Sakshi News home page

మహిళా అధికారులు.. వరదలకు ఎదురు నిలిచి ధీరత్వం ప్రదర్శించారు

Published Fri, Jul 21 2023 6:10 AM

Women Collectors and Women cops played important role during rains and flood disaster in Himachal Pradesh - Sakshi

పంజాబ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకు మహిళా ఆఫీసర్ల ధైర్యగాధలు మార్మోగుతున్నాయి. ఇటీవలి పెను వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడటంలో మహిళా కలెక్టర్లు, ఎస్‌పిలు రేయింబవళ్లు కష్టపడి ధీరత్వాన్ని ప్రదర్శించారు. చంటి పిల్లల్ని ఇళ్లల్లో వదిలి ప్రజల కోసం రోజుల తరబడి పని చేసిన ఈ ఆఫీసర్ల పరిచయం...

ఉత్తర భారతాన్ని వానలు, వరదలు చుట్టుముట్టాయి. పంజాబ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకూ కుంభవృష్టి ముంచెత్తింది. నదులు వెర్రెత్తి ఫ్రవహించాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. గిరి వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుని వరదనీటిలో అడ్డొచ్చినవాటిని ధ్వంసం చేసుకుంటూ ముందుకు సాగాయి. కార్లు అగ్గిపెట్టెల్లా చెల్లాచెదురయ్యాయి. ప్రాణాలకు ప్రమాదం వచ్చి ఏర్పడింది.

ఇలాంటి సమయాల్లో బయటకు అడుగు పెట్టడమే కష్టం. కాని ఈ సందర్భాలను సమర్థంగా ఎదుర్కొని ప్రశంసలు పొందారు మహిళా అధికారులు. ప్రకృతి విసిరే సవాళ్లకు తాము జవాబు చెప్పగలమని నిరూపించారు. సహాయక బృందాలను సమాయత్త పరచడం, లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడం, వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తరలించడం ఈ పనుల్లో స్వయంగా పాల్గొంటూ రేయింబవళ్లు పని చేశారు. అందుకే వారిని జనం మెచ్చుకుంటున్నారు. కృతజ్ఞతలు చెబుతున్నారు.

పాటియాలా కలెక్టర్‌
ఉత్తర భారతానికి పెను వర్షగండం ఉందని వార్తలొచ్చాక ఆ గండం పంజాబ్‌లో పాటియాలా జిల్లాకు కూడా వచ్చింది. జూలై 9, 10 తేదీల్లో పాటియాలా జిల్లా వరదల్లో చిక్కుకుంది. ఆ జిల్లా కలెక్టర్‌ సాక్షి సహానె వెంటనే రంగంలో దిగింది. ఆమెకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ కుమార్తె బాగోగులు తన తల్లిదండ్రులకు అప్పజెప్పి దాదాపు 7 రోజులు ఇంటికే వెళ్లకుండా జిల్లా అంతటా తిరుగుతూ ప్రజలను కాపాడింది సాక్షి సహానె.

ముఖ్యంగా ఎగువన ఉన్న మొహాలీ జిల్లా నుంచి వరద నీరు పాటియాలాలోని సట్లజ్‌ యమున లింక్‌ కెనాల్‌కి చేరడంతో ఒక్కసారిగా వరద చండీగడ్‌–పాటియాలా హైవేపై ఉన్న రాజ్‌పుర ప్రాంతానికి వచ్చేసింది. అక్కడే చిత్కారా యూనివర్సిటీ, నీలమ్‌ హాస్పిటల్‌ ఉన్నాయి. రెండూ వరదలో చిక్కుకున్నాయి. ‘నీలమ్‌ హాస్పిటల్‌లో ఉన్న అందరు పేషెంట్లను, 14 మంది ఐసియు పేషెంట్లను విజయవంతంగా తరలించ గలిగాం’ అని సహానె తెలిపింది. అలాగే చిత్కారా యూనివర్సిటీలో విద్యార్థులందరూ బయటకు రాలేనంతగా వరద నీటిలో చిక్కుకున్నారు.

సహానె స్వయంగా యూనివర్సిటీ దగ్గరకు వెళ్లి ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ దళాల సహాయంతో ఆ విద్యార్థులను బయటకు తరలించారు. ‘సులూర్‌ అనే గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని ఆహారం కోసం జనం అల్లాడుతున్నారని నాకు అర్ధరాత్రి ఫోన్‌ వచ్చింది. వెంటనే ఆహారం తీసుకుని ఆ వానలో వరదలో బయలుదేరాను. కారులో కూచుని ఉంటే వరద నీరు నా అద్దాల వరకూ చేరుకుంది. భయమూ తెగింపు కలిగాయి. అలాగే ముందుకు వెళ్లి ఆహారం అందించగలిగాను’ అంది సాక్షి సహానె. 2014 ఐ.ఏ.ఎస్‌ బ్యాచ్‌కు చెందిన సహానె తన చొరవ, చురుకుదనంతో పాటియాలా జిల్లా ప్రజల అభిమానం గెలుచుకుంది.

