శ్రీవారి జ్యేష్ఠాభిషేకానికి వేళాయెరా! | Srivari Jyeshthabhishekam At Tirumala Tirupati Devasthanam | Sakshi
Sakshi News home page

శ్రీవారి జ్యేష్ఠాభిషేకానికి వేళాయెరా!

Jun 25 2026 7:54 AM | Updated on Jun 25 2026 7:54 AM

Srivari Jyeshthabhishekam At Tirumala Tirupati Devasthanam

అభిధ్యేయక అభిషేకం

స్నపన తిరుమంజనం

తిరుమలేశుడు ఉత్సవాల వేల్పు. నిత్యపూజలతోపాటు విశేష పూజలెన్నో జరుగుతుంటాయి. అలాంటి వాటిలో జ్యేష్ఠాభిషేకం ఒకటి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం రోజున ముగిసేలా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ‘అభిధ్యేయక అభిషేకం’ అని కూడా పిలుస్తారు.

ఏడాది పొడవునా జరిగే వివిధ ఉత్సవాలు, ఊరేగింపుల వల్ల శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, వాటి కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఈ 26 నుంచి 28 వరకు జ్యేష్ఠాభిషేకం జరగనున్న సందర్భంగా ఆ విశేషాలు.

ఏడాది పొడవునా స్వామివారి ఉత్సవమూర్తులకు ఉండే బంగారు కవచాన్ని ఈ ఉత్సవం మొదటి రోజున తొలగిస్తారు. కవచాలు లేని స్వామివారి నిజరూపాన్ని చూసే అరుదైన అవకాశం కేవలం ఈ సమయంలోనే భక్తులకు దక్కుతుంది.

స్నపన తిరుమంజనం: మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి ద్రవ్యాలతో వైభవంగా ‘స్నపన తిరుమంజనం’ (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి రోజూ స్వామివారికి వేర్వేరు కవచాలను సమర్పిస్తారు. శతాబ్దాల నాటి శ్రీ మలయప్ప స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ప్రతి ఏటా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ‘అభిధ్యేయక అభిషేకం‘ నిర్వహిస్తారు. – ఫొటోలు: కేతారి మోహన కృష్ణ, సాక్షి, తిరుపతి

ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు
మూడు రోజుల ముఖ్య కార్యక్రమాలు (జూన్‌ 26 – 28)

  • మొదటి రోజు (జూన్‌ 26, శుక్రవారం): స్వామివారికి ఏడాది పొడవునా ఉండే బంగారు కవచాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తారు. తిరుమంజనం అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరించి మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

  • రెండవ రోజు (జూన్‌ 27, శనివారం): ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన తర్వాత అత్యంత శోభాయమానంగా ముత్యాలకవచం సమర్పిస్తారు.

  • మూడవ రోజు (జూన్‌ 28, ఆదివారం): చివరి రోజు తిరుమంజన కార్యక్రమాలు పూర్తి చేసి, స్వామివారికి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని తిరిగి వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు తీయరు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement