ఆలయంలో ద్వార పాలకులెందుకు? | Significance of Dwarapalakas in Temples | Meaning of Mudras & Spiritual Guidance | Sakshi
Sakshi News home page

ఆలయంలో ద్వార పాలకులెందుకు?

Sep 25 2025 10:41 AM | Updated on Sep 25 2025 11:29 AM

Who are Dwarapalakas why and What is their Importance in Temples

ఆలయద్వారం అనంతశక్తికేంద్రం అయితే ఆ శక్తిని కాపాడేవారు ఈ ద్వారపాలకులు. వీరినే ప్రతీహారులు అని కూడా అంటారు. ద్వారపాలకులు లోపలి దైవానికి ప్రతినిధులు. ఆలయంలోకి ప్రవేశించేవారెవరైనా వీరి అనుమతి కోరి వెళ్లవలసిందే. ద్వారపాలకులు ఆలయద్వారానికి కుడి ఎడమలలో ఇరువైపులా నాలుగు చేతులతో, ఆయుధాలను ధరించి నిలబడి ఉంటారు. భక్తులకు వీరిని చూస్తే సాధారణంగానే కాస్త భయం కలుగుతుంది. ఎందుకంటే ద్వారపాలకులు కోరపళ్లతో, తీక్షణమైన చూపులతో ఉంటారు. దీనికి కారణం ఏంటంటే భగవంతుని దర్శించడానికి వెళ్లే మనం చాలా జాగ్రత్తగా, మనస్సు ఇతరమైన ఆలోచనలు చేయకుండా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయభక్తులతో స్వామిసన్నిధికి చేరుకోవాలి. దానికి ద్వారపాలకులు మనకు మార్గదర్శనం చేస్తారు. 

ద్వారపాలకులు సాధారణంగా గదను లేదా దండాన్ని నిలబెట్టి రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి, పరహస్తాలలో అంటే వెనుక చేతులతో శివాలయంలో త్రిశూలం, డమరుకాన్నీ, విష్ణ్వాలయంలో శంఖం, చక్రం ధరించి నిజహస్తాలతో సూచీముద్ర, తర్జనీముద్ర, విస్మయహస్తం ఇలా ఏదోకటి చూపుతూ ఉంటారు. చూపుడువేలుతో స్వామిని చూపుతూ ’ఆయనను శరణు వేడండి. కష్టాలనుంచి గట్టెక్కే మార్గం ఆయనే చూపుతాడు’ అనేలా కనిపించే ముద్రను సూచీముద్ర లేక సూచీహస్తం అంటారు.

‘నీవు అడుగుపెట్టిన చోటు భగవత్‌ సన్నిధానం. ఈ స్వామి మహిమను, క్షేత్ర మహిమను గుర్తెరిగి మసలు కోండి. తప్పులు చేసి ఆయన ఆగ్రహాన్ని పొందవద్ద’ని చూపుడువేలు నిటారుగా ఉంచి భయపెట్టినట్లుండేది తర్జనీహస్తం. చేసే ప్రతి పనిలోనూ భగవంతుని దర్శించే పని ఒక్కటి చేస్తే చాలు ఇక అంతా ఆయనే చూసుకుంటాడు. మరేం భయమక్కర్లేదు’ అనే తత్త్వం కూడా ఈ తర్జనీముద్ర అంతరం.

చదవండి: Weight Loss వెయిట్‌ లాస్‌లో ఇవే మెయిన్‌ సీక్రెట్స్‌

‘ఈ స్వామి మహిమను వర్ణించడం ఎవరితరం? అనంతమైన స్వామి కరుణను  పొందినవారెందరో! దానికీ అంతులేదు. గట్టిగా కొలిస్తే మీరూ పరమపదం  పొందగలరు. ప్రయత్నించి చూడండి! ’లోపలి దేవుని నమ్మి చెడిపోయిన వారెవరూ లేరు. మీరూ ప్రయత్నించండి’ అన్నట్లు హస్తాన్ని తన లోపలివైపుకు తిప్పుకుని ఉండేది విస్మయహస్తం. భయాన్ని గొలిపే వారి క్రూరమైన చూపులే భగవంతుని అభయాన్ని మనకందించేలా చేస్తాయి. వారు చేతితో చూపే ముద్రలే మనల్ని దైవసన్నిధికి చేర్చుతాయి. కనుక ప్రతి భక్తుడూ వారి దర్శనం చేసుకుని వారి అనుమతి  పొంది భగవద్దర్శనం చేసుకుంటే ఎన్నో రెట్లు శుభఫలితాలు  పొందవచ్చు.

ఇదీ చదవండి: వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన పాపులర్‌ నటుడు

– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement