తిండి ముప్పులు.. కడుపులో కల్తీబాంబు | Sakshi Funday Special Story: Adulterated Food Products Raise Serious Health Concerns | Sakshi
Sakshi News home page

తిండి ముప్పులు.. కడుపులో కల్తీబాంబు

Oct 4 2026 12:17 AM | Updated on Oct 4 2026 12:18 AM

Sakshi Funday Special Story: Adulterated Food Products Raise Serious Health Concerns

ఒకప్పుడు మనుషులు తిండి కోసం తిప్పలు పడేవారు. తిండి కోసం తిప్పలు జనాభాలో అత్యధికులకు ఇప్పటికీ తప్పడం లేదు గాని, ఇప్పుడు తిండితోనే తిప్పలు వచ్చిపడుతున్నాయి. ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్పడం ఎంత కష్టమో, ఏ ఆహార పదార్థంలో ఏ ముప్పు దాగి ఉందో చెప్పడం కూడా అంతే కష్టం! ఆహార పదార్థాల కల్తీ మన దేశవ్యాప్త సమస్యగా మారింది. కల్తీ ఆహారం తినడం వల్ల వ్యాధుల బారినపడి, జనాలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇక ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు ఏమంత సురక్షితంగా ఉంటున్నాయా అంటే, అదీ లేదు. తిండితో జనాలు పడుతున్న తిప్పలు, కల్తీకి తోడుగా ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలలో దాగి ఉన్న ముప్పుల గురించి ఈ ప్రత్యేక కథనం...

ఆహార కల్తీ మన దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య. కల్తీరాయుళ్లు విచ్చలవిడిగా సాగిస్తున్న కల్తీల వల్ల వినియోగదారులు మోసపోవడం ఒక్కటి మాత్రమే సమస్యకాదు, ఇది ప్రజారోగ్యానికి పెనుప్రమాదంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 86.6 కోట్ల మంది ఆహార కల్తీ కారణంగా ఆస్పత్రుల పాలవుతుంటే, వారిలో దాదాపు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా. చాలా దేశాలు ఆహార కల్తీ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారిపైన, ఆహార కల్తీ మరణాలపైన ప్రత్యేకంగా లెక్కలు సేకరించడం లేదు. కాబట్టి ఆహార కల్తీ మరణాల సంఖ్య డబ్ల్యూహెచ్‌వో అంచనాలకు మించే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆహార కల్తీ వల్ల ఆస్పత్రుల పాలవుతున్న వారిపై, ఆహార కల్తీ మరణాలపై మన దేశంలో ఎలాంటి అధికారిక లెక్కలూ అందుబాటులో లేవు. పెద్దసంఖ్యలో ఆహార కల్తీ వల్ల జనాలు ఆస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో వెలువడే వార్తా కథనాలు తప్ప ఈ అంశంపై పూర్తిస్థాయిలో అధికారికమైన లెక్కలేవీ అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా ఉంటోంది. అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో మన దేశమే మొదటిస్థానంలో ఉందంటే, పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే!

అన్నిట్లోనూ కల్తీలే
మన దేశంలో దాదాపు అన్ని ఆహార పదార్థాల్లోనూ కల్తీలు జరుగుతున్నాయి. ఆహార పదార్థాల కల్తీ కోసం వాడే పదార్థాల్లో కొన్ని ప్రమాదకరమైన పదార్థాలు కూడా ఉంటున్నాయి. పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, వంటనూనెలు, తేనె, చక్కెర, బెల్లం, టీ, కాఫీ, పండ్లు, కూరగాయలు, మాంసం, పసుపుపొడి, కారంపొడి, జీలకర్ర, మిరియాలు, ఇంగువ వంటి పదార్థాల్లో తరచు కల్తీలు బయటపడుతున్నాయి. అంతకంటే దారుణమేమిటంటే, దేశంలో కొన్నిచోట్ల ఉప్పును కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీరాయుళ్లు ఏయే పదార్థాలను వేటితో కల్తీ చేస్తున్నారంటే...

పప్పులు
కందిపప్పు, శనగపప్పుల్లో చౌకైన కేసరిపప్పును, రంగు బాగా కనిపించడానికి మెటానిల్‌ యెల్లో, లెడ్‌ క్రోమైట్‌ వంటి ప్రమాదకరమైన రసాయనిక రంగులు కలుపుతున్నారు. ఇతర పప్పుల్లోనూ కాలంచెల్లిన పప్పులను, ఇసుక, రాళ్లు వంటివి కలుపుతున్నారు.

పసుపుపొడి 
వంటకాల్లో తరచుగా వాడే పసుపుపొడిలో కృత్రిమ రంగులు, సుద్దపొడి మాత్రమే కాకుండా, లెడ్‌ క్రోమైట్‌ వంటి ప్రమాదకరమైన పదార్థాలు కూడా కలుపుతున్నారు.

కారంపొడి
కారంపొడిలో కర్రపొట్టు, ఇటుక పొడి, చౌకబారు పొడి పదార్థాలు, తౌడు, కృత్రిమ రంగులు, కొన్ని సందర్భాల్లో సుడాన్‌ రెడ్, రోడమైన్‌–బి వంటి క్యాన్సర్‌కు దారితీసే పదార్థాలను కూడా కలుపుతున్నారు.

పాలు 
మన దేశంలో అత్యధికంగా కల్తీకి లోనవుతున్న పదార్థం పాలు. పాలలో నీళ్లు కలపడం చాలాకాలంగా తెలిసిన కల్తీ పద్ధతి. ఇటీవలి కాలంలో కల్తీరాయుళ్లు మరింత మితిమీరి, పాలలో పాల విరుగు, యూరియా, డిటర్జెంట్లు, ఫార్మాలిన్‌ వంటి వాటిని కలుపుతున్నారు.

పాల ఉత్పత్తులు
వెన్నలోను, నెయ్యిలోను చౌకగా దొరికే వనస్పతి, పామాయిల్, స్టార్చ్, కృత్రిమ రసాయనిక రంగులు, జంతువుల కొవ్వులు కలుపుతున్నారు. పనీర్‌లో స్టార్చ్, మైదా, పామాయిల్, యూరియా, డిటర్జెంట్లు, ప్రిజర్వేటివ్స్‌ వంటి కలుపుతున్నారు. కోవాలో పామాయిల్, యూరియా వంటి రసాయనాలతో పాటు సుద్దపొడిని కూడా కలుపుతున్నారు.

వంటనూనెలు తరచుగా వాడే వంటనూనెల్లో చౌకబారు నూనెలు, కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన నూనెలను కలుపుతున్నారు. ఆవనూనెను ప్రమాదకరమైన ఆర్గెమాన్‌ నూనెతో కల్తీ చేస్తున్నారు. కొబ్బరినూనెలో పామాయిల్, పారాఫిన్‌ ఆయిల్‌ వంటివి కలుపుతున్నారు. శనగనూనెలో పామాయిల్, సోయాబీన్‌ ఆయిల్, పత్తినూనె, పొద్దుతిరుగుడు నూనె కలుపుతున్నారు. నువ్వులనూనెలో పామాయిల్, రేప్‌సీడ్‌ ఆయిల్, పత్తినూనె, పొద్దుతిరుగుడు నూనె కలుపుతున్నారు. ఆలివ్‌ నూనెను పామాయిల్, పత్తినూనె, కనోలా ఆయిల్‌ వంటి వాటితో కల్తీ చేస్తున్నారు.

తేనె 
ఆరోగ్యానికి మంచిదని చాలామంది తేనెను వాడుతుంటారు. ఆయుర్వేద ఔషధాలకు తేనెను అనుపానంగా వాడుతుంటారు. కల్తీరాయుళ్లు తేనెను చక్కెర సిరప్, కార్న్‌ సిరప్, బీట్‌రూట్‌ సిరప్, నీరు వంటి వాటితో కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీల వల్ల తేనె ఆరోగ్యానికి అనర్థకరంగా మారుతోంది.

టీ, కాఫీ: ఉదయం నిద్రలేవగానే చాలామంది టీ లేదా కాఫీతో దినచర్యను ప్రారంభిస్తారు. చివరకు ఇవి కూడా కల్తీ బారిన పడుతున్నాయి. టీ పొడిలో వాడేసిన టీ పొడిని, టార్ట్రాజైన్‌ వంటి ప్రమాదకరమైన రంగులు వేసిన ఇతర ఆకుల పొడిని కలుపుతున్నారు. కాఫీలో ఎక్కువగా చికొరీ కలుపుతారు. చికొరీ కలిపిన కాఫీని కూడా వందశాతం కాఫీగా అమ్మేస్తుండటం మామూలే! ఇటీవలి కాలంలో కాఫీలో చింతపిక్కల పొడి, ఖర్జూర గింజల పొడి, కర్రపొట్టు, మెత్తని మట్టిపొడి కూడా కలుపుతున్నారు.

