోపాన్నీ సరిచేయవచ్చు. కొత్త విధానం అవసరం లేదు, ఉన్న నిబంధనలను అమలు చేయగలిగే సంకల్పం చాలు.

-వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌
-డా‘‘ జి.వి.రామాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement