కేవలం ఒకే ఒక్క కుటుంబం కోసమే వారసత్వ రాజకీయాలు చేశారు
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శల జడి
లక్నోలో జాతీయ స్మారకం ‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్’ను ఆవిష్కరించిన ప్రధాని
లక్నో/న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ఆయన భారీ కాంస్య విగ్రహంతో కూడిన జాతీయ స్మారకం ‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్’ను లక్నోలో ఆవిష్కరించిన సందర్భంగా విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శల జడివాన కురిపించారు. దశాబ్దాలుగా అభివృద్ధికి అవరోధంగా తయారైన ‘ఆర్టీకల్ 370’గోడను బద్ధలు కొట్టే అదృష్టం తమ ప్రభుత్వానికి దక్కడంపై బీజేపీ ఎంతో గర్విస్తోందని మోదీ వ్యాఖ్యానించారు.
గురువారం లక్నోలో 65 అడుగుల ఎత్తయిన శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయీల కాంస్య విగ్రహాలను, 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తామర పుష్పాకృతిలో నిర్మించిన అత్యాధునిక మ్యూజియంను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. విపక్ష కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు.
‘‘బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సుపరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇప్పుడా సుపరిపాలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమున్నత శిఖరాలకు చేరింది. అయితే స్వాతంత్య్రం తర్వాత దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా, మంచి పనులు పూర్తియినా కేవలం ఒకే ఒక్క కుటుంబం(గాం«దీల) కారణంగా అవన్నీ జరిగాయనే భ్రమలు కల్పించారు.
పాఠ్యపుస్తకాలు కావొచ్చు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వరంగ సంస్థలు, వీధులు, రోడ్డు, కూడళ్లు.. అన్నింటికీ ఆ ఒకే ఒక్క కుటుంబం పేర్లు పెట్టేశారు. వాళ్ల విగ్రహాలే నెలకొల్పారు. ఇదే ఆనాటి నుంచి అలాగే కొనసాగింది. ఈ కుటుంబ బంధనాల నుంచి భారత్‌ను బీజేపీ విముక్తం చేసింది. దేశం కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడిన ప్రతి ఒక్క భరతమాత బిడ్డను బీజేపీ నేడు సమున్నత స్థాయిలో గౌరవిస్తోంది.
వీటికి కొన్ని ఉదాహరణలూ చెప్తా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఢిల్లీలో కీలక కర్తవ్యపథంలో ప్రతిష్టించాం. నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక దీవికి నేడు ఆయన పేరును పెట్టాం’’అని మోదీ అన్నారు. ‘‘బాబా సాహెబ్ అంబేడ్కర్ ఘనతను మరుగునపరిచే కుతంత్రాలను మీరంతా చూశారు. కాంగ్రెస్ రాజకుటుంబం ఢిల్లీలో ఎన్నో దారుణాలకు ఒడిగట్టింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అదే పనిచేసింది. అంబేడ్కర్ గొప్పతనాన్ని తగ్గించే కుట్రలను ఇప్పుడు బీజేపీ అడ్డుకుంటోంది.
ఢిల్లీ నుంచి లండన్ దాకా అంబేడ్కర్‌కు సంబంధించిన ఐదు పుణ్యక్షేత్రాలను మేం అద్భుతంగా అభివృద్ధిచేశాం’’అని మోదీ గుర్తుచేశారు. ‘‘బీజేపీని కాంగ్రెస్ ఎప్పుడూ అంటరాని పార్టీగా తప్పుడు ప్రచారంచేశాయి. కానీ బీజేపీ ఎల్లప్పుడూ అన్ని పార్టీలు, నేతలను గౌరవించింది. పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీలకు మేమే భారతరత్న ఇచ్చాం. ములాయం సింగ్ యాదవ్, తరుణ్ గొగోయ్ ఇలా ఎందర్నో గౌరవించాం. ఇలాంటి మర్యాదలను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నుంచి ఎన్నడూ ఆశించలేం. వాళ్ల హయాంలో బీజేపీ దారుణ అవమానాలను ఎదుర్కొంది’’అని మోదీ అన్నారు.
ఈ స్మారకం దేశ ఆత్మగౌరవానికి తార్కాణం
‘‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్ జాతీయ స్మారకం.. దేశం చూపిన ఆత్మగౌరవ, సమగ్రత, సేవా మార్గానికి నిదర్శనం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాళ్, వాజ్‌పేయీల నిలువెత్తు విగ్రహాలు మనకు సమున్నత స్ఫూర్తినిస్తున్నాయి. మనసావాచా ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని, ఆ ప్రయత్నంలో వందల సార్లయినా త్యాగాగ్నిలో కాలిపోయినా ఫర్వాలేదని గతంలో వాజ్‌పేయీ అన్నారు. ఇప్పుడీ ప్రేరణ స్థల్ సైతం అదే సందేశం ఇస్తోంది. మన ప్రతి అడుగు దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి.
అభివృద్ధి చెందిన భారత్‌గా దేశం మారాలంటే ప్రతి ఒక్కరూ ఆ దిశగా సంకల్పించాలి. నూతన జాతీయస్మారకం ద్వారా ఆధునిక స్ఫూర్తిస్థల్‌కు చిరునామాగా నిలిచిన యూపీకి శుభాకాంక్షలు. ఇప్పుడీ ప్రేరణ స్థల్ నిర్మించిన 30 ఎకరాల ప్రాంతంలో గతంలో దశాబ్దాలపాటు భారీ చెత్తకుప్పలుండేవి. వాటిని పూర్తిగా తొలగించి అధునాతన నేషనల్ మెమోరియల్ కాంప్లెక్స్‌ను సాకారంచేసిన కారి్మకులు, కళాకారులు, ప్రణాళిక కర్తలు, సీఎం యోగిజీకి నా మనస్ఫూర్తిగా అభినందనలు’’అని మోదీ అన్నారు.


