
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాంలీలా ప్రదర్శన జోరుగా సాగుతోంది. ఆధ్యాత్మిక పరవశంలో మునిగి వున్న చంబా చౌగన్ మైదానంలో చారిత్రాత్మక శ్రీరామలీలలో ఒక్కసారిగా కలకలం రేగింది. దశరథుడిగా నటిస్తున్న 73 ఏళ్ల వృద్ధ నటుడు ప్రదర్శన సమయంలో గుండెపోటుకు గురై వేదికపైనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలొదిలేసిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
స్థానిక పాపులర్ నటుడు అమ్రేష్ మహాజన్(శిబు) వేదికపైనే కుప్పకూలిపోయాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలోని శ్రీరాంలీలాలో దశరథుడిగా నటిస్తున్న అమ్రేష్ మహాజన్ సింహాసనంపై ఉండి డైలాగులూ చెబుతూనే ఋషి పాత్ర నటిస్తున్న సహనటుడి భుజంపై వాలిపోయాడు. అంత సీనియర్ నటుడు తనపై వాలిపోవడంతో సహనటుడికి తొలుత ఏమీ అర్థం కాలేదు. పదంటే పది సెకన్లలో ఏమి జరిగిందోగ్రహించి సహాయం కోసం అర్థించడం, అతడిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. కానీ అప్పటికే ఆయన జీవిత నాటకానికి తెరపడిపోయింది. దీంతో సహ నటులు , ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.
A man playing the role of King Dashrath collapsed and died on stage during the Ramleela in Chamba district of Himachal Pradesh. pic.twitter.com/6bThTX2LIk
— Piyush Rai (@Benarasiyaa) September 24, 2025
మొఘలా మొహల్లా నివాసి గత 40 సంవత్సరాలుగా చారిత్రాత్మక వేడుకల్లో పాల్గొంటున్నాడు. శ్రీరామలీలాలో సాధారణంగా ఆయన రాముడి తండ్రి దశరథుడిగా లేదా రామాయణంలో మరో కీలక కేరెక్టర్ రావణుడి పాత్రలను పోషించేవాడు. వయసు మీద పడినప్పటికీ, ప్రతీ ఏడాదిరిహార్సల్స్ చేసి మరి గొప్ప ప్రదర్శనలో ప్రదర్శన ఇచ్చేవాడు. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంలో ఉన్నారు. అయితే యాదృచ్చికంగా న చివరి రాంలీలా అవుతుందని, దీని తర్వాత తాను తప్పుకుంటానని నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది. దురదృష్టవశాత్తూ అదే చివరి ప్రదర్శన అయింది.
మహాజన్ వేదికపైనే ఆకస్మికంగా మరణించడం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని చంబాలోని శ్రీ రామ్ లీలా క్లబ్ అధ్యక్షుడు స్వపన్ మహాజన్ విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది ఢిల్లీలోని షాదరాలో రామ్‌లీలా ప్రదర్శన సందర్భంగా రాముడి పాత్ర పోషించిన నటుడు సుశీల్ కౌశిక్ గుండెపోటుతో ఛాతీని గట్టిగా పట్టుకుని, వేదికపైనుంచి బయటకు వెళ్లి కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే.