breaking news
Chemical substances
-
తిండి ముప్పులు.. కడుపులో కల్తీబాంబు
ఒకప్పుడు మనుషులు తిండి కోసం తిప్పలు పడేవారు. తిండి కోసం తిప్పలు జనాభాలో అత్యధికులకు ఇప్పటికీ తప్పడం లేదు గాని, ఇప్పుడు తిండితోనే తిప్పలు వచ్చిపడుతున్నాయి. ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్పడం ఎంత కష్టమో, ఏ ఆహార పదార్థంలో ఏ ముప్పు దాగి ఉందో చెప్పడం కూడా అంతే కష్టం! ఆహార పదార్థాల కల్తీ మన దేశవ్యాప్త సమస్యగా మారింది. కల్తీ ఆహారం తినడం వల్ల వ్యాధుల బారినపడి, జనాలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇక ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు ఏమంత సురక్షితంగా ఉంటున్నాయా అంటే, అదీ లేదు. తిండితో జనాలు పడుతున్న తిప్పలు, కల్తీకి తోడుగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలలో దాగి ఉన్న ముప్పుల గురించి ఈ ప్రత్యేక కథనం...ఆహార కల్తీ మన దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య. కల్తీరాయుళ్లు విచ్చలవిడిగా సాగిస్తున్న కల్తీల వల్ల వినియోగదారులు మోసపోవడం ఒక్కటి మాత్రమే సమస్యకాదు, ఇది ప్రజారోగ్యానికి పెనుప్రమాదంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 86.6 కోట్ల మంది ఆహార కల్తీ కారణంగా ఆస్పత్రుల పాలవుతుంటే, వారిలో దాదాపు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. చాలా దేశాలు ఆహార కల్తీ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారిపైన, ఆహార కల్తీ మరణాలపైన ప్రత్యేకంగా లెక్కలు సేకరించడం లేదు. కాబట్టి ఆహార కల్తీ మరణాల సంఖ్య డబ్ల్యూహెచ్‌వో అంచనాలకు మించే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఆహార కల్తీ వల్ల ఆస్పత్రుల పాలవుతున్న వారిపై, ఆహార కల్తీ మరణాలపై మన దేశంలో ఎలాంటి అధికారిక లెక్కలూ అందుబాటులో లేవు. పెద్దసంఖ్యలో ఆహార కల్తీ వల్ల జనాలు ఆస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో వెలువడే వార్తా కథనాలు తప్ప ఈ అంశంపై పూర్తిస్థాయిలో అధికారికమైన లెక్కలేవీ అందుబాటులో లేకపోవడం కూడా సమస్యగా ఉంటోంది. అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో మన దేశమే మొదటిస్థానంలో ఉందంటే, పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే!అన్నిట్లోనూ కల్తీలేమన దేశంలో దాదాపు అన్ని ఆహార పదార్థాల్లోనూ కల్తీలు జరుగుతున్నాయి. ఆహార పదార్థాల కల్తీ కోసం వాడే పదార్థాల్లో కొన్ని ప్రమాదకరమైన పదార్థాలు కూడా ఉంటున్నాయి. పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, వంటనూనెలు, తేనె, చక్కెర, బెల్లం, టీ, కాఫీ, పండ్లు, కూరగాయలు, మాంసం, పసుపుపొడి, కారంపొడి, జీలకర్ర, మిరియాలు, ఇంగువ వంటి పదార్థాల్లో తరచు కల్తీలు బయటపడుతున్నాయి. అంతకంటే దారుణమేమిటంటే, దేశంలో కొన్నిచోట్ల ఉప్పును కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీరాయుళ్లు ఏయే పదార్థాలను వేటితో కల్తీ చేస్తున్నారంటే...పప్పులుకందిపప్పు, శనగపప్పుల్లో చౌకైన కేసరిపప్పును, రంగు బాగా కనిపించడానికి మెటానిల్ యెల్లో, లెడ్ క్రోమైట్ వంటి ప్రమాదకరమైన రసాయనిక రంగులు కలుపుతున్నారు. ఇతర పప్పుల్లోనూ కాలంచెల్లిన పప్పులను, ఇసుక, రాళ్లు వంటివి కలుపుతున్నారు.పసుపుపొడి వంటకాల్లో తరచుగా వాడే పసుపుపొడిలో కృత్రిమ రంగులు, సుద్దపొడి మాత్రమే కాకుండా, లెడ్ క్రోమైట్ వంటి ప్రమాదకరమైన పదార్థాలు కూడా కలుపుతున్నారు.కారంపొడికారంపొడిలో కర్రపొట్టు, ఇటుక పొడి, చౌకబారు పొడి పదార్థాలు, తౌడు, కృత్రిమ రంగులు, కొన్ని సందర్భాల్లో సుడాన్ రెడ్, రోడమైన్–బి వంటి క్యాన్సర్‌కు దారితీసే పదార్థాలను కూడా కలుపుతున్నారు.పాలు మన దేశంలో అత్యధికంగా కల్తీకి లోనవుతున్న పదార్థం పాలు. పాలలో నీళ్లు కలపడం చాలాకాలంగా తెలిసిన కల్తీ పద్ధతి. ఇటీవలి కాలంలో కల్తీరాయుళ్లు మరింత మితిమీరి, పాలలో పాల విరుగు, యూరియా, డిటర్జెంట్లు, ఫార్మాలిన్ వంటి వాటిని కలుపుతున్నారు.పాల ఉత్పత్తులువెన్నలోను, నెయ్యిలోను చౌకగా దొరికే వనస్పతి, పామాయిల్, స్టార్చ్, కృత్రిమ రసాయనిక రంగులు, జంతువుల కొవ్వులు కలుపుతున్నారు. పనీర్‌లో స్టార్చ్, మైదా, పామాయిల్, యూరియా, డిటర్జెంట్లు, ప్రిజర్వేటివ్స్ వంటి కలుపుతున్నారు. కోవాలో పామాయిల్, యూరియా వంటి రసాయనాలతో పాటు సుద్దపొడిని కూడా కలుపుతున్నారు.వంటనూనెలు తరచుగా వాడే వంటనూనెల్లో చౌకబారు నూనెలు, కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన నూనెలను కలుపుతున్నారు. ఆవనూనెను ప్రమాదకరమైన ఆర్గెమాన్ నూనెతో కల్తీ చేస్తున్నారు. కొబ్బరినూనెలో పామాయిల్, పారాఫిన్ ఆయిల్ వంటివి కలుపుతున్నారు. శనగనూనెలో పామాయిల్, సోయాబీన్ ఆయిల్, పత్తినూనె, పొద్దుతిరుగుడు నూనె కలుపుతున్నారు. నువ్వులనూనెలో పామాయిల్, రేప్‌సీడ్ ఆయిల్, పత్తినూనె, పొద్దుతిరుగుడు నూనె కలుపుతున్నారు. ఆలివ్ నూనెను పామాయిల్, పత్తినూనె, కనోలా ఆయిల్ వంటి వాటితో కల్తీ చేస్తున్నారు.తేనె ఆరోగ్యానికి మంచిదని చాలామంది తేనెను వాడుతుంటారు. ఆయుర్వేద ఔషధాలకు తేనెను అనుపానంగా వాడుతుంటారు. కల్తీరాయుళ్లు తేనెను చక్కెర సిరప్, కార్న్ సిరప్, బీట్రూట్ సిరప్, నీరు వంటి వాటితో కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీల వల్ల తేనె ఆరోగ్యానికి అనర్థకరంగా మారుతోంది.టీ, కాఫీ: ఉదయం నిద్రలేవగానే చాలామంది టీ లేదా కాఫీతో దినచర్యను ప్రారంభిస్తారు. చివరకు ఇవి కూడా కల్తీ బారిన పడుతున్నాయి. టీ పొడిలో వాడేసిన టీ పొడిని, టార్ట్రాజైన్ వంటి ప్రమాదకరమైన రంగులు వేసిన ఇతర ఆకుల పొడిని కలుపుతున్నారు. కాఫీలో ఎక్కువగా చికొరీ కలుపుతారు. చికొరీ కలిపిన కాఫీని కూడా వందశాతం కాఫీగా అమ్మేస్తుండటం మామూలే! ఇటీవలి కాలంలో కాఫీలో చింతపిక్కల పొడి, ఖర్జూర గింజల పొడి, కర్రపొట్టు, మెత్తని మట్టిపొడి కూడా కలుపుతున్నారు.మిరియాలు, జీలకర్ర, ఇంగువవంటిళ్లలో నిత్యంవాడే దినుసుల్లోనూ కల్తీలు జరుగుతున్నాయి. జీలకర్రలో ఇతర విత్తనాలు, రంగులు; ఇంగువలో చెట్ల జిగురు, చౌకైన పిండి పదార్థాలు; మిరియాలలో బొప్పాయి గింజలు, చౌకైన ఇతర గింజలు కలుపుతున్నారు.కూరగాయలు రోజూ తినే కూరగాయలను కూడా కల్తీరాయుళ్లు వదలడం లేదు. కూరగాయలు తాజాగా నవనవలాడుతూ కనిపించడానికి వాటిని మైలుతుత్తం నీటిలో ముంచి ఆరబెట్టడం, అవి మరింత పచ్చగా కనిపించడానికి మెలకైట్ గ్రీన్ వంటి రంగులు వేస్తున్నారు. కూరగాయల కోతకు ముందే, అవి మరింత బరువుగా ఎదగడానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు.పండ్లుపండ్లు త్వరగా పండేలా చేయడానికి క్యాల్షియం కార్బైడ్ వాడుతున్నారు. పండ్ల రంగు ఆకర్షణీయంగా కనిపించడానికి కృత్రిమ రంగులు పూస్తున్నారు. యాపిల్ వంటి పండ్లకు కృత్రిమ కొవ్వుపూత పూస్తున్నారు. పుచ్చకాయలు, గుమ్మడికాయలు వంటివి మరింత పరిమాణంలో ఎదగడానికి కోతకు ముందే వాటికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు.మాంసంమాంసంలో కల్తీలు రకరకాలుగా జరుగుతాయి. ఖరీదైన మటన్ వంటి వాటిలో చౌకగా దొరికే ఇతర జంతువుల మాంసం చేర్చడం; పూర్తిగా మాంసం ఉండాల్సిన కీమా, కోఫ్తా వంటి వాటిలో పేగులు, ఊపిరితిత్తులు వంటి ఇతర అవయవాల తునకలు కలపడం వంటివి చేస్తుంటారు. ఇవే కాకుండా, మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, చెడిపోయిన మాంసం తాజాగా కనిపించడానికి రకరకాల రసాయనిక పదార్థాలు, కృత్రిమ రంగులు కలిపి కల్తీ చేస్తున్నారు.ప్యాకేజ్డ్ పదార్థాల్లోనూ ప్రమాదాలుబయట వండిన పదార్థాల కంటే ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు సురక్షితమైనదని చాలామంది భావిస్తారు. ప్యాకేజ్డ్ పదార్థాలు ఏమంత సురక్షితమైనవి కావని ఆధునిక పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. అందుకే ప్యాకేజ్డ్ పదార్థాల ప్యాకెట్ల లేబుల్ ముందువైపు హెచ్చరికలు ముద్రించడాన్ని తప్పనిసరి చేయాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రతిపాదిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. కోర్టు తీర్పు వెలువడితే ప్యాకేజ్డ్ పదార్థాలపై హెచ్చరికల ముద్రణ తప్పనిసరిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ప్యాకేజ్డ్ ఉత్పత్తుల్లో ప్రమాదాలు ఏముంటాయని చాలామంది అనుకుంటారు గాని, ఇవీ అసలుప్రమాదాలు...⇒ ఫాస్ఫేట్ ఎడిటివ్స్/ పాలీ ఫాస్ఫేట్స్: చీజ్, ప్రాసెస్డ్ మాంసం, పానీయాలలో సోడియం ఫాస్ఫేట్ వంటి పాలీ ఫాస్ఫేట్స్ను కలుపుతారు. వీటిని కలిపిన పదార్థాల్లో తేమశాతం ఎక్కువకాలం నిలిచి ఉండి, అవి తాజాగా ఉన్నట్లు కనిపిస్తాయి. ప్రమాదం: ఇవి మోతాదుకు మించి శరీరంలోకి చేరితే కిడ్నీలను దెబ్బతీస్తాయి.⇒ కార్న్/ గ్లూకోజ్ సిరప్: ఫ్రక్టోజ్ అత్యధిక మోతాదులో ఉండే కార్న్ సిరప్, గ్లూకోజ్ సిరప్‌లను ఎక్కువగా శీతల పానీయాల్లోను, సాస్లలోను, ఐస్క్రీముల్లోను, ప్రాసెస్డ్ తీపి చిరుతిళ్లలోను కలుపుతారు. ఇవి పదార్థాలకు తీపి రుచిని కలిగిస్తాయి.ప్రమాదం: ఇవి మోతాదుకు మించితే శరీరంలో ఇన్సులిన్ స్థాయి అదుపు తప్పుతుంది. డయాబెటిస్ ముప్పు ఏర్పడుతుంది. శరీరంలోని జీవక్రియలు అస్తవ్యస్తంగా మారుతాయి.⇒ మాల్టో డెక్ట్స్రిన్: ఇది శరవేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్. దీనిని ఎక్కువగా ప్రొటీన్ పౌడర్లు, సాస్‌లు, ఇన్స్టంట్ ఆహార ఉత్పత్తులు, చిరుతిళ్లలో కలుపుతారు. దీనిని కలపడం వల్ల పదార్థాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.ప్రమాదం: వీటిని తీసుకున్నాక శరీరంలో చక్కెర స్థాయి అమాంతంగా పెరుగుతుంది. ఇన్సులిన్ స్థాయి అదుపు తప్పుతుంది. మాల్టో డెక్ట్స్రిన్ కలిపిన ఉత్పత్తుల లేబుల్స్‌పై ‘చక్కెర’ ఉన్నట్లు కనిపించదు. కాని, ఇది డయాబెటిస్ ముప్పు కలిగిస్తుంది.⇒ సుక్రలోజ్: చక్కెరకు బదులుగా ‘సుగర్–ఫ్రీ’ ఉత్పత్తుల్లో ఎక్కువగా దీనిని వాడతారు. ‘జీరో సుగర్’, ‘డైట్’ పేర్లతో వచ్చే శీతల పానీయాల్లోను, ప్రొటీన్ పానీయాల్లోను, ఐస్క్రీముల్లోను దీనిని కలుపుతారు. ప్రమాదం: దీర్ఘకాలికంగా వాడితే దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి, డయాబెటిస్ వస్తుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది.⇒ అస్పార్టేమ్: ఇది అతి తక్కువ కేలరీలు కలిగిన చక్కెర ప్రత్యామ్నాయం. కేవలం రెండు అమినో యాసిడ్లతో మాత్రమే తయారయ్యే ఈ పదార్థాన్ని డైట్ పానీయాలు, సుగర్‌ఫ్రీ పానీయాలు, చ్యూయింగ్ గమ్స్ వంటి వాటిలో కలుపుతారు.ప్రమాదం: ఇది మోతాదు మించితే శరీరంలోని జీవక్రియలను అస్తవ్యస్తం చేస్తుంది. దీర్ఘకాలిక వినియోగం డయాబెటిస్‌ను కూడా కలిగించే అవకాశం ఉంటుంది.⇒ ఎసిసల్ఫేమ్–కె: దీనినే ఏసీ–కే అని కూడా అంటారు. ఇది చక్కెర కంటే రెండువందల రెట్లు ఎక్కువ తీపి కలిగించే పదార్థం. దీనిని ఎక్కువగా డైట్ పానీయాలు, ప్రొటీన్ పానీయాలు, పౌడర్లు వంటి వాటిలో ఉపయోగిస్తారు.ప్రమాదం: ఇది శరీరంలో జీవక్రియలను, జీర్ణవ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. బరువు పెరిగే అవకాశాలను పెంచుతుంది. ఇది మోతాదు మించితే క్యాన్సర్‌కు, కిడ్నీవ్యాధులకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి.⇒ ఎరిథ్రిటాల్: ఇది సుగర్ ఆల్కహాల్. తీపిగా ఉన్నా తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువగా ‘డైట్’, ‘సుగర్‌ఫ్రీ’ పానీయాలు, ప్రొటీన్ పౌడర్లలో వాడతారు. ప్రమాదం: ఇది తీసుకోవడం వల్ల శరీరంలోని ప్లేట్లెట్స్ అతిగా స్పందించి, రక్తం వేగంగా గడ్డకడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, గుండెజబ్బులు, మెదడులో రక్తంగడ్డ కట్టే అవకాశాలు పెరుగుతాయి.⇒ కార్బాక్సీమీథైల్ సెల్యులోజ్: దీనిని ఎక్కువగా ప్రాసెస్డ్ చీజ్, మాంసం ఉత్పత్తుల్లో వాడతారు. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, పానీయాల్లోను ఉపయోగిస్తారు. దీనివల్ల ఉత్పత్తులు ఎక్కువకాలం తాజాగా కనిపిస్తాయి.ప్రమాదం: ఇది మోతాదు మించితే కిడ్నీలను దెబ్బతీస్తుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, విరోచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అరుదుగా కొందరికి అలెర్జీలు కలిగే అవకాశాలు ఉంటాయి.⇒ పాలీసార్బేట్: ఇది ఎమల్సిఫైయర్. నీరు, నూనె ఒకదానిలో ఒకటి కలిసిపోయేలా చేస్తుంది. దీనిని ఎక్కువగా సాస్‌లు, మయోనైజ్, ఐస్‌క్రీమ్‌లు వంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు.ప్రమాదం: ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కొందరిలో అలర్జీలు, కళ్లలో మంట కలిగిస్తుంది. దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలు, కాలేయ సమస్యలు కలిగిస్తుంది.⇒ క్యారజీనన్: దీనిని సముద్రంలో దొరికే ఎర్రనాచు నుంచి తయారు చేస్తారు. చిక్కదనం కలిగించే ఈ పదార్థాన్ని ఎక్కువగా పాల ఉత్పత్తుల్లోను, సాస్‌లు, ఐస్‌క్రీమ్‌ల తయారీలోను వాడతారు.ప్రమాదం: దీనివల్ల కడుపు ఉబ్బరం, పేగుల వాపు సహా రకరకాల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియలు అస్తవ్యస్తంగా మారి డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్‌ను కలిగించవచ్చని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.⇒ సోడియం నైట్రైట్: దీనిని ఎక్కువగా ప్రాసెస్డ్ మాంసం ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఉత్పత్తులు ఎక్కువకాలం నిలవ ఉంటాయి.ప్రమాదం: దీనివల్ల శరీరంలోని కణజాలానికి తగిన మోతాదులో ఆక్సిజన్ అందదు. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మోతాదు మించితే క్యాన్సర్ ముప్పును కూడా కలిగిస్తుంది.⇒ మోడిఫైడ్ స్టార్చ్‌లు: పారిశ్రామిక వినియోగం కోసం మొక్కజొన్న, బంగాళదుంపలు, గోధుమల నుంచి తీసిన పిండి పదార్థాన్ని రసాయనాలతో శుద్ధి చేసి వీటిని తయారు చేస్తారు. వీటిని ఎక్కువగా సూప్ పౌడర్లు, సాస్‌లు, ఐస్‌క్రీమ్‌లు వంటి వాటిలో వాడతారు.ప్రమాదం: ఇవి శరీరంలోని చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. ఇన్సులిన్ నిరోధకతను పెంచి డయాబెటిస్ ముప్పు కలిగిస్తాయి. స్థూలకాయం, జీర్ణసమస్యలు, అలర్జీలు కూడా కలిగిస్తాయి.సురక్షితమైన ఆహారం మనుషుల ప్రాథమిక హక్కు. కాని, మనుషులకు అదే కరవవుతోంది. వీధిపక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు మొదలుకొని ఖరీదైన రెస్టరెంట్ల వరకు ప్రతిచోటా ఆహార కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లోనైతే కనిపించని ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. పెరటి పంటలు, ఇంటి వంటలు తప్ప మరేవీ సంపూర్ణ సురక్షితంగా ఉండటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారే అనుదిన ఆహారగండాలను గట్టెక్కడానికి ప్రయత్నించాలి. లేకుంటే, ఆస్పత్రులకు భారీ బిల్లులు చెల్లించక తప్పదు. -
అలాగే ప్రమాదం జరిగి.. అనూహ్యంగా తప్పించుకుని..
రాంచీ: రెండూ బస్సు అగ్ని ప్రమాదాలే. రెండు బస్సులను రహదారులపై అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఒక ఘటనలో బస్సు బుగ్గిపాలై 19 మందిని బలితీసుకుంటే మరో ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా ప్రమాదఘటన సుఖాంతంగా ముగిసింది. ఒకటి కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంకాగా మరోటి జార్ఖండ్లోది. డ్రైవర్ అప్రమత్తత, రెప్పపాటులో ప్రతిస్పందనలతో ఎలాంటి పెను ప్రమాదం నుంచైనా అవలీలగా తప్పించుకోవచ్చని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాదం ఘటన నిరూపించింది. రెండు బస్సుల్లోనూ దాదాపు ఒకే సంఖ్యలో ప్రయాణికులు ఉండటం గమనార్హం. అసలేం జరిగిందంటే? జార్ఖండ్‌లోని రాంచీలో శనివారం సాయంత్రం అత్యంత వేగంగా రహదారిపై పరుగుల తీస్తున్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది రాంచీ–లోహార్దగా జాతీయరహదారిపై మందార్ బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు అంటుకోగానే డ్రైవర్ రెప్పపాటుకాలంలో బస్సును ఆపేశాడు. ప్రయాణికులు అందర్నీ అప్రమత్తంచేసి అందర్నీ కిందకు దింపేశారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్ని ఆర్పేశారు. వీళ్లకు స్థానిక దుకాణదారులు సైతం సాయపడి తమ వంతుగా నీళ్లు, ఇసుక చల్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన వివరాలను మందార్ పోలీస్‌స్టేషన్ ఆఫీసర్–ఇన్చార్జ్ మనోజ్ కర్మాలీ వెల్లడించారు. ‘‘బస్సులో అక్రమంగా రసాయన పదార్థాలను తరలిస్తున్నారు. దాంతో అవి హఠాత్తుగా మండి బ్యాటరీబాక్స్ సమీపంలో షాట్ సర్క్యూట్‌కు కారణమయ్యాయి. దీంతో అగ్గిరాజుకొని బస్సును చుట్టుముట్టాయి. ఘటన తర్వాత బస్సును పోలీస్‌స్టేషన్ ప్రాంగణానికి తీసుకొచ్చాం. ప్రయాణికులందర్నీ తమతమ గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేశాం. బస్సులో అగ్నిమాపక ఉపకరణాలు లేవు. దీనిపై విచారణకు హాజరురావాలని బస్సు యజమానికి సమన్లు జారీచేశాం’’అని మనోజ్ కర్మాలీ చెప్పారు. అప్రమత్తత ఎలాంటి పెనువిషాదం నుంచైనా కాపాడుతుందని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాద ఘటన రుజువుచేసిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. -
వీడిన రేణుగుంట పేలుడు మిస్టరీ
సాక్షి, రేణిగుంట (చిత్తూరు జిల్లా): రేణిగుంట–కోడూరు రైల్వే మార్గంలో రైలు పట్టాలపై రసాయన వ్యర్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలివీ.. రేణిగుంట తారకరామానగర్‌కు చెందిన శశికళ (35) మంగళవారం గ్రామ శివారులో ఆవులను మేపుతోంది. ఆవులు రైలు పట్టాలపైకి వెళ్లడంతో వాటిని పక్కకు తోలేందుకు పట్టాలపైకి వెళ్లింది. రైలు పట్టాలపై ఓ బాక్స్ ఆమెకు అనుమానాస్పదంగా కనిపించడంతో చేతిలో ఉన్న గొడుగు సాయంతో బాక్స్‌ను కదిపింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో బాక్స్ పేలింది. దీంతో ఆమె చేతులు, కాళ్లు, ముఖానికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆమెను తిరుపతి రుయాకు తరలించారు. రైలు పట్టాలపై ఆ బాక్స్ ఉన్న సమయంలో రైళ్ల రాకపోకలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాంబ్ స్క్వాడ్ నిపుణులు అక్కడకు చేరుకుని పేలుడు అవశేషాలను సేకరించారు. రసాయన వ్యర్థాల వల్లే పేలుడు రసాయన వ్యర్థాలతో కూడిన డబ్బాను నిర్లక్ష్యంగా రైలు పట్టాలపై పడేయడం వల్లే ఈ పేలుడు ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి తెలిపారు. ఇనుప కడ్డీలను వేడి చేసేందుకు ఉపయోగించే మిథైల్ ఇథైల్ కీటో పెరాక్సైడ్ అనే రా మెటీరియల్‌తో కూడిన డబ్బాను స్థానికంగా ఉన్న బాలాజి వెల్డింగ్ షాపు నుంచి తెచ్చి ఇక్కడ పడేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాపు యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. (చదవండి: స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై) -
యమ డేంజర్.. ఈ ‘కలుపు’ మందు
పొలాల్లో కలుపు తీయడానికి, దాన్ని నాశనం చేయడానికి ఉపయోగించే పారాక్వాట్ (డైపిరిడిలియం) అనే రసాయన పదార్థం ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఇంట్లో, పొలంలో ఈ రసాయనం అందుబాటులో ఉంటుండడంతో క్షణికావేశంలో తాగిన వారు నేరుగా మృత్యుఒడికి చేరుతున్నారు. దీనికి విరుగుడు చికిత్స లేకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. దీని బారిన పడిన వారిలో ఏకంగా 99 శాతం మంది చనిపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పుడు ‘ఓపీ పాయిజన్’ కేసులు వస్తే వైద్యులు ముందుగా ‘పారాక్వాట్’ తీసుకున్నారా అని అడుగుతున్నారు. దాదాపు అన్ని పంట పొలాల్లో కలుపు తీయడానికి రైతులు దీన్ని వాడుతున్నారు. దీంతో ప్రతి రైతు ఇంట్లోనూ అందుబాటులో ఉంటోంది. క్షణికావేశానికి లోనైన వారు వెంటనే అందుబాటులో ఉన్న ఈ విషపూరిత ద్రావకం తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రస్తుతం ఈ మందు తాగిన వారు, పొలంలో దీన్ని పిచికారీ చేస్తూ విషప్రభావానికి లోనైన వారు అధికంగా చికిత్స కోసం వస్తున్నారు. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)కే నెలకు 8 –10 కేసులు తగ్గకుండా వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు మూడేళ్లుగా ఇదే పరిస్థితి. నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం నెలకు ఇద్దరు నుంచి ఐదుగురు విష ప్రభావానికి లోనై వస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు సైతం నెలకు 20– 30 మంది వస్తున్నారు. వీరిలో 99 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటిదాకా మరణించిన వారిలో కర్నూలు జిల్లాతో పాటు వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల వారూ ఉన్నారు. దీన్నిబట్టి ఆయా జిల్లాల్లోనూ అధికంగానే వాడుతున్నట్లు స్పష్టమవుతోంది. అనర్థం ఇలా... పారాక్వాట్ పిచికారీ చేసే సమయంలో విష ప్రభావం గాలి ద్వారాఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. మెల్లగా ఊపిరితిత్తులు నాశనమై..ప్రాణాలు పోతాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘పారాక్విడ్ లంగ్’ అని పిలుస్తున్నారు. ఇది ఇంకా చర్మంపై పడటం, కంటి ద్వారానూ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ రసాయనిక మందును నోటి ద్వారా తీసుకుంటే నోరు, గొంతు, ఆహార వాహికలో కాలిన పుండ్లు ఏర్పడతాయి. ఆహార వాహికకు రంధ్రాలు కూడా పడొచ్చు. నోరు, గొంతునొప్పి రావడం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, ఒక్కోసారి రక్తవిరేచనాలు అవుతాయి. ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, గుండె మెల్లగా పాడయిపోతాయి. కిడ్నీలకు జరిగే నష్టాన్ని వైద్యం ద్వారా కొంచెం వరకు తగ్గించకల్గినా, ఊపిరితిత్తులు, కాలేయం మాత్రం పూర్తిగా పాడై మనిషి చనిపోతున్నాడు. ఈ విషానికి విరుగుడు లేదు.. ‘ప్యారాక్వాట్’ విషపదార్థానికి ప్రపంచంలో ఎక్కడా విరుగుడు మందు లేదని వైద్యులు చెబుతున్నారు. దీని ప్రభావానికి లోనైన వారికి లక్షణాలను బట్టి మాత్రమే వైద్యం చేస్తారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దీంతో 99 శాతం మంది మరణిస్తున్నారు. పారాక్వాట్ బారిన పడకుండా ఉండాలంటే.. ♦ ఈ రసాయనాన్ని విక్రయించే వారు రైతులకు సరైన సమాచారం ఇవ్వాలి. దీనివల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి పూర్తిస్థాయిలో తెలియజేయాలి. ♦ పిల్లలకు, మానసిక స్థితి సరిగా లేని వారికి అందుబాటులో ఉంచకూడదు. ♦ పొలాల్లో పిచికారీ చేసే సమయంలో రక్షణ దుస్తులు, పరికరాలు (కళ్లద్దాలు, నోటికి గుడ్డ, చర్మంపై పడకుండా ప్లాస్టిక్ దుస్తులు ధరించడం) ఉపయోగించాలి. æ ఈ రసాయనం వల్ల నీరు (బావులు, చెరువులు, వంకలు, కుంటలు)తో పాటు ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. ♦ ఈ రసాయనాన్ని వాడిన తర్వాత చేతులు, శరీరం శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఖాళీ డబ్బాలు, సంచులను పొడి ప్రాంతంలో కాల్చి వేయాలి. తక్షణం ఏం చేయాలంటే.. ♦ మొదట శరీరంపై ఉన్న దుస్తులను తొలగించాలి. శరీరం మొత్తం శుభ్రమైన సబ్బు నీటితో 15 నిమిషాలు కడగాలి. కళ్లను కూడా శుభ్రమైన నీటితో 15 నిమిషాలు కడగాలి. దుస్తులు జాగ్రత్తగా, చేతికి తగలకుండా కత్తిరించి తీసేయాలి. తర్వాత వాటిని తగులబెట్టాలి. ♦ వీలైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అది తాగితే బతకడం కష్టం పారాక్వాట్ అతి ప్రమాదకర రసాయనం. దీన్ని తాగితే బతకడం కష్టం. ఒడిశాలోని బుర్లా ప్రాంతంలో రెండేళ్ల వ్యవధిలోనే 177 మంది దీని బారిన పడ్డారు. వారిలో ముగ్గురు మాత్రమే బతికారు. 2019 సెప్టెంబర్‌లో అక్కడి వైద్యులు నిరసన తెలపడంతో ఒడిశా ప్రభుత్వం దీన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. కేరళలో దీన్ని పూర్తిగా నిషేధించారు. అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ, దీని జన్మస్థానమైన స్విట్జర్లాండ్‌లోనూ నిషేధం విధించారు. దీన్ని మన దేశంలో 25 రకాల పంటలకు వాడుతున్నారు. మన జిల్లాలోనూ దీని వాడకం పెరగడం ఆందోళన కల్గించే అంశం. దీన్ని కేవలం తొమ్మిది రకాల పంటలకు వాడాలని సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ పేర్కొన్నప్పటికీ అవగాహన లేమితో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. –డాక్టర్ రవికళాధర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్, కర్నూలు కర్నూలు పెద్దాసుపత్రికి ప్రతి నెలా 8 నుంచి 10 మంది దాకా కర్నూలు, వైఎస్సార్ జిల్లా, అనంతపురం, తెలంగాణ జిల్లాల నుంచి పారాక్వాట్ మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన వారు, విష ప్రభావానికి గురైన వారు చికిత్స కోసం వస్తున్నారు. వారిని ఆసుపత్రిలోని ఏఎంసీ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వచ్చిన వారిలో 99 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. ఏఎంసీలో చికిత్స పొందుతూ గత నవంబర్‌లో వెంకటసుబ్బారెడ్డి, రుక్మిణి, చిట్టెమ్మ, డిసెంబర్లో ఆర్.ఆనంద్, మహమ్మద్ రఫి, జనవరిలో మహేశ్వరమ్మ, భరత్‌కుమార్, ఫిబ్రవరిలోఎన్.తనూజా చనిపోయారు. మరికొందరు ఏఎంసీ విభాగానికి రాకముందే క్యాజు వాలిటీకి వచ్చిన గంటలోపే మరణించారు. -
