సందర్భం
పరిమిత వనరులతో విశాల సమాజానికి ఉన్నత విద్యను దరిచేర్చే లక్ష్యంతో 1982 ఆగస్టు 26న ఏర్పడిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దేశంలో ఉన్నత విద్యారంగాన్ని మలుపు తిప్పింది. సంపన్నులు, సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోగలిగిన వర్గాలకు మాత్రమే ఉన్నత విద్య అవకాశాలు ఉన్న రోజుల్లో ‘మీ ముంగిట విద్య’ నినాదంతో హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1980లో ఉన్నత విద్య గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ ఐదుశాతం ఉండగా 2023–24 నాటికి 30 శాతానికి పెరగడంలో సార్వత్రిక విద్యాసంస్థల పాత్ర ఎన్నదగింది. దేశంలో మొదటిదైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పేరును 1991లో ‘భారతరత్న బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం’గా ప్రభుత్వం మార్చింది. ఈ యూనివర్సిటీ ఈ నెల 7వ తేదీన తన 27వ స్నాతకోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఆ రోజు మొత్తం 36,145 మందికి పట్టాలు ప్రదానం చేస్తోంది.
ప్రారంభంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 23 జిల్లాల్లో కేవలం 26 కేంద్రాలతో 6,231 మంది విద్యార్థులతో మొదలైన ఈ ఓపెన్ యూనివర్సిటీ వటవృక్షంలా విస్తరించింది. ప్రస్తుతం ఏటా లక్ష ముప్పై వేల మంది అడ్మిషన్ తీసుకుంటున్నారు. మొత్తం ఆరు నుంచి ఆరున్నర లక్షల మంది రోల్స్‌లో ఉంటున్నారు. 2024 నుంచి యూనివర్సిటీ రాష్ట్ర విభజన చట్టానికి లోబడి సేవల్ని తెలంగాణకు పరిమితం చేసుకుంది. 10 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలతో కలిపి 145 అధ్యయన కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. అదనంగా బి.ఇడి., బి.ఇడి.(స్పెషల్ ఎడ్యుకేషన్), ఎం. ఎ. (స్కూల్ ఎడ్మినిస్ట్రేషన్), ఎం.బి.ఎ. (హాస్పిటల్స్, హెల్త్‌కేర్ మేనేజ్ మెంట్) వంటి వృత్తి విద్యను అందించే 31 ప్రోగ్రాం సెంటర్లు ఉన్నాయి.
ఎన్నో ప్రత్యేకతలు
విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో రూపొందించిన పాఠ్యపుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. యూనివర్సిటీ అందించే పాఠ్యపుస్తకాలు కాకుండా సామాజిక బాధ్యతతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం తక్కువ ధరలో ప్రత్యేకంగా పుస్తకాలు ముద్రించి అందిస్తోంది. యూనివర్సిటీ సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ నుంచి పిహెచ్.డి దాకా ప్రోగ్రామ్స్ అందిస్తోంది. సాధారణ బి.ఎ., బి.కామ్ వంటి కోర్సులతో పాటు సైన్స్, వృత్తివిద్య కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ఆడియో, వీడియో పాఠ్యాంశాలు, టెలికాన్ఫరెన్స్‌లు, యూట్యూబ్ ద్వారా పాఠ్యాంశాలు అందిస్తోంది.
విశ్వవిద్యాలయం పూర్తిగా డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సొంతంగా అభ్యాస నిర్వహణ వ్యవస్థను ‘బోధి’ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా వీడియో పాఠాలు, ఆన్‌లైన్ బోధన తరగతులు, ఇంటరాక్టివ్ రీసోర్సెస్ విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. మైక్రో క్రెడెన్షియల్స్, డిజిటల్ లైబ్రరీ వంటి వసతుల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే ఏర్పాట్లను యూనివర్సిటీ చేపట్టింది. 2013 నుంచే ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. దీంతో అడ్మిషన్ రిజిస్ట్రేషన్, ఫీజుల చెల్లింపు, సర్టిఫికెట్ల జారీ వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే చేసే అవకాశం కలిగింది. ఫలితంగా సేవల్లో నాణ్యత, వేగం పెరిగాయి.
ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ప్రోగ్రామ్స్ అందించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతి ఇచ్చింది. తొలి దశలో బి.కామ్.(తెలుగు, ఇంగ్లీష్ మీడియం), ఎమ్.కామ్., ఎమ్.బి.ఎ., ఎమ్.ఎ. (తెలుగు) ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన తెలుగువారికి ఈ ప్రోగ్రామ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులు విభిన్న భాషలు నేర్చుకోవడం, ప్రావీణ్యం సంపాదించడానికి వీలుగా యూనివర్సిటీ ‘లాంగ్వేజ్ లెర్నింగ్ సెంటర్’ను ఏర్పాటు చేస్తోంది. ఫ్రెంచ్, కొరియన్, జపనీస్, జర్మన్, స్పానిష్‌లకు సంబంధించి ఓపెన్ మూక్స్ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించనుంది.
కాలానుగుణంగా వస్తున్న మార్పులకు ధీటుగా విద్యార్థుల్ని తయారు చేయడంతో పాటు అధ్యాపకుల్లో నైపుణ్యాలు పెంపొందించు కునేందుకు వీలుగా కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని (ఏఐ ల్యాబ్) ఏర్పాటు చేసింది. యూనివర్సిటీ అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడంతో పాటు తెలంగాణలోని 1,500 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు 15 రోజుల పాటు ‘ఏఐ ఫర్ టీచర్స్’ శిక్షణ అందించారు. విశ్వ విద్యాలయం లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అడవి బిడ్డలుగా నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న చెంచు, గోండు, కోయ వంటి అభివృద్ధికి నోచుకోని గిరిజన తెగలు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు యూనివర్సిటీ ఉచిత విద్యను అందిస్తోంది. మొత్తం విద్యార్థుల్లో యాభై శాతం మహిళలే. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు 80 శాతం పైమాటే.
ఇదీ చదవండి: అసలు 'చూడటం' అంటే ఏమిటి?
గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించడానికి ‘జ్యోతిరెడ్డి ఫౌండేషన్’తో ఒప్పందం కుదుర్చుకుంది. 18–27 మధ్య వయస్కులైన విద్యార్థులు రిజిస్టర్ చేసుకుంటే చదువుకుంటూనే వివిధ సంస్థల్లో పనిచేయడం ద్వారా నెలకు ఏడు నుంచి ఇరవైనాలుగు వేల స్టైపండ్ పొందే అవకాశం లభిస్తుంది. తమ విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంపొందించి వారికి ఉపాధి అవకాశాల్ని దరిచేర్చేందుకు యూనివర్సిటీ అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బెజవాడ విల్సన్, ఎన్. బలరామ్, కట్టా హైమావతి, సూర్య ధనంజయ్, సాధు నరసింహారెడ్డి వంటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఇక్కడ చదివినవారే. ఈ ఏడాది స్నాతకోత్సవంలో ప్రముఖ దర్శకుడు బి. నరసింగరావు గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు.
- డాక్టర్ ఎల్వీకే
రిజిస్ట్రార్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం


