
జీవితంలో సారవంతమైన సమయాల కంటే, నీరసంగా గడిచే ఘట్టాలే ఎక్కువ. అందుకే జీవితాన్ని ‘సంసార కటు వృక్షం’ అన్నారు. ఇదొక చేదు ఫలాల చెట్టు. ఎక్కువ ఫలాలు చేదు. కొన్ని మాత్రమే మధురం. జీవితంలో చేదు తగ్గించుకోవాలంటే, క్రోధం, ఈర్ష్య, నిస్సం తోషం, అసంతృప్తి, క్రూరత్వం లాంటి భావనలూ, భావోద్రేకాల రూపంలో ఉండే చేదు ఫలాలను వీలయినంతవరకూ ఏరి పారేసి, దూరంగా ఉంచాలి. లేకపోతే జీవితమంతా చేదవుతుంది. వీలయినంతవరకూ రుచికరమైన మధుర ఫలాలను కోసుకొని, భద్రపరచుకొని తనివారా ఆస్వాదించాలి.
ఈ సంసార విషవృక్షంలో శ్రమపడి వెతికితే అందరికీ అమృతతుల్య మైన మధుర ఫలాలు రెండు లభిస్తాయట. ఒకటి – సుభాషిత రసాస్వాదం, రెండు – సజ్జనులతో సాంగత్యం. మంచి మాటల తీయని రుచి చవిచూడ గలగటం, మనసుకు ప్రశాంతిని చేకూర్చగల మంచి మనుషుల సాహచర్యం చేయటం. పెద్దలు అనుభవంతో, మన మేలు కోరి చెప్పే సత్యాలూ, నీతులూ, మార్గదర్శకమైనమంచి మాటలూ విన్నప్పుడు ఆనందాన్నిస్తాయి. మననం చేసుకొంటే మదిని చల్లబరుస్తాయి. పట్టుదలతో, పూనికతో పాటించి చూస్తే, జీవితాన్ని చక్కదిద్ది సుఖమయం చేస్తాయి.
అలాగే, జీవితంలో మంచి మనుషుల సాహచర్యం, సాంగత్యం లభిస్తే, అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. సజ్జనుల సాంగత్యంలో, వాళ్ళ స్వభావమూ, నడతా, భావ జాలమూ సాటివారిని ప్రభావితం చేసి, చక్కని వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తాయి.
‘కాపీ’ పుస్తకంలో కుదురుగా ఉన్న దస్తూరీని అనుకరించటం అభ్యాసం చేస్తే, అభ్యాసం చేసిన వాళ్ళ చేతిరాత మెరుగయినట్టు, సజ్జనుల సాంగత్యంలో, వారి నీడలో నడిచే వారి నడత తిన్ననవుతుంది. అందుకే ’నీ స్నేహితులెవరో నాకు చెప్పు, నువ్వెలాంటి వాడివో నేను చెప్తాను’ అన్న పాత సామెత ఎంతో అర్థవంతమైంది.
– ఎం. మారుతి శాస్త్రి