రసాయనాలు పేలి ఇద్దరి దుర్మరణం
మరొకరికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని ఓ ఇంట్లో శనివారం రాత్రి రసాయన పదార్థాలు పేలడంతో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా కొడకండ్లకు చెందిన పెంటం నాగార్జునకుమార్(35), పెంటం శ్రీనివాస్‌కుమార్(34), మల్ల రామ కృష్ణారెడ్డి(42) హౌసింగ్‌బోర్డులోని ఓ ఇంట్లో రసాయన పదార్థాలతో బొమ్మలు చేస్తూ దుకాణాలకు సరఫరా చేస్తుండేవారు. శనివారం ఎప్పటిలాగే బొమ్మలు తయారు చేయగా.. మిగిలిన పదార్ధాలను ఇంటి సమీపంలో పారేశారు. అక్కడ మధ్యాహ్నం సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. కాగా ఎక్స్‌పెయిరీ డేట్ ముగిసిన హార్డినర్ పౌడర్‌లో నీళ్లు కలిపి పారబోసేద్దామని ఆదివారం శ్రీనివాస్ ప్రయత్నించగా అది పెద్ద శబ్దంతో పేలి మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో నాగార్జునకుమార్, మల్ల రామకృష్ణారెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. శ్రీనివాస్ చేతులు తెగిపోయాయి. కాళ్లు ఇతర భాగాలు నుజ్జునుజ్జుయ్యాయి. పేలుడు ధాటికి గదిలోని కిటికీలు, తలుపులు దూరంగా ఎగిరిపడగా ఒక పక్క గోడ పూర్తిగా బద్దలైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌కుమార్‌ను హైదారాబాద్‌కు తరలించారు. -
మత్తుతో చిత్తు
మత్తులో యువత చిత్తవుతోంది. సరదాగా మొదలెడుతున్న ఈ వ్యవహారం వ్యసనంగా మారి భవిష్యత్‌ను చీకటి చేస్తోంది. స్నేహితుడికి అలవాటు ఉందనో, సరదాగా ఉం టుందనో, ఇంట్లో నాన్నకు కూడా అలవాటే కదా అనో యువత మత్తు పదార్థాలను తీసుకోవడం మొదలు పెడుతున్నారు. కానీ ఈ మొదలు వారి బంగారు భవిష్యత్‌ను అంతం చేస్తోంది. పదిహేనేళ్ల నుంచి పంతొమ్మిదేళ్ల లోపు కుర్రాళ్లు ఈ అలవాట్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా సాధారణ పట్టణాలు, గ్రామాల్లోని యువత గుట్కా, ఖైనీ వంటి వాటిపై మొగ్గు చూపుతున్నారు. కాలక్షేపానికి, వినోదానికి, స్టైల్ కోసం చేసే ఈ పని రోగాలను తీసుకువస్తుందని వారికి తెలియడం లేదు. చదువు లేని యువకులే కాకుండా చదువుకున్న వారు కూడా ఈ దారిలోనే నడుస్తుండడం విచారకరం. గుట్కాలో రసాయన పదార్థాలు బెటల్ నెట్స్, కొటెట్, టుబాకో, లైమ్, సాఫ్రిన్, సింథటిక్, ఆరోనాటిక్ రసాయన ఫ్లేవర్లు ఉన్నాయి. ఇవి కొంత సమయం మత్తును కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వీటికి బానిస అయితే మాత్రం అనారోగ్యం కలుగుతుందని, జీర్ణశక్తి తగ్గడం, నరాల బలహీనత, రక్తహీనత వంటివ్యాధులు వచ్చి క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నాయి. ఇవి తెలిసినా చాలా మంది ఈ అలవాటును మానలేకపోతున్నారు. ఖైనీ తినేటప్పుడు చాలా మంది దిగువ పెదవి లోపలపెడతారు. దీంతో పెదవి పొక్కి చీము పుండ్లు పుట్టే అవకాశం ఉంది. గుట్కా, పాన్‌పరాగ్, మసాలాలు నమలడం వల్ల కొంత కాలానికి దంతాల చిగుళ్లు పూర్తిగా ఒరిసి కుళ్లిపోయి దంతాలు పూర్తిగా పాడై పోతాయి. నోరంతా దుర్వాసన రావడం మొదలవుతుంది. పొగతాగటం కన్నా ఖైనీ, పాన్‌పరాగ్‌లు వేసుకోవడం ప్రాణాంతకం. ఖైనీలు, పాన్‌పరాగ్‌లు విచ్చలవిడిగా పాన్‌షాపుల్లో, చిన్నదుకాణాల్లో సైతం లభ్యమవుతుండటంతో కుర్రా ళ్లు ఇంట్లో తెలియకుండా వీటిని వాడుతున్నారు. ఇవి లేకుండా ఏమీ చేయలేకపోతున్నామని చాలా మంది చెబుతుండడం విశేషం. రిక్షా కార్మికుల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అందరూ దీనికి బానిసలే. ఒకప్పుడు వీటిపై నిషేధం విధించిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని సరిగా అమలు చేయకపోవడంతో వీటి విక్రయా లు ఊపందుకున్నాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. పాన్‌పరాగ్, గుట్కా, ఖైనీలపై ప్రభుత్వం నిషేధం విధించి వీటి విక్రయాలను పూర్తిస్థాయిలో తగ్గించాలని పలువురు కోరుతున్నారు. -
మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్మీటర్స్ పాత్ర!
మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు (మెదడు కణాలు) ఉంటాయి. ప్రతి ఒక్క కణం, తక్కిన కణాలతో రసాయనికంగా అనుసంధానించబడి ఒకదానితో ఒకటి సందేశాలను మార్చుకొంటూ ఉంటాయి. ఈ అనుసంధానకాలను న్యూరో ట్రాన్స్మిటర్లు లేదా రసాయనిక ప్రసారకాలు (Neurotransmeter or Chemical messengers) అంటారు. మన ఆవేశ అనుభూతులను న్యూరోట్రాన్స్మిటర్లు అదుపుచేస్తాయి. మెదడులోని ఆవేశ కేంద్రం (Emotion Center) లో ఐదు రకాల రసాయనిక పదార్థాలు లేదా న్యూరోట్రాన్స్మిటర్లు ఉంటాయి. అధికమైన న్యూరోట్రాన్స్మిటర్లకు, ఇతర న్యూరో ట్రాన్స్మిటర్ల మధ్యన ఉండవలసిన నిష్పత్తిలో తేడా వచ్చి రసాయనిక సమతుల్యత చెడుతుంది. ఈ దశలోనే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనుభవంలోనికి వస్తుంది. దీని ఫలితంగా శరీరంలో విడుదలైన హానికరమైన రసాయనిక పదార్థాలు, శరీర కణాలకు హాని చేసి మరింత స్ట్రెస్ పెరుగుదలకు కారణమవుతంది. ఈ విధంగా వరుసగా వచ్చే క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం (Stress Cycle) అంటారు. దీని ఫలితంగా ఆవేశపరమైన నిస్త్రాణ (Emotional Fatigue), డిప్రెషన్ అనుభవంలోకి వస్తాయి. మన ఆవేశ అనుభూతులకు అదుపు చేసే న్యూరోట్రాన్స్మిటర్లు మెదడులోని కణాల మధ్య ఆవేశ-అనుభూతులను ఒక దానికొకటి సందేశాలను మార్చుకొనడంలో ప్రధానపాత్ర వహించే రసాయనిక సంధానకాలను న్యూరోట్రాన్స్మిటర్ లేదా నాడీరసాయనిక ప్రసారకాలు అంటారన్న విషయం తెలిసిందే. ప్రధానంగా న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థలను క్రింది విధంగా విభజించవచ్చు. న్యూరోట్రాన్స్మిటర్పై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? రోజువారి స్ట్రెస్‌ను ఎండార్ఫిన్లు నిభాయిస్తాయి. వీటిని సద్భావ నాడీ రసాయనిక ప్రసారకాలు Feel good transmiter (సద్భావ న్యూరో ట్రాన్స్మిటర్లు) అని కూడా అంటారు. అధికమైన లేదా పరిమితికి మించిన స్ట్రెస్‌ను తట్టుకోడానికి ఎక్కువ మొత్తంలో ఎండార్ఫిన్లను మెదడు కణాలు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దీనిలో ఇతర న్యూరోట్రాన్స్‌మిటర్‌లతో ఎండార్ఫిన్ల మధ్యన ఉన్న నిష్పత్తిలో తేడాలు అధికమై రసాయనిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఎదుర్కొనే స్ట్రెస్ (acute stress) దానిని ఎదుర్కొనే సందర్భంలో వచ్చే ఆతురత, అత్యవసర ప్రేరణలు స్ట్రెస్ పాళ్లను మరింత పెంచుతాయి. ఈ ప్రక్రియలో అనవసర లేదా హానికర రసాయనిక పదార్థాలు విడుదలై శరీరానికి మరింత నష్టం జరుగుతుంది. వరుసక్రమంలో వచ్చే ఈ క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం-Stress Cycle అంటారు. శరీర అవయవాలపై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? శరీరంలోని అన్ని అవయవాలు, వాటి పని తీరుపై స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. శరీరంపై స్ట్రెస్ ప్రభావం పెరిగినకొద్దీ ఒక వరుస క్రమంలో శరీర సాధారణ క్రియలలో మార్పులు వస్తాయి. ప్రధానంగా ఎడ్రినాలిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రక్తప్రసరణల లేదా రక్తపోటు పెరుగుదల, గుండె చలన రేటుతో పాటు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ తగ్గుదల లేదా ఆగిపోవటం జరుగుతుంది. ఆడ్రినాలిన్ ఉత్పత్తి అధికమైనకొద్దీ శరీరానికి కావలసిన అధికశక్తిని అందించటానికి ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్ అధికమవుతుంది. శరీరంలోని పిట్యుటరీగ్రంథి ఎడ్రినా కార్బికో ట్రోఫిక్ హార్మోను-ACTH ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఈ హార్మోను కార్టిజోన్, కార్టిజోన్ హార్మోన్ల విడుదలకు ప్రేరణ కలిగిస్తుంది. ఈ హార్మోన్లు రోగక్రిములతో పోరాడే రక్తంలోని తెల్లకణాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. రోగరక్షక వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ తాలూకు విధులను నిర్వహించకుండా నిరోధిస్తాయి. ఇటీవల చూస్తున్న అనేక ప్రధాన రోగాలలో 80 శాతం స్ట్రెస్ కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని ఆరోగ్య వైద్య సంస్థ ప్రస్తుతం చూస్తున్న అన్నిరకాల రుగ్మతలకు 75 శాతం రోగ కారణం స్ట్రెస్ అనే గుర్తించారు. వైద్యులు రోజువారి చూసే రోగులలో 75-90 శాతం మందికి స్ట్రెస్ కారణంగా వచ్చే రోగాలకు చికిత్సను అందిస్తున్నట్లు ఒక అంచనా. ఆకస్మిక స్ట్రెస్ శరీర రసాయనిక స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. స్ట్రెస్ కారకం దీర్ఘకాలం కొనసాగుతుంటే శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరరోగ రక్షణ వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశవ్యాధుల తీవ్రత పెరుగుతుంది. స్ట్రెస్ అన్నది రోగాల తీవ్రతను పెంచటానికే కాక, రోగం తగ్గడాన్ని, రోగం తగ్గిన తరువాత కోలుకోవడాన్ని కూడా నిరోధిస్తుంది. ఏ విధంగా చూసినా శారీరక ఆరోగ్య సంక్షేమంలో స్ట్రెస్ లేకపోవడం అన్నది చాలా కీలకపాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందువలన తప్పనిసరిగా అదనపు అధిక స్ట్రెస్ బాధలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాల్సి ఉంటుంది. హోమియో చికిత్స ఈ న్యూరోట్రాన్స్మిటర్ల రసాయనిక చర్య, ప్రతిచర్యలను పరిగణనలోకి తీసుకొని, లక్షణాలను బట్టి, ఆ మనిషి ఏ విధంగా దీన్ని తట్టుకోగలుగుతున్నాడు, ఈ న్యూరోట్రాన్స్మిటర్స్ ప్రభావం ఎంతవరకు రోగలక్షణాలకు కారణం అవుతున్నాయి, జబ్బుకు ఏ మియజమ్ కారణం అవుతుంది, మూడు మియాజమ్లైన సొరా, సైకోసిస్, సిఫిలిస్లలో ఏది ప్రభావితమవుతోంది, దానికి తగ్గ మందులు ఎంత పొటెన్సీలతో ఇవ్వాలన్నది హోమియో డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వవలసి ఉంటుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109