మిరియాలు, జీలకర్ర, ఇంగువ
వంటిళ్లలో నిత్యంవాడే దినుసుల్లోనూ కల్తీలు జరుగుతున్నాయి. జీలకర్రలో ఇతర విత్తనాలు, రంగులు; ఇంగువలో చెట్ల జిగురు, చౌకైన పిండి పదార్థాలు; మిరియాలలో బొప్పాయి గింజలు, చౌకైన ఇతర గింజలు కలుపుతున్నారు.

కూరగాయలు 
రోజూ తినే కూరగాయలను కూడా కల్తీరాయుళ్లు వదలడం లేదు. కూరగాయలు తాజాగా నవనవలాడుతూ కనిపించడానికి వాటిని మైలుతుత్తం నీటిలో ముంచి ఆరబెట్టడం, అవి మరింత పచ్చగా కనిపించడానికి మెలకైట్‌ గ్రీన్‌ వంటి రంగులు వేస్తున్నారు. కూరగాయల కోతకు ముందే, అవి మరింత బరువుగా ఎదగడానికి ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నారు.

పండ్లు
పండ్లు త్వరగా పండేలా చేయడానికి క్యాల్షియం కార్బైడ్‌ వాడుతున్నారు. పండ్ల రంగు ఆకర్షణీయంగా కనిపించడానికి కృత్రిమ రంగులు పూస్తున్నారు. యాపిల్‌ వంటి పండ్లకు కృత్రిమ కొవ్వుపూత పూస్తున్నారు. పుచ్చకాయలు, గుమ్మడికాయలు వంటివి మరింత పరిమాణంలో ఎదగడానికి కోతకు ముందే వాటికి ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నారు.

మాంసం
మాంసంలో కల్తీలు రకరకాలుగా జరుగుతాయి. ఖరీదైన మటన్‌ వంటి వాటిలో చౌకగా దొరికే ఇతర జంతువుల మాంసం చేర్చడం; పూర్తిగా మాంసం ఉండాల్సిన కీమా, కోఫ్తా వంటి వాటిలో పేగులు, ఊపిరితిత్తులు వంటి ఇతర అవయవాల తునకలు కలపడం వంటివి చేస్తుంటారు. ఇవే కాకుండా, మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, చెడిపోయిన మాంసం తాజాగా కనిపించడానికి రకరకాల రసాయనిక పదార్థాలు, కృత్రిమ రంగులు కలిపి కల్తీ చేస్తున్నారు.

ప్యాకేజ్డ్‌ పదార్థాల్లోనూ ప్రమాదాలు
బయట వండిన పదార్థాల కంటే ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులు సురక్షితమైనదని చాలామంది భావిస్తారు. ప్యాకేజ్డ్‌ పదార్థాలు ఏమంత సురక్షితమైనవి కావని ఆధునిక పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. అందుకే ప్యాకేజ్డ్‌ పదార్థాల ప్యాకెట్ల లేబుల్‌ ముందువైపు హెచ్చరికలు ముద్రించడాన్ని తప్పనిసరి చేయాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రతిపాదిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. కోర్టు తీర్పు వెలువడితే ప్యాకేజ్డ్‌ పదార్థాలపై హెచ్చరికల ముద్రణ తప్పనిసరిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ప్యాకేజ్డ్‌ ఉత్పత్తుల్లో ప్రమాదాలు ఏముంటాయని చాలామంది అనుకుంటారు గాని, ఇవీ అసలు
ప్రమాదాలు...

⇒ ఫాస్ఫేట్‌ ఎడిటివ్స్‌/ పాలీ ఫాస్ఫేట్స్‌: చీజ్, ప్రాసెస్డ్‌ మాంసం, పానీయాలలో సోడియం ఫాస్ఫేట్‌ వంటి పాలీ ఫాస్ఫేట్స్‌ను కలుపుతారు. వీటిని కలిపిన పదార్థాల్లో తేమశాతం ఎక్కువకాలం నిలిచి ఉండి, అవి తాజాగా ఉన్నట్లు కనిపిస్తాయి. 
ప్రమాదం: ఇవి మోతాదుకు మించి శరీరంలోకి చేరితే కిడ్నీలను దెబ్బతీస్తాయి.

