
ఉత్తరాఖండ్ సింగోరి
కావలసినవి: కోవా, పంచదార– అర కేజీ చొప్పున, పచ్చికొబ్బరి తురుము– 150 గ్రాములు, అరటాకు– 1 (శుభ్రంగా కడిగి, చిన్నచిన్న పొట్లాలు కట్టుకునేలా ముక్కలు చేసుకోవాలి. అరటాకు లేదా తమలపాకులు తీసుకోవచ్చు), ఏలకుల పొడి– అర టీ స్పూన్, పిస్తా పలుకులు లేదా బాదం– గార్నిష్ కోసం (నేతిలో వేయించాలి)
తయారీ: కోవాను చేత్తో మెత్తగా చేసి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు బాణలిలో కోవా, పంచదార వేసి చిన్న మంట మీద పెట్టి, పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగి కోవాలో కలిసిపోయిన తర్వాత, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 10 లేదా 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు ఏలకుల పొడివేసి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమం కాస్త చల్లారనివ్వాలి. అరటాకులు లేదా తమలపాకులను కోన్ ఆకారంలో చుట్టుకుని, ఊడకుండా టూత్‌పిక్స్ అమర్చుకోవాలి. ఇప్పుడు ప్రతి కోన్‌లో ఈ మిశ్రమాన్ని నింపుకుని,పైన పిస్తా పలుకులు లేదా బాదంతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
మ్యాంగో పొంగల్
కావలసినవి: పెసరపప్పు, బియ్యం– అర కప్పు చొప్పున (పది నిమిషాలు నానబెట్టి, నీళ్లు తొలగించి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి), నెయ్యి– 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్– గార్నిష్‌కి సరిపడా (నేతిలో వేయించుకోవాలి), ఉప్పు– తగినంత, మామిడి పండు– 1(తియ్యగా ఉండాలి), బెల్లం పాకం– ఒక కప్పు (వడకట్టుకోవాలి, మామిడి తీపిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు)
తయారీ: ముందుగా ఒక కుకర్‌లో నెయ్యి వేసుకుని, వేడికాగానే అందులో బియ్యం వేసుకుని ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పుతూ వేయించాలి. తర్వాత పెసరపప్పు వేసుకుని తిప్పుతూ మరో నిమిషం వేయించుకోవాలి. అనంతరం ఉప్పు, మామిడిపండు ముక్కలు వేసుకుని కలపాలి. ఆపై 2 కప్పుల నీళ్లు వేసి, కుకర్ మూత పెట్టి.. 3 లేదా 4 విజిల్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
కాసేపు ఆగి కుకర్ మూత తీసి.. మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని, కుకర్ స్టవ్ మీద పెట్టి, ఆ మిశ్రమాన్ని బాగా పప్పుగుత్తితో తిప్పి.. బెల్లం పాకం జోడించి మరింత సేపు ఉడికించుకోవాలి. కొన్ని జీడిపప్పు, కిస్మిస్‌లు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే నెయ్యితో, మిగిలిన జీడిపప్పు, కిస్మిస్‌లతో కలిపి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది
ఈ పొంగల్.
దక్షిణాఫ్రికా కోక్సిస్టర్స్
కావలసినవి: నీళ్లు– 2 కప్పులు, పంచదార– 3 కప్పులు, దాల్చిన చెక్క– 1 (చిన్నది), అల్లం ముక్కలు– 2 (చిన్నవి), నిమ్మరసం– అర టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్– ఒక టీస్పూన్, మైదా పిండి– 2 కప్పులు, బేకింగ్ పౌడర్– 4 టీ స్పూన్లు, ఉప్పు– అర టీస్పూన్, పాలు– అర కప్పు, నూనె– సరిపడా, వెన్న– 60 గ్రాములు
తయారీ: ముందురోజు రాత్రి ఒక గిన్నెలో నీళ్లు, పంచదార, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. పంచదార కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి.
స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాల తర్వాత నిమ్మరసం, వెనీలా ఎసెన్స్ కలపాలి. తర్వాత పూర్తిగా చల్లారక రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. మరునాడు ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. వెన్నను కాస్త కరిగించి, అందులో కలపాలి. ఉండలు లేకుండా చూసుకుని, పాలు పోసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అరగంట తర్వాత కొంత భాగం తీసుకుని, రెండు ఉండలుగా చేసుకుని సన్నని పాముల్లా రోల్స్ చేసుకోవాలి.
ఆ రెండు సన్నని భాగాలను జడలా అల్లుకుని, రెండు చివర్ల చేత్తోనే అతికించాలి. ఇదే మాదిరి మొత్తం మిశ్రమాన్ని జడల్లా అల్లుకుని, వాటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. నూనెలోంచి తీశాక వెంటనే సీరమ్‌లో వేసుకోవాలి. అవి ఆ సీరమ్‌లో రెండు మూడు నిమిషాల బాగా నానిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.