breaking news
BRAOU
-
మీడియాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమేదీ?
బంజారాహిల్స్: మీడియాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఉండటం లేదని.. అలాంటప్పుడు సమాజంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రముఖ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు అనే అంశంపై రెండో రోజైన ఆదివారం జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర సమాజం బలంగా ప్రశ్నించడం వల్లే మీడియాలో ఆ మాత్రమైనా వార్తలు వచ్చాయని... కొందరు ఆంధ్ర పాలకులు అడ్డుపడినా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్–3 ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడిందన్నారు. తక్కువ శాతం జనాభా ఉన్న అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడంపై మీడియాలో ఎక్కడా ఎక్కువ చర్చ జరగలేదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిజంపై ఇంకా లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాక్షి మీడియా గ్రూప్ సంపాదకుడు వర్ధెల్లి మురళి మాట్లాడుతూ మీడియా సంస్థలు ప్రజాప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. ‘మీడియా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ పెట్టుబడిదారులకు ఉపయోగకారిగా నిలుస్తోంది. ఈ పరిస్థితి మారి పాత్రికేయ స్వేచ్ఛను ఉపయోగిస్తూ ప్రజాప్రయోజనాలకు వాడాలి’అని కోరారు. గ్రామీణ, దళిత, మహిళా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చాం: అల్లం నారాయణ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ నుంచి ప్రఖ్యాత పాత్రికేయులు ఉన్నారన్నారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ పాత్రికేయులకు, దళిత జర్నలిస్టులకు, మహిళా పాత్రికేయులకు శిక్షణ ఇచ్చామన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె.సీతారామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రెండు రోజుల సదస్సుపై నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో టిశాట్ సీఈవో ఆర్. శైలేశ్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం–న్యూ మీడియా (బెంగళూరు) డీన్ డా. కంచన్ కౌర్, రాష్ట్ర ఐటీ (డిజిటల్ మీడియా) డైరెక్టర్ కొణతం దిలీప్, సీఈవో రాకేష్ దుబ్బుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సుధాకర్‌రెడ్డి, ఉడుముల, సీనియర్ జర్నలిస్టు ఎ. కృష్ణారావు, వర్సిటీ సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ వడ్దానం శ్రీనివాస్, ప్రొఫెసర్ సత్తిరెడ్డి, సమన్వయకర్తలు యాదగిరి కంభంపాటి, సునీల్ కుమార్ పోతన, ఓయూ జర్నలిజం విభాగ విశ్రాంత అధ్యాపకురాలు పద్మజా షా, మాజీ సంపాదకుడు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, వీక్షణం ఎడిటర్, ఎన్. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఏయూలో రెండు డిగ్రీ పరీక్షలు రద్దు
శ్రీకాకుళం(ఎచ్చెర్ల): శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రెండు సబ్జెక్టుల పరీక్షలను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 27న డిగ్రీ రెండో ఏడాది ఫిజిక్స్ పరీక్షను ఇదే కారణంతో రద్దు చేసిన సంగతి విదితమే. ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు ప్రచారం జరగడంతో సోమవారం ఉదయం జరగాల్సిన ఫిజిక్స్ తొలి ఏడాది పరీక్ష రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ వి. కృష్ణమోహన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. ఇదే కారణంతో మధ్యాహ్నం జరగాల్సిన డిగ్రీ రెండో ఏడాది కెమిస్ట్రీ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా వర్సిటీ పరిధిలో ఇలా మూడు డిగ్రీ పరీక్షలు రద్దవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.