⇒ కార్న్‌/ గ్లూకోజ్‌ సిరప్‌: ఫ్రక్టోజ్‌ అత్యధిక మోతాదులో ఉండే కార్న్‌ సిరప్, గ్లూకోజ్‌ సిరప్‌లను ఎక్కువగా శీతల పానీయాల్లోను, సాస్‌లలోను, ఐస్‌క్రీముల్లోను, ప్రాసెస్డ్‌ తీపి చిరుతిళ్లలోను కలుపుతారు. ఇవి పదార్థాలకు తీపి రుచిని కలిగిస్తాయి.
ప్రమాదం: ఇవి మోతాదుకు మించితే శరీరంలో ఇన్సులిన్‌ స్థాయి అదుపు తప్పుతుంది. డయాబెటిస్‌ ముప్పు ఏర్పడుతుంది. శరీరంలోని జీవక్రియలు అస్తవ్యస్తంగా మారుతాయి.

⇒ మాల్టో డెక్ట్స్రిన్‌: ఇది శరవేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌. దీనిని ఎక్కువగా ప్రొటీన్‌ పౌడర్లు, సాస్‌లు, ఇన్‌స్టంట్‌ ఆహార ఉత్పత్తులు, చిరుతిళ్లలో కలుపుతారు. దీనిని కలపడం వల్ల పదార్థాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ప్రమాదం: వీటిని తీసుకున్నాక శరీరంలో చక్కెర స్థాయి అమాంతంగా పెరుగుతుంది. ఇన్సులిన్‌ స్థాయి అదుపు తప్పుతుంది. మాల్టో డెక్ట్స్రిన్‌ కలిపిన ఉత్పత్తుల లేబుల్స్‌పై ‘చక్కెర’ ఉన్నట్లు కనిపించదు. కాని, ఇది డయాబెటిస్‌ ముప్పు కలిగిస్తుంది.

⇒ సుక్రలోజ్‌: చక్కెరకు బదులుగా ‘సుగర్‌–ఫ్రీ’ ఉత్పత్తుల్లో ఎక్కువగా దీనిని వాడతారు. ‘జీరో సుగర్‌’, ‘డైట్‌’ పేర్లతో వచ్చే శీతల పానీయాల్లోను, ప్రొటీన్‌ పానీయాల్లోను, ఐస్‌క్రీముల్లోను దీనిని కలుపుతారు. 
ప్రమాదం: దీర్ఘకాలికంగా వాడితే దీనివల్ల శరీరంలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరిగి, డయాబెటిస్‌ వస్తుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది.

⇒ అస్పార్టేమ్‌: ఇది అతి తక్కువ కేలరీలు కలిగిన చక్కెర ప్రత్యామ్నాయం. కేవలం రెండు అమినో యాసిడ్లతో మాత్రమే తయారయ్యే ఈ పదార్థాన్ని డైట్‌ పానీయాలు, సుగర్‌ఫ్రీ పానీయాలు, చ్యూయింగ్‌ గమ్స్‌ వంటి వాటిలో కలుపుతారు.
ప్రమాదం: ఇది మోతాదు మించితే శరీరంలోని జీవక్రియలను అస్తవ్యస్తం చేస్తుంది. దీర్ఘకాలిక వినియోగం డయాబెటిస్‌ను కూడా కలిగించే అవకాశం ఉంటుంది.

⇒ ఎసిసల్ఫేమ్‌–కె: దీనినే ఏసీ–కే అని కూడా అంటారు. ఇది చక్కెర కంటే రెండువందల రెట్లు ఎక్కువ తీపి కలిగించే పదార్థం. దీనిని ఎక్కువగా డైట్‌ పానీయాలు, ప్రొటీన్‌ పానీయాలు, పౌడర్లు వంటి వాటిలో ఉపయోగిస్తారు.
ప్రమాదం: ఇది శరీరంలో జీవక్రియలను, జీర్ణవ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. బరువు పెరిగే అవకాశాలను పెంచుతుంది. ఇది మోతాదు మించితే క్యాన్సర్‌కు, కిడ్నీవ్యాధులకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి.

⇒ ఎరిథ్రిటాల్‌: ఇది సుగర్‌ ఆల్కహాల్‌. తీపిగా ఉన్నా తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువగా ‘డైట్‌’, ‘సుగర్‌ఫ్రీ’ పానీయాలు, ప్రొటీన్‌ పౌడర్లలో వాడతారు. 
ప్రమాదం: ఇది తీసుకోవడం వల్ల శరీరంలోని ప్లేట్‌లెట్స్‌ అతిగా స్పందించి, రక్తం వేగంగా గడ్డకడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, గుండెజబ్బులు, మెదడులో రక్తంగడ్డ కట్టే అవకాశాలు పెరుగుతాయి.

⇒ కార్బాక్సీమీథైల్‌ సెల్యులోజ్‌: దీనిని ఎక్కువగా ప్రాసెస్డ్‌ చీజ్, మాంసం ఉత్పత్తుల్లో వాడతారు. ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు, పానీయాల్లోను ఉపయోగిస్తారు. దీనివల్ల ఉత్పత్తులు ఎక్కువకాలం తాజాగా కనిపిస్తాయి.
ప్రమాదం: ఇది మోతాదు మించితే కిడ్నీలను దెబ్బతీస్తుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, విరోచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అరుదుగా కొందరికి అలెర్జీలు కలిగే అవకాశాలు ఉంటాయి.

⇒ పాలీసార్బేట్‌: ఇది ఎమల్సిఫైయర్‌. నీరు, నూనె ఒకదానిలో ఒకటి కలిసిపోయేలా చేస్తుంది. దీనిని ఎక్కువగా సాస్‌లు, మయోనైజ్, ఐస్‌క్రీమ్‌లు వంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు.
ప్రమాదం: ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కొందరిలో అలర్జీలు, కళ్లలో మంట కలిగిస్తుంది. దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలు, కాలేయ సమస్యలు కలిగిస్తుంది.

⇒ క్యారజీనన్‌: దీనిని సముద్రంలో దొరికే ఎర్రనాచు నుంచి తయారు చేస్తారు. చిక్కదనం కలిగించే ఈ పదార్థాన్ని ఎక్కువగా పాల ఉత్పత్తుల్లోను, సాస్‌లు, ఐస్‌క్రీమ్‌ల తయారీలోను వాడతారు.
ప్రమాదం: దీనివల్ల కడుపు ఉబ్బరం, పేగుల వాపు సహా రకరకాల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియలు అస్తవ్యస్తంగా మారి డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్‌ను కలిగించవచ్చని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

⇒ సోడియం నైట్రైట్‌: దీనిని ఎక్కువగా ప్రాసెస్డ్‌ మాంసం ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఉత్పత్తులు ఎక్కువకాలం నిలవ ఉంటాయి.
ప్రమాదం: దీనివల్ల శరీరంలోని కణజాలానికి తగిన మోతాదులో ఆక్సిజన్‌ అందదు. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మోతాదు మించితే క్యాన్సర్‌ ముప్పును కూడా కలిగిస్తుంది.

⇒ మోడిఫైడ్‌ స్టార్చ్‌లు: పారిశ్రామిక వినియోగం కోసం మొక్కజొన్న, బంగాళదుంపలు, గోధుమల నుంచి తీసిన పిండి పదార్థాన్ని రసాయనాలతో శుద్ధి చేసి వీటిని తయారు చేస్తారు. వీటిని ఎక్కువగా సూప్‌ పౌడర్లు, సాస్‌లు, ఐస్‌క్రీమ్‌లు వంటి వాటిలో వాడతారు.
ప్రమాదం: ఇవి శరీరంలోని చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. ఇన్సులిన్‌ నిరోధకతను పెంచి డయాబెటిస్‌ ముప్పు కలిగిస్తాయి. స్థూలకాయం, జీర్ణసమస్యలు, అలర్జీలు కూడా కలిగిస్తాయి.

సురక్షితమైన ఆహారం మనుషుల ప్రాథమిక హక్కు. కాని, మనుషులకు అదే కరవవుతోంది. వీధిపక్కన ఉండే టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు మొదలుకొని ఖరీదైన రెస్టరెంట్ల వరకు ప్రతిచోటా ఆహార కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల్లోనైతే కనిపించని ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. పెరటి పంటలు, ఇంటి వంటలు తప్ప మరేవీ సంపూర్ణ సురక్షితంగా ఉండటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారే అనుదిన ఆహారగండాలను గట్టెక్కడానికి ప్రయత్నించాలి. లేకుంటే, ఆస్పత్రులకు భారీ బిల్లులు చెల్లించక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement