
"మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అంటే ఇదేనేమో. ఒక అమెరికా మహిళ వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సప్తసముద్రాలు దాటి అదీ తన కన్నా చిన్నవాడైన వ్యక్తిని మనువాడింది. ప్రేమకు సరిహద్దులు..అవధులు లేవు అని నిరూపించిన ఆ ప్రేమ జంట గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన మిండీ రాస్ముస్సేన్ (Mindy Rasmussen, 47) , అప్పర్ దిర్ జిల్లా నివాసి 31 ఏళ్ల ఫేస్‌బుక్ ప్రేమికుడు సాజిద్ జెబ్ ఖాన్‌ను ప్రేమించింది. ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఏకంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వెళ్లింది. అంతేకాదు ఇస్లాంలోకి మతం మారింది. మధ్య 16 సంవత్సరాల వయస్సు తేడా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ నెల ప్రారంభంలో సాంప్రదాయ నిఖా వేడుకలో వివాహం చేసుకున్నారు. సామాజిక విమర్శలను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ జంట ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది.
ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!
ఫేస్ బుక్ పరిచయం
స్థానిక మీడియా కథనాల ప్రకారం దాదాపు ఒక సంవత్సరం క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఆన్‌లైన్‌లో పాకిస్తాన్‌కు చెందిన సాజిద్ జెబ్ ఖాన్ పరిచయం ఏర్పడింది. మొదట్లో అందరిలాగానే మామూలుగా మాట్లాడుకునే వారు. అది కాస్తా సుదీర్ఘ వీడియో కాల్స్‌గా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ముందుగా రాస్ముస్సేన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అటు వీరి ప్రేమకు ఇరు కుటుంబాలూ అంగీకారం తెలిపాయి. ఈ నెల ప్రారంభంలోనే 90 రోజుల వీసా గడువుతో రాస్ముస్సేన్ అమెరికా నుంచి ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Islamabad International Airport) వచ్చింది. ఆమెకు ప్రేమగా స్వాగతం తెలిపిన సాజిద్ జెబ్ ఖాన్ స్వగ్రామానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘జులేఖ’గా పేరు మార్చుకుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిఖా చేసుకున్నారు. తమ నిఖా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాస్ముస్సేన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది. దీంతో ఈ లవ్‌స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.