
60ఏళ్లుగా తయారీ మూడు తరాలుగా జీవనోపాధి
పాలకోవాకు ప్రసిద్ధిగాంచిన బొంకూరు
మూడు కుటుంబాలకు రోజువారీ ఆదాయం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్/ఉండవెల్లి: ఒక వృత్తి జీవనోపాధికి జీవం పోస్తుంది. అదే వృత్తిలో నైపుణ్య సాధిస్తే ఆ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు సొంతం అవుతాయి. అది తినబండారమైతే మరింత ప్రాచుర్యం లభిస్తుంది. అందులోనూ మిఠాయి అయితే ఈ ప్రాంతం గురించి చెప్పన్నక్కర్లేదు. అలాంటి పసందైన పాలకోవాకు పెట్టింది పేరుగా ఉండవెల్లి మండలం బొంకూరు పేరొందింది. ఇక్కడ ఆరు దశాబ్దాలుగా ఒక కుటుంబం పాలకోవా తయారీతో గుర్తింపు దక్కించుకుంది. ఒకప్పుడు జీవనోపాధి కోసం పాలకోవాను తయారు చేశారు. ఇప్పటికీ అదే వ్యాపారంలో రాణిస్తూ ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ–ఏపీ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని పట్టణాల్లో బొంకూరు పాలకోవా ప్రసిద్ధిగాంచింది.
చదవండి: రూ.13వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?
ఆరు దశాబ్దాలుగా తయారీ
గ్రామానికి చెందిన ఒక కుటుంబం పాలకోవా తయారీతో జీవనోపాధి పొందుతుంది. మూడు తరాలుగా ఇదే వ్యాపారంతో ఉపాధి పొందుతున్నారు. పాలకోవా తయారీ ఆ కుటుంబానికి ఉపాధి లభిస్తుండగా ఏళ్ల తరబడి నైపుణ్యం ఆ గ్రామానికే పేరు తెచ్చింది. 60 ఏళ్ల క్రితం సలాం మియ్యా–అమిర్ బీ దంపతులు జీవనోపాధి కోసం పాలకోవా తయారీని ఎంచుకున్నారు. పాలకోవాను తయారు చేసి పట్టణాలకు తరలించి రోజువారీ ఆదాయంతో ఉపాధి లభించింది. ఆ దంపతులకు నజీర్ మియ్యా, కాశీం మియ్యా, శాలిమియ్యా, రసూల్ మియ్యా నలుగురు కుమారులు. వీరిలో పెద్ద కొడుకు నజీర్ మియ్యా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. మిగిలిన ముగ్గురు కుమారులు తండ్రితో కలిసి పాలకోవా తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయించారు. ఆ తర్వాత కుటుంబాలు వేర్పడినా ఎవరికి వారు పాలకోవాతోనే జీవనం సాగిస్తున్నారు. ఇలా మూడు తరాలుగా పాలకోవా తయారు చేస్తూ అందులో రాణిస్తున్నారు.
ఇదీ చదవండి: గ్రాండ్‌మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గా
నాణ్యతలో రాజీలేకుండా..
మూడు తరాలుగా పాలకోవాతో ప్రసిద్ధి గాంచిన ఆ కుటుంబం నాణ్యతలో రాజీపడకుండా స్వచ్ఛమైన పాలకోవాను తయారు చేస్తున్నారు. పాలకోవాకు పాలపాకెట్లు కాకుండా గ్రామంలో పాడిరైతుల నుంచి బర్రెపాలను సేకరిస్తారు. ఆ తర్వాత కట్టెల పొయ్యిపైనే తయారు చేస్తారు. బర్రెపాల ఖరీదు పెరిగినప్పటికీ తమ లాభాలు తగ్గించుకొని స్వచ్ఛమైన పాలకోవాను సిద్ధం చేస్తున్నారు. పాలకోవ తయారీలో కుటుంబం మొత్తం భాగస్వాములవుతారు.
ఇంట్లో తయారీ.. పట్టణాల్లో విక్రయం
పాలకోవాను ఇంట్లోనే సిద్ధం చేస్తారు. ఉదయం పాలసేకరణ అనంతరం కట్టెలపొయ్యిపైనే పాలకోవాను తయారు చేస్తారు. ఆ తర్వాత కర్నూల్, అయిజ, శాంతినగర్, అలంపూర్ వంటి ప్రాంతాల్లో విక్రయిస్తారు. మిఠాయి, ఇతర దుకాణాలకు సైతం పాలకోవాను సరఫరా చేస్తున్నారు. ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలకోవాను విక్రయిస్తారు. ఇళ్లు అలంపూర్– రాయచూరు రోడ్డుమార్గంలో ఉండడంతో ఈ మార్గాన ప్రయాణించేవారు కొనుగోలు చేస్తారు. పట్టణాల్లో సైతం వీళ్లు తయారు చేసే పాలకోవాను నిరంతరం కోనుగోలు చేసే వినియోగదారులు, ఉద్యోగులు ఉన్నారు.
60 ఏళ్ల క్రితం ప్రారంభించాం : 60 ఏళ్ల క్రితం నా భర్త సలాం మియ్యా పాలకోవా తయారీని ప్రారంభించారు. వ్యాపారం చేయడానికి డబ్బులు లేవు. దీంతో తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేద్దామని పాలకోవాను తయారు చేశాం. అప్పటి నుంచి పాలకోవాతోనే నా కుమారులు ఉపాధి పొందుతున్నారు. - అమీర్ బీ, బొంకూరు
నాణ్యతగా తరయారు చేస్తాం: మూడు తరాల నుంచి పాలకోవాను విక్రయిస్తున్నాం. మా మామ దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వారసత్వంగా మేం కొనసాగిస్తున్నాం. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. పాలకోవాకు డిమాండ్ పెరిగిందే తప్పా.. తగ్గలేదు. మా మూడు కుటుంబాలు పాలకోవాతోనే జీవనం సాగిస్తున్నాం. ఎవరికి వారు తయారు చేసుకోని వాటిని విక్రయిస్తుంటారు. – కాశీంబీ, బొంకూరు

పట్టణాల్లో విక్రయిస్తాం: గ్రామంలో పాలకోవా సిద్ధం చేసి కుటుంబ సభ్యులంతా కలిసి కిలో, అర కిలో, పావు కిలో డబ్బాల్లో నింపుతాం. ఆ తర్వాత పెద్ద పట్టణాలు, మిఠాయి దుకాణాలు, హోల్‌సేల్‌గా విక్రయిస్తాం. ఇంటి వద్దకు వచ్చే వారికి పాలకోవా అందుబాటులో ఉంటుంది. – రసుల్ బాషా, బొంకూరు