కుల్లు ఎస్‌.పి.
హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లా ఎస్‌.పి 28 సంవత్సరాల సాక్షి వర్మను అందరూ ‘లేడీ సింగం’ అంటారు. సిమ్లా జిల్లాలో ఆమె పని చేసినప్పుడు బ్రౌన్‌షుగర్‌ సరఫరా చేసే ముఠాలను పట్టుకుంది. అలాగే పేరు మోసిన దొంగలను జైలు పాలు చేసింది. స్త్రీల రక్షణ కోసం ‘గుడియా హెల్ప్‌లైన్‌’, ‘శక్తి బటన్‌’, ‘హోషియార్‌ సింగ్‌’ అనే హెల్ప్‌లైన్లు ప్రారంభించింది. దాంతో జనం ఆదరణ పొందింది. కుల్లు ఎస్‌.పిగా చార్జ్‌ తీసుకున్నాక వచ్చిన తీవ్ర వరదలను సాక్షి వర్మ సమర్థంగా ఎదుర్కొంది.

‘ఈ వరదల్లో నాకు ఎదురైన పెద్ద సవాలు ఏమిటంటే మా జిల్లాలో ఉన్న పెద్ద టూరిస్ట్‌ అట్రాక్షన్స్‌ మనాలి కావచ్చు, తీర్థన్‌ కావచ్చు... వీటన్నింటితో కమ్యునికేషన్‌ కోల్పోవడం. మొబైల్స్‌ పని చేయలేదు. మా పోలీసు శాఖ వైర్‌లెస్‌ ఫోన్లు కొన్ని చోట్ల మాత్రమే పని చేశాయి. మిగిలిన ప్రాంతాలకు శాటిలైట్‌ ఫోన్లు పంపి అక్కడి నుంచి సమాచారం తెప్పించాను. కాని శాటిలైట్‌ ఫోన్లు చేర్చడం కూడా పెద్ద సవాలైంది. అలాగే రోడ్లు ధ్వంసం కావడం వల్ల సహాయక బృందాలు చేరలేకపోయాయి. అయినా సరే మేమందరం సమర్థంగా సహాయక చర్యలు చేపట్టాము. పని చేసేటప్పుడు నేను స్త్రీనా, పురుషుడినా అనేది నాకు గుర్తు ఉండదు. ఒక ఆఫీసర్‌గా ఏం చేయగలను అనేదే ఆలోచిస్తాను’ అని తెలిపింది సాక్షి వర్మ– 2014 ఐపిఎస్‌ బ్యాచ్‌ ఆఫీసర్‌.

మండి ఎస్‌.పి.
కుల్లు జిల్లా పక్కనే ఉంటుంది మండి జిల్లా. రెంటికీ రెండు గంటల దూరం. ఈ జిల్లా కూడా తీవ్రంగా వరద బారిన పడింది. వంతెనలు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. చివరకు పోలీస్‌ స్టేషన్లకు బిఎస్‌ఎఫ్‌ దళాలకు కూడా కమ్యూనికేషన్‌ లేదు. ఇలాంటి సమయంలో గొప్ప సమర్థతతో పని చేసింది మండి ఎస్‌.పి సౌమ్య సాంబశివన్‌. 2010 ఐపిఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈ ఆఫీసర్‌ బియాస్‌ నది ఒడ్డున ఉన్న స్లమ్స్‌ చిక్కుకున్న 80 మందిని కాపాడగలగడంతో మొదటి ప్రశంస పొందింది.

టూరిస్ట్‌ ప్రాంతం కాబట్టి కమ్యూనికేషన్‌ లేకపోవడం వల్ల అక్కడికి వచ్చిన టూరిస్ట్‌లు ఎలా ఉన్నారంటూ ఫోన్ల వరద మొదలైంది. టూరిస్ట్‌లను సురక్షితంగా ఉంచడం సౌమ్యకు ఎదురైన పెద్ద సవాలు. ‘వారందరిని వెతికి స్థానిక సత్రాల్లో, గురుద్వారాల్లో చేర్చడం చాలా వొత్తిడి కలిగించింది. అలాగే ఇళ్లు విడిచి రావడానికి చాలామంది ఇష్టపడలేదు. కష్టపడి సంపాదించుకున్న వస్తువులను వదిలి రావడం ఎవరికైనా బాధే. వారు అలాగే ఉంటే చనిపోతారు. ఎంతో ఒప్పించి వారిని ఖాళీ చేయించాను’ అందామె. సౌమ్య సాంబశివన్‌ కింద మొత్తం 1200 మంది సహాయక సిబ్బంది పని చేసి ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు.

Advertisement
Advertisement