కప్ప బావ.. మ్యూజిక్‌ బ్యాండ్‌! | Success Through United Effort Kids Special And Short Story | Sakshi
Sakshi News home page

కప్ప బావ.. మ్యూజిక్‌ బ్యాండ్‌!

Jun 20 2026 1:49 PM | Updated on Jun 20 2026 1:49 PM

Success Through United Effort Kids Special And Short Story

కథ

కిడ్స్ స్పెషల్‌

టపటప వాన మొదలవగానే చింతచెట్టు కింద కప్ప బావ గొంతు సవరించుకున్నాడు. ‘బెక బెక బేక్‌’ అని పాట అందుకున్నాడు. ఆ శబ్దానికి నిద్రపోతున్న చీమల దండు ఉలిక్కిపడి బయటకొచ్చింది.

‘ఏంటి బావా ఈ గోల? అసలుకే మా పుట్టలోకి నీళ్లు ఎక్కడ వస్తాయోనని భయపడి చస్తుంటేను’ అని విసుక్కున్నాయి.
కప్ప బావ సిగ్గుపడ్డాడు. ‘సారీ చీమ పిల్లలూ. వాన వస్తే నాకు పాడాలనిపిస్తుంది’ అన్నాడు.

అప్పుడే నత్త గారు నెమ్మదిగా వచ్చారు. ‘బావా, నీ పాట బాగుంది కానీ ఒక్కడివే పాడితే ఎలా? మనమంతా కలిసి పాడుదాం’ అన్నారు.
వాన జోరందుకుంది. కప్ప బావ ‘బెక బెక’ డ్రమ్స్‌ వాయించాడు. నత్తగారి షెల్‌ మీద టపటపా పడ్డ వాన చినుకులు రిథమ్‌ ఇచ్చాయి. చీమలు క్యూ కట్టి ‘టిక్‌ టిక్‌’ అని చప్పట్లు కొట్టాయి. మిణుగురు పురుగులు లైటింగ్‌ ఇచ్చాయి. ఆ మ్యూజిక్‌ విని ఊరి పిల్లలంతా కిటికీల్లోంచి తొంగి చూశారు.

‘అరే, వానలో బ్యాండ్‌’ అని చప్పట్లు కొట్టారు. కాసేపటికి వాన తగ్గింది. చీమల పుట్ట సేఫ్‌. అందరూ హ్యాపీ. కప్ప బావ అన్నాడు, ‘చూశారా, ఒక్కడి గోల అందరికీ విసుగు. అందరూ కలిస్తేనే అది పండగ.’

ఆ రోజు నుంచి చింతకుంట పల్లెలో వాన పడిందంటే చాలు కప్ప బావ బ్యాండ్‌ మొదలయ్యేది. పిల్లలంతా కిటికీ దగ్గర కూర్చుని వింటూ కబుర్లు చెప్పుకునేవారు.
నీతి: కలిసి చేస్తే ఏ పనైనా పండగే, కష్టమైనా ఇష్టమవుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement