
రాజ్యాధికారం గురించి సామాన్యుడు ఆలోచించడానికి సాహసించని రోజులలో ఏకంగా గోల్కొండ రాజ్యాన్ని ఏలిన సామాన్యుడు పాపన్న. గౌడ కులంలో పుట్టి 12 మందితో సైన్యాన్ని ప్రారంభించి 12వేలకు సైనిక శక్తిని పెంచి పాలన చేపట్టాడని మన జానపద కథలు చెబుతున్నాయి. మొగల్ ఆస్థానంలో పనిచేసిన ఖాఫీ ఖాన్ రచించిన ‘ముంతఖబ్ – అల్ లుబాబ్’ పాపన్నను ప్రస్తావించింది. పాపన్న గురించి జేఏ బోయల్ ‘దిఇండియన్ యాంటీ క్వెరీ’ 1874 జనవరి సంచికలో ‘తెలుగు బల్లాడ్ పొయెట్రీ’ అనే శీర్షికతో పాపన్న గురించి రాశాడు. లండన్‌లోని ‘విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం’లో పాపన్న చిత్రపటం ఉంది. కొంపల్లి వెంకట్ గౌడ్... పాపన్నపై చేసిన పరిశోధన ప్రకారం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న పాపన్న చిత్రపటాన్ని ఆయన సమకాలిక చిత్రకారుడు జగదీష్ మిట్టల్ వేశాడు.
పాపన్న అసలు పేరు నాశగోని పాపన్న గౌడ్. ప్రస్తుత సిద్దిపేట జిల్లా దూల్ మిట్టలో ఉన్న రాతి శాసనం ప్రకారం పాపన్న 1650 ఆగస్టు 18న సర్వమ్మకు జన్మించాడు. ఆయన పుట్టిన ఊరు ప్రస్తుత జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్. కులవృత్తి కల్లు గీతను విరమించి చిన్న సైన్యాన్ని ఏర్పరచుకొని మొదట తాటికొండ చుట్టు పక్కల గ్రామాలలో ధనవంతులను, భూస్వాములను కొల్లగొట్టాడు. ఆ తర్వాత తన చర్యలను హుస్నాబాద్, జనగాం, షాపురం చుట్టుపక్కలకు విస్త రించాడు. కౌలాస్ జమిందారు దగ్గర పనికి కుదిరి ఆ కోట చుట్టుపక్కలా ధనవంతులను దోచుకుని సైన్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. సర్వాయిపేట కోటను నిర్మించి స్వతంత్రాన్ని ప్రకటించుకొని విజయయాత్ర ప్రారంభించాడు. హుస్నాబాద్, తాటికొండ, షాపురం వంటి చోట్లా కోటలు నిర్మించాడు. చివరికి 1709లో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడని అంటారు. అయితే చివరికి మొగల్ సైన్యం చేతికి చిక్కి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారంలో ఉన్న కథలు చెబుతున్నాయి.
– నర్సింగు కోటయ్య ‘ చరిత్ర అధ్యాపకులు, నల్లగొండ
(నేడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి)